- మన్యంలో విస్తృత సర్వే
పాడేరు: మన్యంలో లభించే విలువైన రంగురాళ్ల క్వారీలపై బడా వ్యాపారులు కన్ను పడింది. ఒడిశా, రాజస్థాన్ సహా జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారులు ప్రస్తుతం మన్యంలో అధికంగా సంచరిస్తున్నారు. గొలుగొండ మండలం కరక, జీకే వీధి మండలం గుర్రాలగొంది క్వారీలను అటవీ, పోలీసు శాఖలు మూసివేసాయి. ఈ రంగురాళ్ల క్వారీల్లో రంగురాళ్ల మట్టి తవ్వకాలపై నిషేధం ఉండటంతో వ్యాపారం నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో వ్యాపారులంతా కొత్త క్వారీల్లో తవ్వకాలపై దృష్టి సారించారు.
చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు ప్రాంతాల్లో పలు చోట్ల గతంలో తవ్వకాలు జరిపిన క్వారీల్లో మళ్లీ మట్టి తవ్వకాలకు వ్యాపారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక గిరిజనులతో మంతనాలు జరుపుతున్నారు. విలువైన క్యాట్స్ ఐ రకం రంగురాళ్లు లభించే కొత్త క్వారీలను కూడా వ్యాపారులు అన్వేషిస్తున్నారు. అబ్రకం ఖనిజం జాడలు కనిపించిన భూముల్లో మట్టి తవ్వకాలు జరిపి నమూనాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం రంగురాళ్ల వ్యాపారులు పాడేరు, జి.మాడుగుల,చింతపల్లి, జీకే వీధి ప్రాంతాల్లో అధికంగా సంచరిస్తున్నారు.
నర్సీపట్నం, విశాఖపట్నం కేంద్రాలుగా బడా వ్యాపారులు మకాం వేసి రంగురాళ్ల క్వారీల వేటలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌లోని పేరొందిన రంగురాళ్ల ముఠా కూడా ఏజెన్సీలోని రంగురాళ్ల సంపదపై కన్నేసింది. గతంలో వారు పాడే రు మండలం మినుములూరు క్వారీలో అక్రమంగా మట్టిని తవ్వించారు. విలువైన రంగురాళ్లు లభించడంతో రాజకీయ అండదండలతో శ్రీలంకకు తరలించి రూ.కోట్లలో వ్యాపారం చేసారు. అప్పట్లో పోలీసుశాఖ కూడా రాజకీయ ఒత్తిళ్లకు గురైందనే ఆరోపణలు వినిపించాయి.
వ్యాపారుల మధ్య పోటీతత్వం నెలకొనడంతో చివరికి ఫిర్యాదులు అధికమై పోలీసులు, రెవెన్యూ అధికారులు మినుములూరు క్వారీని రెండేళ్ల కిందట మూసివేసారు. వ్యాపారులు మాత్రం ఈ క్వారీలో తవ్వకాలకు నిరంతరం ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు.
క్వారీ ఉన్న ప్రాంతం పట్టా భూమి కావడంతో భూమి యజమాని తవ్వకాలకు అనుమతి మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రంగురాళ్ల వ్యాపారులంతా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలను కూడా వ్యాపారులు ప్రసన్నం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.