
ఇళ్లు కార్యాలయాల్లోని సీసీటీవీ ఫుటేజీని హ్యాక్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న సైబర్ భద్రతా నిపుణులు
ఎప్పటికప్పుడు పాస్‌వర్డ్ మార్చుకోవాలని సూచన
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత భద్రత కోసం ఏర్పాటు చేసుకుంటున్న సీసీటీవీ కెమెరాలను సైతం సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. అందులోని ఫుటేజీని వాడుకొని మోసగించేందుకు..సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారని సైబర్‌భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో పాయల్ మెటర్నటీ ఆస్పత్రి సీసీటీవీ కెమెరాలను సైబర్ మోసగాళ్లు హ్యాక్ చేయడంతో దీనిపై చర్చ మొదలైంది. ఇళ్లు, కార్యాలయాల్లోని సీసీటీవీ కెమెరాలు సైతం హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదముందని, కొద్దిపాటి జాగ్రత్తలతో ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చనిసైబర్ నిపుణులు చెబుతున్నారు.
సీసీటీవీ ఫుటేజీని ఎలా హ్యాక్ చేస్తారు?
సీసీటీవీ కెమెరాలను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వాటి ఫీడ్‌ను చూసేందుకు మనం ఏర్పాటు చేసుకునే ఖాతాకు సంబంధించిన సీసీటీవీ కెమెరాలకు డిఫాల్ట్ పాస్‌వర్డ్‌లను చాలామంది మార్చరు. దీంతో హ్యాకర్లు సులభంగా కెమెరాల్లోకి చొరబడుతున్నారు. కొన్ని సీసీటీవీ కెమెరాల సాఫ్ట్‌వేర్‌లో లోపాలు ఉండటం కూడా హ్యాకర్లకు కలిసొస్తుంది. బలహీనమైన వైఫై నెట్‌వర్క్‌లు కూడా హ్యాకర్లకు సులభమైన లక్ష్యాలుగా మారుతాయి. ఫిషింగ్ ఈ–మెయిల్‌లతో హ్యాకర్లు యూజర్ల పాస్‌వర్డ్‌లు, ఇతర సమాచారాన్ని సేకరించి హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారు.
హ్యాక్ చేయడం వల్ల కలిగే నష్టాలు
⇒ వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుంది.
⇒ ఇళ్లు, కార్యాలయాల్లోని ముఖ్యమైన సమాచారం దొంగిలిస్తారు.
⇒ బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌లకు గురయ్యే ప్రమాదముంది.
⇒ ఆర్థికంగా నష్టాలు కలిగే ప్రమాదం ఉంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
⇒ సీసీటీవీ కెమెరాలకు తప్పకుండా స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలి. అవి సులువుగా ఇతరులు గుర్తించలేనట్టుగా ఉండాలి.
⇒ సీసీటీవీల సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి.
⇒ వైఫై నెట్‌వర్క్‌ను సురక్షితంగా పెట్టుకోవాలి.
⇒ అనుమానాస్పద లింక్‌లు, ఈ–మెయిల్‌లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.
⇒ అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సైబర్ పోలీసులు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ 1930లో ఫిర్యాదు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment