బందరు రోడ్డు పక్కన ప్రమాదకరంగా నిర్మాణాలు
కుప్పకూలిన మట్టి తప్పిన ప్రమాదం అనుమతులపై అనుమానాలు
జాగ్రత్తలు పాటించడం లేదని ఆరోపణలు
కానూరు (పెనమలూరు) : మొన్న గుంటూరులో మట్టిపెళ్లలు పడి ఏడుగురు మృతిచెందారు.. ఆ ఘటన మరువకముందే కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరు సిరీస్ పక్కన నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం వద్ద శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మట్టి జారిపోయి కుప్పకూలింది. ఈ ఘటనలతో బహుళ అంతస్తుల భవన నిర్మాణంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, భవన నిర్మాణానికి కావాల్సిన అనుమతులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానూరు సిరీస్ పక్కన ఓ బహుళ అంతస్తు భవన నిర్మాణం బందరు రోడ్డుకు ఆనుకుని జరుగుతోంది. భవన నిర్మాణానికి పెద్దఎత్తున మట్టి తొలగించి సెల్లార్ నిర్మిస్తుండడంతో శుక్రవారం వర్షం కారణంగా ఈ నిర్మాణం వద్ద మట్టి ఒక్కసారిగా జారిపోయి కుప్పకూలింది.
బందరు రోడ్డుకు, అలాగే కానూరు పంటకాలువ రోడ్డుకు ఆనుకుని పెద్దఎత్తున మట్టి తవ్వి సెల్లార్ పనులు చేస్తున్నారు. సిరీస్ పక్కన పంటకాలువ రోడ్డు కింద ఉన్న మట్టి ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఘటనలో ఎవ్వరికి ప్రమాదం జరుగకపోయినా స్థానికులు మాత్రం తీవ్ర ఆందోళన చెందారు. బందరు రోడ్డు మార్జిన్ కూడా తక్కువగా ఉంది. నిబంధనల ప్రకారం బందరు రోడ్డుకు బాగా మార్జిన్ వదలాల్సి ఉంది. మరి అధికారులు ఎలా అనుమతించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మట్టి జారుతుండడంతో బందరు రోడ్డుకు కూడా ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.