WiFi hotspots
-
సెల్‌ఫోన్ యూజర్స్‌కు అలర్ట్.. పొంచి ఉన్న ‘బ్లూబగ్గింగ్’
సాక్షి, విజయవాడ: ఫోన్లో బ్లూటూత్.. వైఫై, హాట్ స్పాట్ ఎప్పుడూ ఆన్ చేసుకుని ఉంటున్నారా.. అయితే జాగ్రత్త పడండి. సైబర్ నేరగాళ్లు మాటు వేసి ఉంటున్నారు. ఫోన్లోని వ్యక్తిగత సమాచారమంతా దోచేస్తున్నారు. ఆ తర్వాత వేధింపులు, బెదిరింపులతో మానసిక క్షోభకు గురి చేసి.. అందిన కాడికి దండుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి బ్లూబగ్గింగ్ తరహా ఘటనలు పెరిగిపోతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో.. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే బ్లూ బగ్గింగ్ నేరాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు పది మీటర్ల దూరం నుంచే బ్లూటూత్, హాట్‌స్పాట్ ద్వారా ‘పెయిర్’ రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. ఏదో పనిలో ఉండి చూసుకోకుండా ‘ఓకే’ బటన్ క్లిక్ చేయగానే సైబర్ నేరగాళ్ల ఫోన్‌తో మన ఫోన్ కనెక్టవుతుంది. వెంటనే మాల్వేర్తో పాటు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ప్రోగ్రామింగ్‌ను ఫోన్లోకి పంపిస్తారు. అక్కడి నుంచి మన ఫోన్ ఆపరేటింగ్ పూర్తిగా వారి చేతిలోకి వెళ్లిపోతుంది. ఫోన్లో బ్లూటూత్ ఆపేసినా.. వారు అప్పటికే పంపించిన ప్రోగ్రామింగ్, మాల్వేర్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు. సాధారణంగా వైఫై వినియోగించే వారికి తప్పనిసరిగా పాస్వర్డ్ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాల్లో వైఫై ఫ్రీగా లభ్యమవుతోంది. ఫోన్లో వైఫై ఆప్షన్ ఆన్ చేసుకున్న వారికి ఆటోమేటిక్‌గా వైఫై కనెక్ట్ అవుతోంది. ఫ్రీగా వైఫై ఇచ్చే ప్రాంతాల్లో తరచూ బ్లూబగ్గింగ్ సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. క్విక్ సపోర్ట్, టీం వ్యూయర్, ఎనీడెస్క్ తదితర యాప్స్ సాయంతో ఫోన్ ఆపరేటింగ్ మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు పసిగడుతుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ముందుగా సొమ్మును దోచేస్తున్నారు. ఫొటోలు, వీడియోలను పూర్తిగా కాపీ చేసుకుని.. వాటిని మారి్ఫంగ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి దొరికినంత లాగేస్తున్నారు. మన ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను సైబర్ నేరగాళ్లు పూర్తిగా వారి మొబైల్‌కు మళ్లించుకుంటున్న ఘటనలు కూడా జరిగాయని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ తరహా కేసులు ఇప్పటివరకు విజయవాడ కమిషనరేట్ పరిధిలో 15 వెలుగు చూశాయని పోలీసులు చెప్పారు. అప్రమత్తంగా ఉండాలి బ్లూ బగ్గింగ్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బ్లూటూత్, వైఫై, హాట్స్పాట్లను అవసరమైనప్పుడే ఆన్ చేసుకోవాలి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించకుండా ఉంటే మంచింది. స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే పెయిర్ రిక్వెస్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించొద్దు. – ఎల్.రాజవర్ష, ఎస్ఐ, సైబర్ పోలీస్‌స్టేషన్ -
మీ వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా?
ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ యుగంలో వై-ఫై అంటే తెలియని వాళ్లు చాలా కొద్దీ మాత్రమే ఉంటారు. ప్రస్తుత కరోనా కాలంలో గతంలో వై-ఫై ఉపయోగించని వారు కూడా ఇప్పుడు ఉపయోగించాల్సి వస్తుంది. దీనికి తోడు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ క్లాసుల పుణ్యమా అని గతం కంటే ఎక్కువగా వై-ఫైలు వాడకం బాగా పెరిగిపోయింది. లాక్ డౌన్ తర్వాత మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వై-ఫై వాడకం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. వైఫై కనెక్షన్ కోసం మీరు మంచి బ్రాడ్ బ్యాండ్ ని ఎంచుకొని ఉన్న కొన్ని సార్లు సమస్యలు ఎదుర్కొంటారు కొందరు. దానికి ప్రధాన కారణం వారు చేసే చిన్న తప్పులే. అయితే ఇప్పుడు మీ వై-ఫై వేగాన్ని పెంచే కొన్ని మార్గాలను మనం తెలుసుకుందాం. (చదవండి: గూగుల్ డ్యుయో సేవలు నిలిపివేత!) వై-ఫై వేగాన్ని పెంచడానికి ఈ టిప్స్ పాటించండి: మొదటగా మీరు మీ ఇంట్లో వై-ఫై అవసరం లేకపోయినా దానికి కనెక్ట్ చేయబడిన ఎలక్ట్రానిక్ పరికరాలను ముందుగా డిస్ కనెక్ట్ చేయండి. కొన్ని సార్లు మీరు వై-ఫై రూటర్ ప్రక్కన నిలబడితే మాత్రమే వై-ఫై సిగ్నల్ వస్తుంటే ముందుగా మీ వై-ఫై రూటర్ స్థానాన్ని మార్చండి. అది కూడా మీ గదిలో మధ్యలో ఉండే విదంగా చూసుకోండి. అలాగే దాని పక్కన ఎలాంటి ఎలక్ట్రానిక్, ఐరన్ వంటివి లేకుండా చూసుకోండి. అలాగే ముందుగా మీ ఇంటి యొక్క అవసరాలను గుర్తించండి. చాలా మంది వారి ఇంటిలో ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్న తక్కువ స్పీడ్ గల వై-ఫై కనెక్షన్ తీసుకోవడానికి ఇష్టపడుతారు. దీని వల్ల కొన్ని సార్లు మనకు అత్యవసర సమయంలో వై-ఫై సిగ్నల్ తగ్గిపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ 2.4గిగాహెర్ట్జ్ నుంచి 5గిగాహెర్ట్జ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ గల రూటర్ ని మీ అవసరాని బట్టి ఎంచుకోవాలి. మీ వై-ఫై వేగాన్ని పరిశీలించండి. ఒక్కోసారి మీరు వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరంలో ఏదైనా సమస్యలు ఉంటే తక్కువ స్పీడ్ వచ్చే అవకాశం ఉంది. ఇతర పరికరాలలో కూడా ఒక సారి వైఫై వేగాన్ని కొలవండి. దీని కోసం fast.com ను ఉపయోగించవచ్చు. ఒకవేల ఏదైనా సమస్య ఉన్నట్లు అయితే ముందుగా మీ పరికరంలో నెట్ వర్క్ సెట్టింగ్స్ చేయండి. మీరు ఎక్కువ మంది నివసించే ప్రాంతాలలో ఉంటే మాత్రం ఇతర నెట్ వర్క్, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే సిగ్నల్ మీకు కనెక్ట్ కావడానికి మీ రూటర్ పై ప్రభావం చూపుతుంది. అందువల్ల మీ రూటర్ లో ఛానల్ ఎంపిక మోడ్ సెట్ చేసుకోవాలి లేదా మీకు నచ్చిన ఛానెల్ ని మీరు స్వయంగా ఎంచుకోవచ్చు. కొన్ని సార్లు వై-ఫై తగ్గిపోవడానికి రూటర్ యాంటెన్నా కూడా కారణం కావచ్చు. అందుకని ఒకసారి మీ రూటర్ యాంటెన్నాల పోజిషన్ ను మార్చి చూడండి. అలాగే, ఒకసారి వై-ఫై రూటర్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయండి. ఇప్పటికి కూడా మీ వై-ఫై వేగం పెరగకపోతే రూటర్ లేదా వై-ఫై కనెక్షన్ సేవలను మార్చి చూడండి. అంటే వేరే రూటర్ తీసుకోవడం లేదా వేరే వైఫై కనెక్షన్ తీసుకోవడం మంచిది. -
హైదరాబాద్ లో 1000 వైఫై హాట్ స్పాట్స్
తెలంగాణ ప్రభుత్వం నగరంలో 1000 పబ్లిక్ హాట్ స్పాట్లను ఏర్పాటుచేసింది. మంగళవారం లాంచ్ చేసిన 'హైదరాబాద్ సిటీ వైఫై' ప్రాజెక్ట్ కింద 1000కి పైగా పబ్లిక్ ప్రదేశాల్లో ఈ వైర్ లెస్ నెట్ వర్క్ టెక్నాలజీని అందించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్ బీ రామ్మోహన్ ఈ ప్రాజెక్టు ను లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్టు కింద నగరంలో మొత్తం 3000 హాట్ స్పాట్లను ఏర్పాటుచేయనున్నట్టు తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ చెప్పారు. వీటికోసం 3000 పబ్లిక్ ప్రాంతాలను కూడా గుర్తించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ నెట్ వర్క్ 1000 హాట్ స్పాట్లను ఇన్ స్టాల్ చేసింది. ఈ హాట్ స్పాట్ల కింద 5-10ఎంబీపీఎస్ బ్యాండ్ విత్ లో 30 నిమిషాల పాటు ఉచిత వై-ఫైను అందించనుంది. మిగతా 2000 ప్రాంతాల్లో వచ్చే మూడు నెలల్లో ఏర్పాటుచేయనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం ధర రూ.300 కోట్లు. 2015 జూన్ లో తీసుకొచ్చిన డిజిటల్ తెలంగాణ కింద ప్రభుత్వం ఈ పైలెట్ వెర్షన్ హైదరాబాద్ సిటీ వైఫై ప్రాజెక్టును లాంచ్ చేసింది. ఈ ప్రాజెక్టును వరంగల్, కరింనగర్, ఖమ్మం జిల్లాలకు కూడా విస్తరించనున్నట్టు రంజన్ చెప్పారు. -
‘యాక్ట్’తో ఎక్కడున్నా ఇంటర్నెట్
⇔ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉంటే చాలు ⇔ వైఫై జోన్లతో నగరమంతా కనెక్టివిటీ ⇔ యాక్ట్ ఫైబర్‌నెట్ సీఈవో బాల మల్లాది హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంట్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్.. మరి బయటకు వెళితే మొబైల్లో డేటా ప్యాక్. ఇప్పుడు చాలా మంది కస్టమర్లు అనుసరిస్తున్న విధానమిది. ఇన్నేసి ఖర్చులు లేకుండా ఇంట్లో ఉన్న బ్రాడ్‌బ్యాండ్ కనెక్షనే ఎక్కడికి వెళ్లినా పనిచేసేలా ఉంటే.. సరిగ్గా ఈ విధానాన్నే యాక్ట్ ఫైబర్‌నెట్ (అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్) ఆచరణలో పెడుతోంది. కంపెనీ సేవలు అందిస్తున్న నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు ఎక్కడున్నా అంతరాయం లేని ఇంటర్నెట్ సేవలు 24 గంటలు అందించేందుకు వైఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేస్తోంది. వినియోగదార్లు ఇందుకోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకపోవడం విశేషం. ఇక స్పీడ్ అంటారా.. ఇంట్లో వాడే ప్యాక్‌ను బట్టి వైఫై జోన్లో కూడా అదే వేగంతో నెట్ ఎంజాయ్ చేయొచ్చు. తొలుత హైదరాబాద్..: వైఫై జోన్లను కంపెనీ తొలుత హైదరాబాద్‌లో ప్రవేశపెడుతోంది. ఇప్పటికే 200 çహŸట్స్పాట్స్ ఏర్పాటయ్యాయి. మరో 800 ఏప్రిల్‌లోనే రానున్నాయి. ఇవి కనెక్ట్ అయితే హైదరాబాద్‌లో 70 శాతం కవరేజ్ ఉంటుంది. భాగ్యనగరి మొత్తం కవరేజ్‌కు రెండేళ్లు పడుతుందని యాక్ట్ ఫైబర్‌నెట్ సీఈవో బాల మల్లాది సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ప్రతి రోజు 1.40 లక్షల మంది లాగిన్ అవుతున్నారని చెప్పారు. వీరిలో 70 శాతం మంది యాక్ట్ కస్టమర్లు ఉంటారని తెలిపారు. హాట్‌స్పాట్ జోన్లో ఇతరులు 30–45 నిముషాలు ఉచితంగా ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. వైఫై జోన్లలో యాక్ట్ కస్టమర్లు ఉపయోగించిన డేటాను బ్రాడ్‌బ్యాండ్ ఖాతా కిందే పరిగణిస్తారు. అంటే వైఫై ద్వారా ఒక నెలలో 10 జీబీ డేటా వాడితే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కింద ఇచ్చే ఉచిత డేటా నుంచి తగ్గిస్తారు. గెస్ట్ యూజర్లకు 10 ఎంబీపీఎస్ స్పీడ్, యాక్ట్ కస్టమర్లకు వారి బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌నుబట్టి స్పీడ్ ఉంటుంది. బెంగళూరులో ఇటువంటి వైఫై ప్రాజెక్టుకు కంపెనీ శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత యాక్ట్ సేవలు అందిస్తున్న ఇతర నగరాలకు విస్తరించనున్నారు. కొత్త నగరాలకు బ్రాడ్‌బ్యాండ్.. ప్రస్తుతం యాక్ట్ ఫైబర్‌నెట్ 11 నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది. దేశంలో మూడో అతిపెద్ద ఇంటర్నెట్ సేవల కంపెనీ అయిన ఈ సంస్థకు మొత్తం 12 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. తెలంగాణలో రెండేళ్లలో మరో 6 నగరాల్లో అడుగు పెట్టాలని లక్ష్యంగా చేసుకుంది. 5 లక్షల జనాభా ఉన్న నగరాలకు విస్తరిస్తామని బాల మల్లాది చెప్పారు. దేశవ్యాప్తంగా 2020 నాటికి మొత్తం 25 నగరాల్లో యాక్ట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. వైఫై హాట్‌స్పాట్స్‌తో కస్టమర్లకు 24 గంటలు సేవలు ఉంటాయని వివరించారు. ఈ రంగంలోనూ కన్సాలిడేషన్.. 4జీ రాకతో చాలామందికి ఇంటర్నెట్ అంటే ఏంటో అవగాహన వచ్చిందని బాల మల్లాది చెప్పారు. ‘బ్రాడ్‌బ్యాండ్ పరిశ్రమకు ఇది మంచి అవకాశం. భవిష్యత్ ఇంకా బాగుంటుంది. కనెక్షన్లు అధికమవుతాయి. ఇక టెలికం కంపెనీల మాదిరిగా వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లోనూ కన్సాలిడేషన్ ఖాయం. పెద్ద సంస్థలే మిగులుతాయి. అవకాశం వస్తే ఈ రంగంలోని ఇతర కంపెనీల కొనుగోలుకు మేం ఎప్పుడూ సిద్ధమే. విస్తరణకు రెండేళ్లలో రూ.1,200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. పరిశ్రమ సింగిల్ డిజిట్లో వృద్ధి చెందితే, యాక్ట్ 40 శాతం వృద్ధి నమోదు చేస్తోంది’ అని తెలిపారు. హైదరాబాద్‌లో కొత్తగా 600 మందిని నియమిస్తామని వివరించారు. -
500 వైఫై హాట్స్పాట్లు: రైల్వే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో 500 ఉచిత వైఫై హాట్స్పాట్లను నెలకొల్పనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వీటి సాయంతో ఈ–కామర్స్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఈ–టికెట్ బుకింగ్, మొబైల్, డీటీహెచ్ రీచార్జ్ వంటి సేవలను పొందవచ్చని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. ‘రైల్‌వైర్ సాథీ’ పేరుతో ప్రారంభించనున్న ఈ పథకంలో ఉచిత వైఫై కేంద్రాల ఏర్పాటుతో పాటు గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించనున్నారు. రైల్వే టెలికం విభాగం ‘రైల్‌టెల్’ ఈ పథకాన్ని అమలుపర్చనుంది. ఈ సేవలు మే నెలకల్లా ప్రారంభమవుతాయని రైల్వే వర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు, ముఖ్యంగా మహిళలకు ఈ పథకం ద్వారా వైఫై హాట్‌స్పాట్ కేంద్రాల ఏర్పాటుపై శిక్షణ ఇవ్వనున్నారు. -
బీఎస్ఎన్ఎల్ పెట్టుబడుల జోరు..
-
బీఎస్ఎన్ఎల్ పెట్టుబడుల జోరు..
• ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7వేల కోట్ల వ్యయం • అక్టోబర్-మార్చి మధ్య రూ.2,500 కోట్ల పెట్టుబడులు • హాట్స్పాట్లు, టవర్ల విస్తరణ, నెట్వర్క్ బలోపేతం న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ టెలికం కంపెనీలకు గట్టి పోటీనిచ్చే దిశగా ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తన నెట్వర్క్ సామర్థ్యాలను బలోపేతం చేసుకునే పనిలో పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016-17)లో మిగిలి ఉన్న ఆరు నెలల కాలంలో రూ.2,500 కోట్లను పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. వైఫై హాట్స్పాట్లు, మొబైల్ టవర్ల ఏర్పాటు, కోర్ నెట్వర్క్ విస్తరణ సహా పలు రకాల ప్రాజెక్టులపై ఈ నిధులను వినియోగించనుంది. ‘పూర్తి ఆర్థిక సంవత్సరంలో మా పెట్టుబడులుగా రెండు భాగాలుగా ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ సొంతంగా చేపట్టిన ప్రాజెక్టులపై రూ.4,000 కోట్లు, ప్రభుత్వ నిధుల సాయంతో చేపట్టిన ప్రాజెక్టులపై రూ.3,000 కోట్లు ఖర్చు చేయనున్నాం’ అని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, ఎండీ అనుపమ్ శ్రీవాస్తవ చెప్పారు. మెరుగుపడనున్న సేవలు: సొంత నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై ఇప్పటికే రూ.1,500 కోట్లు వ్యయం చేశామని, అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలంలో మిగిలిన రూ.2,500 కోట్లను వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు, జీఎస్ఎం నెట్వర్క్ విస్తరణ, నెట్వర్క్ బలోపేతానికి ఖర్చు చేయనున్నట్టు అనుపమ్ శ్రీవాస్తవ చెప్పారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో మొబైల్ టవర్ల ఏర్పాటు, స్పెక్ట్రమ్ ప్రాజెక్టు ‘భారత్‌నెట్ అండ్ డిఫెన్స్’ నెట్వర్క్ ఈ రెండూ ప్రభుత్వ నిధులతో బీఎస్ఎన్ఎల్ అమలు చేస్తున్న ప్రాజెక్టులన్నారు. ‘జీఎస్ఎం విస్తరణ ప్రాజెక్టులో భాగంగా 20వేల బీటీఎస్(బేస్ ట్రాన్సీవర్ స్టేషన్)లను ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేస్తున్నాం. వీటి వల్ల సేవల నాణ్యత మెరుగుపడుతుంది. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే 2,700 వైఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేసింది. ఈ సంఖ్యను 2018 నాటికి 40,000కు పెంచనున్నాం’ అని శ్రీవాస్తవ వివరించారు.