అర్బన్ పార్కును పరిశీలిస్తున్న కేటీఆర్, ఎరిక్
సాక్షి, హైదరాబాద్: సైబర్ భద్రతను పటిష్టపరిచేందుకు నాస్కామ్ ఆధ్వర్యంలోని డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీఎస్‌సీఐ) సంస్థ భాగస్వామ్యంతో సైబర్ సెక్యూరిటీ–సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఐటీ శాఖ వార్షిక నివేదికను ఆవిష్కరించేందుకు శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో డీఎస్‌సీఐతో రాష్ట్ర ఐటీ శాఖ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌ను సైబర్ సెక్యూరిటీకి హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లను సులువుగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూపొందించిన ‘టీ–వెబ్’ (httpr://tweb. telangana.gov.in)ను మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సమాచార భద్రత కోసం రూపొందించిన తెలంగాణ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్(టీ–ఎస్‌వోసీ)ను కేటీఆర్ ప్రారంభించారు. జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా 34 ఎంబీపీఎస్, 12 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయం కల్పించేందుకు తెలంగాణ స్టేట్ వైడ్ నెట్‌వర్క్ (టీ–స్వాన్) 2.0 కార్యక్రమంతో పాటు.. ఆధార్‌తో అనుసంధానం ద్వారా హాజరు నమోదు కోసం రూపొందించిన ‘టీఎస్‌టీఎస్ అబాస్’ప్రాజెక్టును కేటీఆర్ ప్రారంభించారు. వ్యవసాయ అవసర సామగ్రిని మీ–సేవ కేంద్రాల ద్వారా రైతులకు ఇం టి వద్దే సరఫరా చేసేందుకు ఇఫ్కో బజార్‌తో ప్రభు త్వం పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
పలు ఐటీ కంపెనీలకు పురస్కారాలు
ఐటీ రంగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన పరిశ్రమలకు కేటీఆర్ తెలంగాణ ఆవిర్భావ దిన పురస్కారాలు అందించారు. రూ.10,889 కోట్ల ఎగుమతులతో అగ్రస్థానంలో నిలిచిన ఇన్ఫోసిస్‌కు పెద్ద కంపెనీల విభాగంలో అత్యధిక సాఫ్ట్‌వేర్ ఎగుమతుల పురస్కారం లభించింది. సూక్ష్మ, మధ్యంతర పరిశ్రమల విభాగంలో వాల్యూ మొమెంటమ్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ కంపెనీకి ఈ పురస్కారం వరించింది. అత్యధిక ఉద్యోగాల కల్పన పురస్కారం పెద్ద కంపెనీల విభాగంలో ఇన్ఫోసిస్‌కు, సూక్ష్మ, చిన్న కంపెనీల విభాగంలో ఆర్‌ఎంఎస్‌ఐ ప్రైవేటు లిమిటెడ్‌కు దక్కింది. ఐటీ రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన కంపెనీగా ఆర్‌ఎంఎస్‌ఐ, విశేషంగా సీఎస్‌ఆర్ సేవలందించిన కంపెనీగా టెక్ మహీంద్రా, అత్యంత సృజనాత్మక స్టార్టప్‌గా చిట్‌మాంక్స్, మోస్ట్ ప్రామిసింగ్ యాడ్‌టెక్ స్టార్టప్‌గా అడాన్మో, మోస్ట్ ఇన్నోవేటివ్ స్మార్ట్ సిటీ స్టార్టప్‌గా అయాస్టాలకు పురస్కారాలు లభించాయి.
ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ పురస్కారం కాలిబర్ టెక్నాలజీస్‌కు, తూర్పు క్లస్టర్ ప్రోత్సాహక పురస్కారం ఎన్‌ఎస్‌ఎల్ ఇన్‌ఫ్రాటెక్‌కు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ రంగ అభివృద్ధి పురస్కారం టెక్ మహీంద్రాకు, టాస్క్ భాగస్వామ్యంతో నైపుణ్యాభివృద్ధికి విశేష కృషి చేసినందుకు ఇన్ఫోసిస్‌కు, సైబరాబాద్‌లో మహిళల భద్రతకు కృషి చేసినందుకు ఐపీఎస్ అధికారి జానకి షర్మిళకు పురస్కారాలు అందించారు. కంప్యూటర్ విద్యను మారు మూల ప్రాంతాల్లో అందించినందుకు పి.కోటేశ్వర్‌రావు, ఆర్.పావని, రాజేశ్, పుల్యాల రజని, వి.నాగరాణిలకు డిజిటల్ లిటరసీ పురస్కారాన్ని అం దించారు. టాస్క్ ద్వారా గ్రామీణ యువతకు సాధికారత కల్పించినందుకు దీపిక రెడ్డి, అత్యుత్తమ సేవలందించిన ఎన్జీవోగా తెలంగాణ ఐటీ అసోసియేష న్, ఐటీ కారిడార్‌లో చేనేత దుస్తుల ప్రోత్సాహానికి గాను ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్‌కు పురస్కారాలు అందించారు.
‘ఆరోగ్య హైదరాబాద్‌గా తీర్చిదిద్దుతాం’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను అందమైన, ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దుతామని.. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంటామని మంత్రి కె.తారకరామారావు అన్నారు. ప్రపంచ పర్యావరణోత్సవాల నేపథ్యంలో.. ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్‌హెమ్‌తో కలసి నగర శివారులో అటవీశాఖ అభివృద్ధి చేసిన భాగ్యనగర్ నందనవనం అర్బన్ ఫారెస్ట్ పార్కును కేటీఆర్ పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఎరిక్ సోల్‌హెమ్ ప్రశంసించారు. అర్బన్ ఫారెస్టు పార్కు నిర్వహణ బాగుందని.. నగరాల్లో నివసించే ప్రజలకు మంచి వాతావరణాన్ని, ఆహ్లాదాన్ని పంచేలా ఇలాంటి పార్కులను తీర్చిదిద్దాలని సూచించారు. పార్కు సందర్శన అనంతరం ‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అటవీ శాఖ ఉన్నతాధికారులు ఎరిక్‌కు వివరించారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్కులో ఉన్న మొక్కలు, పూల సమాచారంతో తయారు చేసిన ‘ది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ కేబీఆర్ నేషనల్ పార్క్’పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment