బాక్సైట్ సభ ఆటంకానికి యత్నం
- జర్రెలలో బహిరంగ సభ
- ప్రభుత్వం తీరుపై గిరిజనుల ఆందోళన
- పెద్ద ఎత్తున మోహరించిన బలగాలు
- పోలీసులతో నేతల వాగ్వాదం
జీకేవీధి: బాక్సైట్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ, పలు పార్టీల ప్రజా ప్రతినిధులు ఆదివారం మండలంలోని జర్రెలలో చేపట్టిన సభకు గిరిజనులు హాజరుకాకుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సభ నిర్వహించకుండా విఫలయత్నం చేశారు. ఉదయం 8 గంటల నుంచేఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మోహరించారు. చింతపల్లి మీదుగా జర్రెల వెళ్ళే రహదారిలో చౌడుపల్లి వద్ద తనిఖీలు చేపట్టారు. మన్యంలోని విలువైన ఖనిజ సంపదను కాపాడుకునే ప్రయత్నంలో మారుమూల జర్రెల, మొండిగెడ్డ, వంచుల పంచాయతీల పరిధిలోని వివిధ గ్రామాల గిరిజనులు ఈ సభకు హాజరు కావాలి.
పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తారోనన్న భయంతో అనేక గ్రామాల గిరిజనులు రాలేకపోయారు. ముందుగానే ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ మారుమూల గ్రామాల గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరై తమ నిరసన వ్యక్తం చేశారు. సభ జరుగుతుండగా ఓ గిరిజనుడ్ని అదుపులోకి తీసుకోవడంతో ప్రజా ప్రతినిధులు. పోలీసుల మధ్య సుమారు 2 గంటలపాటు వాగ్వాదం చోటుచేసుకుంది.
సమావేశంలో వివిధపార్టీల నాయకులు మాట్లాడుతుండగా గునుకురాయికి చెందిన సూకూరు చిన్నారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై గతంలో కేసులు ఉన్నాయని అందుకే తమ వెంట తీసుకు వెళుతున్నామని చెప్పడంతో అక్కడున్నవారంతా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రజా ప్రతినిధులంతా పట్టుబట్టడంతోఎట్టకేలకు పోలీసులు అతడ్ని విడిచి పెట్టారు.