ప్రత్యేక సంస్థగా బీఎస్‌ఎన్‌ఎల్ టవర్స్ విభాగం
విభజనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందిన మొబైల్ టవర్స్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడగొట్టే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది. దేశీయంగా ప్రస్తుతం 4,42,000 మొబైల్ టవర్స్ ఉండగా, వీటిలో బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందినవి 66,000 పైచిలుకు ఉన్నాయి. టవర్స్ విభాగాన్ని ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయడం వల్ల మరిన్ని టెల్కోలకు అద్దెకివ్వడం ద్వారా కొత్త కంపెనీ మరింత ఆదాయం ఆర్జించగలిగే అవకాశం ఉంటుందని పేర్కొంది.
రెండేళ్లలో ప్రక్రియ పూర్తి..: కొత్తగా ఏర్పాటయ్యే మొబైల్ టవర్ కంపెనీ పూర్తిగా బీఎస్‌ఎన్‌ఎల్ ఆధీనంలోనే ఉంటుందని క్యాబినెట్ సమావేశం అనంతరం టెలికం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. కొత్త సంస్థ ఏర్పాటు ప్రక్రియ రెండేళ్లలో పూర్తవుతుందని చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్, టెలికం విభాగం నుంచి 1,614 మంది ఉద్యోగులు ఈ సంస్థకు డిప్యుటేషన్ మీద వెడతారని, వ్యాపారం పెరిగే కొద్దీ కొత్త ఉద్యోగావకాశాలు పెరుగుతాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ సంస్థల జాయింట్ వెంచర్ అయిన ఇండస్ టవర్స్ సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద టెలికం టవర్ కంపెనీగా ఉంది. దీనికి 1,22,920 మొబైల్ టవర్స్ ఉన్నాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్ 90,646 టవర్స్‌తో రెండో స్థానంలో ఉంది.