మన్యంలో మళ్లీ అలజడి
- ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి కాల్చివేత
- మృతుడు మాజీ ఎల్‌జీఎస్ కమాండర్
- నరేష్ ఇన్‌ఫార్మర్ కాదు : భార్య
మావోయిస్టులు మళ్లీ పెట్రేగారు. ఇన్‌ఫార్మర్ నెపంతో మాజీ మావోయిస్టును చంపి పోలీసులకు సవాల్ విసిరారు. విశాఖ-తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులో జరిగిన ఈ సంఘటనతో మన్యంలో మళ్లీ అలజడి రేగింది.
కొయ్యూరు: విశాఖ మన్యంలో పోలీస్ ఇన్‌ఫార్మర్ పేరిట మావోయిస్టులు ఓ గిరిజనుడిని తుపాకీతో కాల్చి చంపారు. గతంలో దళంలో పనిచేసి లొంగిపోయిన మువ్వల లచ్చి అలియాస్ లక్ష్మణరావు అలియాస్ నరేష్(25)ను తూర్పు గోదావరి విశాఖ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన జంగాలతోట సమీపంలో శనివారం తెల్లవారుజామున గాలికొండ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టు నేతలు ఆజాద్, ఆనంద్ మరో నలుగురు కలిసి కాల్చి చంపా రు. నరేష్ ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్‌లో చేరి ప్రజలకు అన్యాయం చేయడంతో హతమార్చినట్లు మావోయిస్టులు అక్కడ వదిలిన లేఖలో పేర్కొన్నారు.
నరేష్ నేపథ్యం
యు.చీడిపాలెం పంచాయతీ ఎండకోటకు చెందిన మువ్వల నరేష్ 2001లో మావోయిస్టుల్లో చేరి 2005 వరకు పనిచేశాడు. తర్వాత ఏరియా కమిటీ సభ్యునిగా, పలకజీడి ఏరియా కమిటీకీ కమాండర్‌గా పనిచేశారు. 2006లో కాకినాడలో లొంగిపోయాడు. 2007లో ధారకొండలో పదవ తరగతి వరకు చదివాడు. అది పూర్తయిన వెంటనే ఎండకోట వచ్చి వ్యవసాయం చేసేవాడు. 2009 వరకు ఎండకోటలో ఉన్న నరేష్ మావోయిస్టుల నుంచి ఇబ్బందులు వస్తాయని వై.రామవర ం వెళ్లిపోయాడు. తర్వాత పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నారని అనుమానించిన మావోయిస్టులు వారి హిట్ జాబితాలో చేర్చారు.
సంఘటన ఎలా జరిగిందంటే! : వై.రామవరంలో మకాం పెట్టిన నరేష్ జీవన భృతి కోసం కొంతకాలంగా రోజ్‌వుడ్, నేరేడు కలప ముక్కలను కొయ్యూరు సంతలో విక్రయిస్తూ కాలం నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో నరేష్ బుధవారం ఈ కలప కోసం వేమపాలెం వచ్చాడు. నరేష్ వేమపాలెంలో ఉన్నారని తెలుసుకున్న మావోయిస్టులు ఆ ఇంటిని శుక్రవారం అర్ధరాత్రి చుట్టుముట్టారు. ఇంటి తలుపుకొట్టి నరేష్ వద్ద ఉన్న సెల్‌ఫోన్లు ఇవ్వాలంటూ అడిగారు. లేవని చెప్పడంతో నరేష్‌ను వారి వెంట తీసుకెళ్లారు. నరేష్ మావయ్య రామారావు అడ్డుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో నరేష్‌ను వేమపాలేనికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగాలతోట వద్దకు తీసుకెళ్లి తుపాకీతో కాల్చి చంపారు.
నా భర్త ఇన్ ఫార్మర్ కాదు: మావోయిస్టులు తన భర్త నరేష్‌ను అన్యాయంగా చంపేశారని భార్య హేమలత బోరుమని రోదిస్తోంది. ఆమె తమ రెండేళ్ల కూతురు రోజాను విలేకరులకు చూపిస్తూ కన్నీరుమున్నీరయింది. వై.రామవరంలో కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నామని చెప్పింది. కుటుంబం గడవడం కష్టం కావడంతో నరేష్ ప్రతి శనివారం కొయ్యూరుకు కలప ముక్కలు తీసుకెళ్లి విక్రయించి, సరకులు తెస్తారని పేర్కొంది. నరేష్ అంటే గిట్టని ఎండకోట, ఈదులబందతో పాటు మరో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇచ్చిన తప్పుడు సమాచారం నమ్మి మావోయిస్టులు హతమార్చారని వాపోయింది. నరేష్ మృతదేహం వద్ద తండ్రి అప్పారావు, తల్లి లచ్చి బోరున విలపించారు. ఏ తప్పూ చేయని తమ బిడ్డ ఉసురు తీసేశారని బోరుమన్నారు.