ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు హెచ్చరిక. ఖతర్నాక్ మాల్‌వేర్ ‘జోకర్’ మళ్లీ వచ్చేశాడు. దేశంలో ఇప్పటికే ఏడు లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్స్ జోకర్ మాల్‌వేర్‌తో లింకులు ఉన్న యాప్స్(సురక్షితం కానీ) ను డౌన్‌లోడ్ చేసుకున్నారని, వాళ్లలో చాలామంది ఆర్థిక లావాదేవీలు ప్రమాదం అంచున ఉన్నాయని మహరాష్ట్ర పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు.
ముంబై: జోకర్ మాల్‌వేర్.. మొదటిసారి 2017లో గూగుల్‌లో దర్శనమిచ్చాడు. ఇది చాలా ప్రమాదకరమైన మాల్‌వేర్ అని.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు మూడేళ్లపాటు శ్రమించామని పోయినేడాది గూగుల్ ప్రకటించుకుంది. కానీ, కిందటి ఏడాది జులైలో గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ జోకర్ కదలికలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన గూగుల్.. కొన్ని అనుమానాస్పద యాప్‌ల్ని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయినప్పటికీ జోకర్ భయం పూర్తిగా తొలగిపోలేదు. ఇక ఇప్పుడు జోకర్ మాల్‌వేర్ గురించి ఫిర్యాదులు తమ దృష్టికి రావడంతో మహారాష్ట్ర పోలీసులు దేశవ్యాప్తంగా ఒక అలర్ట్ జారీ చేయడం విశేషం.
ఏం చేయాలంటే..
- యాప్‌లకు(అవసరం లేనివాటికి) ఎస్సెమ్మెస్ యాక్సెస్ పర్మిషన్‌ను తొలగించాలి.
- అవసరం లేని సర్వీసులు, సబ్‌స్క్రిప్షన్‌ల నుంచి బయటకు వచ్చేయాలి.
- ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను, నెట్‌బ్యాంకింగ్ సమాచారాన్ని ఫోన్‌లో దాచిపెట్టుకోకపోవడం మంచిది.
- క్రెడిట్ కార్డు బిల్లులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం.. తెలియకుండా జరిగిన కొనుగోళ్లపై దృష్టి సారించడం.
- అనవసరమైన యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకోకపోవడం.
- రివ్యూల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే యాప్స్ అయినా సరే.. అనుమానంగా అనిపిస్తే తొలగించడం.
- యాంటీ వైరస్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవడం.
2020లో 11 ‘జోకర్’ అనుమానిత యాప్స్‌ను ప్లే స్టోర్‌లో గుర్తించారు. ఈ ఏడాది ఆ సంఖ్య 22కి పైనే ఉంది.
మొండి జోకర్
జోకర్ అనేది ఒక మొండి మాల్‌వేర్. యూజర్‌కు తెలియకుండానే రెప్పపాటులో డబ్బులు మాయం చేయడంలో దిట్ట. ఆండ్రాయిడ్ యూజర్‌పై యాడ్స్ రూపంలో ఈ మాల్‌వేర్ దాడి చేస్తుంది. మెసేజ్‌లు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లు, పేమెంట్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతుంది. ఒకవేళ ట్రాన్‌జాక్షన్ అయినట్లు యూజర్‌కు మెసేజ్ వచ్చినా.. అప్పటికే ఆలస్యం జరిగిపోయి ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి, యాడ్‌లను క్లిక్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment