బీఎస్ఎన్ఎల్ పెట్టుబడుల జోరు..
• ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7వేల కోట్ల వ్యయం
• అక్టోబర్-మార్చి మధ్య రూ.2,500 కోట్ల పెట్టుబడులు
• హాట్‌స్పాట్‌లు, టవర్ల విస్తరణ, నెట్‌వర్క్ బలోపేతం
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ టెలికం కంపెనీలకు గట్టి పోటీనిచ్చే దిశగా ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తన నెట్‌వర్క్ సామర్థ్యాలను బలోపేతం చేసుకునే పనిలో పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016-17)లో మిగిలి ఉన్న ఆరు నెలల కాలంలో రూ.2,500 కోట్లను పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. వైఫై హాట్‌స్పాట్‌లు, మొబైల్ టవర్ల ఏర్పాటు, కోర్ నెట్‌వర్క్ విస్తరణ సహా పలు రకాల ప్రాజెక్టులపై ఈ నిధులను వినియోగించనుంది. ‘పూర్తి ఆర్థిక సంవత్సరంలో మా పెట్టుబడులుగా రెండు భాగాలుగా ఉంటాయి. బీఎస్‌ఎన్‌ఎల్ సొంతంగా చేపట్టిన ప్రాజెక్టులపై రూ.4,000 కోట్లు, ప్రభుత్వ నిధుల సాయంతో చేపట్టిన ప్రాజెక్టులపై రూ.3,000 కోట్లు ఖర్చు చేయనున్నాం’ అని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, ఎండీ అనుపమ్ శ్రీవాస్తవ చెప్పారు.
మెరుగుపడనున్న సేవలు: సొంత నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై ఇప్పటికే రూ.1,500 కోట్లు వ్యయం చేశామని, అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలంలో మిగిలిన రూ.2,500 కోట్లను వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు, జీఎస్‌ఎం నెట్‌వర్క్ విస్తరణ, నెట్‌వర్క్ బలోపేతానికి ఖర్చు చేయనున్నట్టు అనుపమ్ శ్రీవాస్తవ చెప్పారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో మొబైల్ టవర్ల ఏర్పాటు, స్పెక్ట్రమ్ ప్రాజెక్టు ‘భారత్‌నెట్ అండ్ డిఫెన్స్’ నెట్‌వర్క్ ఈ రెండూ ప్రభుత్వ నిధులతో బీఎస్‌ఎన్‌ఎల్ అమలు చేస్తున్న ప్రాజెక్టులన్నారు.
‘జీఎస్‌ఎం విస్తరణ ప్రాజెక్టులో భాగంగా 20వేల బీటీఎస్(బేస్ ట్రాన్సీవర్ స్టేషన్)లను ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేస్తున్నాం. వీటి వల్ల సేవల నాణ్యత మెరుగుపడుతుంది. బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే 2,700 వైఫై హాట్ స్పాట్‌లను ఏర్పాటు చేసింది. ఈ సంఖ్యను 2018 నాటికి 40,000కు పెంచనున్నాం’ అని శ్రీవాస్తవ వివరించారు.