ఉపాధ్యాయ బదిలీలపై ఉత్కంఠ | Suspense on teacher transfers | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ బదిలీలపై ఉత్కంఠ

Published Wed, Jun 29 2016 9:41 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

Suspense on teacher transfers

ఉపాధ్యాయ బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. దాదాపు అన్ని శాఖల్లో జూన్‌లోనే బదిలీలు చేపట్టారు. విద్యాశాఖలో మాత్రమే ఇప్పటివరకు బదిలీల ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అన్ని శాఖలతో పాటే బదిలీలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నాయి. జూలై చివరి వారంలో బదిలీల ప్రక్రియ మొదలు కావొచ్చని తెలుస్తోంది. పాఠశాలలు ప్రారంభం అయిన తరువాత బదిలీలు జరిగితే పిల్లల చదువులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి జోక్యం చేసుకునే వరకు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బదిలీలపై నిర్లక్ష్యం వహించారనే విమర్శలున్నాయి. ‘మీ శాఖలో ఏం జరుగుతోంది’ అని చంద్రబాబు ప్రశ్నించడంతో బదిలీలపై కదలిక వచ్చిందని తెలిసింది. దీంతో హడావుడిగా జీవో నెం.63కి కొన్ని మార్పులు చేర్పులు చేసి బదిలీలపై ప్రతిపాదనలు పంపారని సమాచారం.

 

చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు విదేశీ పర్యటనలో ఉండడంతో ఉపాధ్యాయ బదిలీలపై సందిగ్ధత నెలకొంది. బదిలీలు ఉంటాయా.. ఉండవా.. తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ బదిలీలు చేపట్టదలిస్తే.. ముఖ్యమంత్రి, మంత్రి పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత అనుమతులు తీసుకుని బదిలీలపై ఉత్తర్వులు వచ్చేసరికి నెల రోజులు గడుస్తాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇప్పటికే తమ పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించామని.. ఇప్పుడు బదిలీలు నిర్వహిస్తే తాము ఆర్థికంగా నష్టపోతామని చె బుతున్నారు. ఇళ్లకు దూరంగా ఉండాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. 45 రోజుల సెలవులను వృథా చేసి ఇప్పుడు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పడంపై మండిపడుతున్నారు. కీలక తరుణంలో విద్యాశాఖ కమిషనర్ సిసోడియాను బదిలీ చేయడం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆయన స్థానంలో విద్యాశాఖపై ఏమాత్రం అవగాహన లేని ఆదిత్యనాథ్ గుప్తాను కమిషనర్‌గా, ఇండియన్ పోస్టల్ సర్వీస్‌కు చెందిన సంధ్యారాణిని, డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్  నియమించారంటున్నారు. ఈ గందరగోళంలోనే 45 రోజుల వేసవి సెలవులు వృథా అయ్యాయని చెబుతున్నారు.

 
మంత్రికి సొంత వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ విద్యపై లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వృత్యంతర పనులు అప్పజె ప్పుతూ విలువైన సమయాన్ని వృథా చేయిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. టీచర్ డేటా అప్‌లోడ్, ఆధార్ అనుసంధానం వంటి పనులకు రోజుకు కనీసం 3 గంటల సమయం పడుతోందని చెబుతున్నారు. ఈ పనుల వల్ల ఇప్పటివరకు పాఠాలు మొదలే పెట్టలేకపోతున్నామని వాపోతున్నారు. వృత్తేతర పనులను ఉపాధ్యాయులకు అప్పజెప్పడం వల్ల సమయానికి పాఠాలు పూర్తి చేయలేకపోతున్నామని  అంటున్నారు.

 
అమ్మో పాయింట్ల విధానం!

పాయింట్ల విధానం అంటేనే ఉపాధ్యాయులు భయపడిపోతున్నారు. గత సంవత్సరం జరిగిన బదిలీల్లో పాయింట్ల విధానం అనుసరించడంతో అవకతవకలు జరిగాయని.. ఈ  విధానంలో లోపాలు సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు, వ్యక్తిగతంగా స్కూల్‌కు మంచి పేరు తెచ్చిన వారికి అధిక పాయింట్లు కేటాయించాలని కోరుతున్నారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడం ఉపాధ్యాయుడిది ప్రాథమిక బాధ్యత అయినప్పటికీ.. ఎక్కువ మంది పిల్లలను బడిలో చేర్పించిన వారికి పాయింట్లు కేటాయించే విధానంలో మార్పులు చేస్తే ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు.  పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేరు అని చెబుతాం కానీ.. కచ్చితంగా చేరు అని ఒత్తిడి చేయలేమని వారు వాపోతున్నారు.

 

ఇప్పుడు బదిలీలా ?
వేసవి సెలవులను వృథా చేసి విద్యా సంవత్సరంలో బదిలీలలు ప్రారంభించడం మంచి పద్ధతి కాదు. దీనివల్ల ఉపాధ్యాయ కుటుంబాలకు నష్టం జరుగుతుంది. పది నెలలు కాక మునుపే బదిలీలు చేపడుతున్నారు. మానసికంగా ఉపాధ్యాయులు బదిలీలను కోరుకోవడం లేదు. ట్రాన్స్‌ఫర్లు చేయాలనుకుంటే వేసవి సెలవుల్లోనే నిర్వహించి ఉండాల్సింది.
-  రెడ్డి శేఖర్ రెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర అసోసియేషన్.. చిత్తూరు

 

 

గందరగోళంపై స్పష్టత ఇవ్వాలి
వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు, రేషనలైజేషన్ వంటి పనులను పూర్తిచేసి ఉండాల్సింది. పాఠశాలలు ప్రారంభం అయిన వెంటే బోధనలో నిమగ్నం అయ్యే వాతావరణాన్ని కల్పించాలని పలుసార్లు విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది. గతంలో బదిలీ ఉత్తర్వులు పొందిన టీచర్లే ఇంకా రిలీవ్ కాని దుస్థితి నెలకొంది. కావున విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో బదిలీలు, రేషనలైజేషన్‌కు సంబంధించి స్పష్టత ఇవ్వాలి. - గంటా మోహన్, రాష్ట్ర కార్యదర్శి, ఎస్టీయూ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement