Cyber Bluebugging Alert To Smart Phone Users - Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ యూజర్స్‌కు అలర్ట్‌.. పొంచి ఉన్న ‘బ్లూబగ్గింగ్‌’

Published Sat, Feb 11 2023 7:13 AM | Last Updated on Sat, Feb 11 2023 10:22 AM

Cyber Bluebugging Alert To Smart Phone Users - Sakshi

సాక్షి, విజయవాడ: ఫోన్‌లో బ్లూటూత్‌.. వైఫై, హాట్‌ స్పాట్‌ ఎప్పుడూ ఆన్‌ చేసుకుని ఉంటున్నారా.. అయితే జాగ్రత్త పడండి. సైబర్‌ నేరగాళ్లు మాటు వేసి ఉంటున్నారు. ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారమంతా దోచేస్తున్నారు. ఆ తర్వాత వేధింపులు, బెదిరింపులతో మానసిక క్షోభకు గురి చేసి.. అందిన కాడికి దండుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి బ్లూబగ్గింగ్‌ తరహా ఘటనలు పెరిగిపోతున్నాయి.

రద్దీగా ఉండే ప్రాంతాల్లో..
నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే బ్లూ బగ్గింగ్‌ నేరాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైబర్‌ నేరగాళ్లు పది మీటర్ల దూరం నుంచే బ్లూటూత్, హాట్‌స్పాట్‌ ద్వారా ‘పెయిర్‌’ రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. ఏదో పనిలో ఉండి చూసుకోకుండా ‘ఓకే’ బటన్‌ క్లిక్‌ చేయగానే సైబర్‌ నేరగాళ్ల ఫోన్‌తో మన ఫోన్‌ కనెక్టవుతుంది. వెంటనే మాల్‌వేర్‌తో పాటు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ప్రోగ్రామింగ్‌ను ఫోన్‌లోకి పంపిస్తారు. అక్కడి నుంచి మన ఫోన్‌ ఆపరేటింగ్‌ పూర్తిగా వారి చేతిలోకి వెళ్లిపోతుంది. ఫోన్‌లో బ్లూటూత్‌ ఆపేసినా.. వారు అప్పటికే పంపించిన ప్రోగ్రామింగ్, మాల్‌వేర్‌ వల్ల ఎలాంటి ప్రయో­జనం ఉండట్లేదు. సాధారణంగా వైఫై వినియోగించే వారికి తప్పనిసరిగా పాస్‌వర్డ్‌ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాల్లో వైఫై ఫ్రీగా లభ్యమవుతోంది. ఫోన్‌­లో వైఫై ఆప్షన్‌ ఆన్‌ చేసుకున్న వారికి ఆటో­మేటిక్‌గా వైఫై కనెక్ట్‌ అవుతోంది. ఫ్రీగా వైఫై ఇచ్చే ప్రాంతాల్లో తరచూ బ్లూబగ్గింగ్‌ సైబర్‌ నేరాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు.

క్విక్‌ సపోర్ట్, టీం వ్యూయర్, ఎనీడెస్క్‌ తదితర యాప్స్‌ సాయంతో ఫోన్‌ ఆపరేటింగ్‌ మొత్తాన్ని సైబర్‌ నేరగాళ్లు పసిగడుతుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు ముందుగా సొమ్ము­ను దోచేస్తున్నారు. ఫొటోలు, వీడియోలను పూర్తిగా కాపీ చేసుకుని.. వాటిని మారి్ఫంగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి దొరికినంత లాగేస్తున్నారు. మన ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను సైబర్‌ నేరగాళ్లు పూర్తిగా వారి మొబైల్‌కు మళ్లించుకుంటున్న ఘటనలు కూడా జరిగాయని సైబర్‌ పోలీసులు చెబుతున్నారు. ఈ తరహా కేసులు ఇప్పటివరకు విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో 15 వెలుగు చూశాయని పోలీసులు చెప్పారు.  

అప్రమత్తంగా ఉండాలి 
బ్లూ బగ్గింగ్‌ నేరాల విషయంలో అప్రమ­త్తం­గా ఉండాలి. బ్లూటూ­త్, వైఫై, హాట్‌స్పాట్‌లను అవసరమైనప్పుడే ఆన్‌ చేసుకోవాలి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించకుండా ఉంటే మంచింది. స్క్రీన్‌ షేర్‌ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే పెయిర్‌ రిక్వెస్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించొద్దు. 
– ఎల్‌.రాజవర్ష, ఎస్‌ఐ, సైబర్‌ పోలీస్‌స్టేషన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement