the Maoists
-
గిరిజనుడి హత్యచేసిన మావోయిస్టులు
ఏవోబీ సరిహద్దుల్లో మరో గిరిజన నేత హత్యకు గురయ్యాడు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ గిరిజనుడిని హతమార్చారు. శుక్రవారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన మావోయిస్టులు..కొడ శిఖర గైడకు చెందిన నేత సంగ్ ను పట్టుకుని కొట్టి చంపేశారు. సంగ్ ను పోలీస్ ఇన్ఫ్మార్మర్ గా పేర్కొంటూ ఓ లేఖను వదిలి వెళ్లారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దండకారణ్యంలో కందకాలు
దండకారణ్యంలో మావోయిస్టులు భారీ స్థాయిలో కందకాల తవ్వకం చేపట్టారు. పోలీసులు ఏర్పాటు చేసే బేస్ క్యాంపులను అడ్డుకోవడంలో భాగంగానే వ్యూహాత్మకంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ఈ ప్రాంతంలో మూడు బేస్ క్యాంపులను ఏర్పాటు చేయడంతో.. మావోయిస్టులు తమ స్ధావరాలను సేఫ్ జోన్ లుగా మార్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరిన్ని బేస్ క్యాంపులు ఏర్పాటు కాకుండా.. ఇప్పటికే ఏర్పాటు చేసిన క్యాంపులకు సరఫరాలు అందకుండా ఉండేందుకే ఇదంతా చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా మరో వైపు డిసెంబర్ నెలలో ఏటా జరిగే పీఎల్ జీఏ వారోత్సవాల నిర్వహణలో భాగంగానే.. ముందు జాగ్రత్త చర్యగా కందకాల ఏర్పాటు జరుగుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని కుంట, కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలోని అమ్మపేట - పాలచల్మ మధ్యలో శుక్రవారం రాత్రి నుంచి మావోయిస్టులు రోడ్డుమార్గంలో కందకాల తవ్వకాలు మొదలుపెట్టారు. దండకారణ్య నేత సుధాకర్ నేతృత్వంలో వందలాది మంది మిలీషియా సభ్యులు ఇందులో పాల్గొన్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ రహదారిపై దాదాపు పది నుంచి పదిహేను కందకాలు తవ్వినట్లు తెలుస్తోంది. రెండునెలల క్రితం పైడిగూడెం అటవీ ప్రాంతంలోని రహదారిపై మావోయిస్టులు 20 కిపైగా కందకాలు తవ్వారు. ఆ తర్వాత మావోయిస్టు విలీన వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. డిసెంబర్2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టు పీఎల్జీఏ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వారోత్సవాల కోసమే కందకాలు తవ్వారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. -
వాయు సేన దాడులపై మావోల నిరసన
చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు మంగళవారం రాత్రి 25 వాహనాలను దగ్ధం చేశారు. వాయుసేన దాడులను నిరసిస్తూ మావోయిస్టులు బుధవారం దండకారణ్య బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో హాహాల్ది ఐరన్‌ఓర్ మైన్స్పై సుమారు 150 మంది సాయుధ మావోయిస్టులు దాడి చేశారు. మైన్లోని డీప్లాంట్లో ఉన్న డంపర్లు, మిక్సర్లు, లోడర్లు, జీపులు, పొక్లెయిన్లను మావోయిస్టులు తగులబెట్టారు. -
మావోయిస్టు పోస్టర్ల కలకలం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల నుంచి మావోయిస్టులు కదలికలు పెరిగిపోయిన తరుణంలో.. మరో సారి మవోల పోస్టుర్లు కలకలం రేపుతున్నాయి. ఖమ్మం జిల్లా చెర్ల మండలం పూసుగుప్ప గ్రామ సమీపంలోని రోటింత వాగు సమీపంలో ఆదివారం రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికేసిన మావోలు పోస్టర్లు అతికించారు. డిసెంబర్2 నుంచి 8 వరకు జరపనున్న 'పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ' వారోత్సవాలను విజయవంతం చేయాలని అందులో పేర్కొన్నారు. -
టీడీపీ ఎంపీపీ బెదిరిస్తున్నారు
అనంతపురం అర్బన్: తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని స్వాధీనం చేసుకోవడానికి రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్ తనను బెదిరిస్తున్నాడని రాప్తాడు మండలం బండమీదపల్లి గ్రామానికి చెందిన నారాయణస్వామి మాదిగ వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసుతో కలిసి బుధవారం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో బుధవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీపీ చేస్తున్న దౌర్జన్యం గురించి వివరించారు. గతంలో తాను ఒక విప్లవ పార్టీకి ఆకర్షితుడై దానిలో చేరానని, ఆ తర్వాత నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు అప్పటి జిల్లా ఎస్పీ సమక్షంలో లొంగిపోయానని నారాయణస్వామి మాదిగ తెలిపారు. అప్పట్లో నక్సల్స్ పునరావాసం కింద ప్రభుత్వం ఉపాధి కల్పిస్తామని ప్రకటించినా తనకు న్యాయం జరగలేదన్నారు. అయితే తమ పూర్వీకుల భూమి సర్వే 207 రెండో లెటర్లో ఉన్న 5.69 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు. తన భూమి గ్రామానికి సమీపాన ఉండడంతో ఆ భూమిని ఏలాగైనా సొంతం చేసుకోవాలని ఎంపీపీ తన పలుకుబడిని ఉపయోగించి బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన భూమికి రక్షణ కల్పించాలని కోరారు. అలాగే..జిల్లాలో అనేక ప్రాంతాల్లో దళితులకు శ్మశాన వాటికలు లేవని, వాటికి వెంటనే స్థలాలు కేటాయించాలని మాదిగ జేఏసీ జిల్లా యువసేన అధ్యక్షుడు వి.రమణ మాదిగ, రాష్ర్ట కో-కన్వీనర్ చిన్నపెద్దన్న మాదిగ అధికారులకు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో కాంట్రాక్టు వర్కర్లకు తొమ్మిది నెలల నుంచి వేతనాలు అందలేదని ఏపీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ, ఎస్టీ, బీసీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ నాల్గో తరగతి ఉద్యోగ సంఘం నేతలు బండారు నాగేశ్వరరావు, సి.నారాయణ, కె.జోసఫ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వేతనాలు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సకాలంలో సమస్యలు పరిష్కరించాలి : సకాలంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి సూచించారు. 15 రోజుల లో 50 శాతం ఫిర్యాదులు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. షెడ్యూల్డ్ కులాల కుటుంబాల గృహ విద్యుత్ రాయితీ కింద జిల్లాలకు 2014-15లో రూ. 13.67 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఇన్చార్జ్ కలెక్టర్ బి.ల క్ష్మీకాంతం మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అందిన 2,055 ఫిర్యాదులలో 1,845 పరిష్కరించామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న 210 పిటిషన్లను పది రోజులలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్లో 39, ఐసీడీఎస్‌లో 6, డీఆర్డీఏలో 7, డ్వామాలో 8, పోలీసుశాఖలో 48, ఎల్డీఎంలో 60, డీపీవో 3, ఆర్డబ్ల్యూఎస్ 7, వ్యవసాయశాఖలో 8 పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ సెల్లో అదనపు సంయుక్త కలెక్టర్ సయ్యద్ ఖాజామొహిద్దీన్, డీఆర్వో హేమసాగర్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మల్యాద్రి, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ పాల్గొన్నారు. -
వీర్నపల్లి
వరంగల్ జిల్లా గంగదేవిపల్లి... దేశంలోనే ఆదర్శ గ్రామంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆ ఊరు స్ఫూర్తితో జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లిని సైతం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బి.వినోద్‌కుమార్ నడుం బిగించారు. సంసద్ ఆదర్శ్ యోజన పథకంలో భాగంగా వీర్నపల్లిని దత్తత తీసుకున్న ఎంపీ... శుక్రవారం అధికార యంత్రాంగాన్ని, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మీడియాను వెంటబెట్టుకుని వీర్నపల్లిలో పర్యటించారు. వాడవాడలా కలియతిరిగారు. మూడున్నర గంటలపాటు దళిత, బీసీ వాడలతోపాటు తండవాసులతోనూ మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు చెప్పిందంతా సావధానంగా విన్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గంగదేవిపల్లి తరహాలో వీర్నపల్లిని ఒకే ఒక్క ఏడాదిలో దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. స్థానిక ప్రజలంతా ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా వీర్నపల్లిని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేయడానికి గల కారణాలను, ఏడాది వ్యవధిలో ప్రజల భాగస్వామ్యంతో చేపట్టబోయే కార్యక్రమాలను వినోద్ మీడియాకు వివరించారు. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ అట్టడుగువర్గాల పల్లె ! వీర్నపల్లిని ఆదర్శగ్రామంగా ఎంపిక చేసేందుకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి.మొత్తం 3,684 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో 99 శాతం ప్రజలు దళిత, గిరిజన, వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన వారే కావడం. 8 తండాలున్న ఈ పంచాయతీలో 42 శాతం ఎస్టీ, 22 శాతం ఎస్సీ, 35 శాతం బీసీ జనాభా ఉన్నారు. మిగిలిన ఒకే ఒక్క శాతం జనాభాలో ఒక వెలమ, 10 వైశ్య సామాజిక కుటుంబాలు నివసిస్తున్నాయి. పురుష, మహిళా నిష్పత్తిలో మహిళలే అధికంగా ఉన్న పల్లె ఇది. 2007లో ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి కరీంనగర్ ఎంపీ కేసీఆర్ ఈ గ్రామంలో పర్యటించారు. వీర్నపల్లిని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, అందుకోసం స్వయంగా నెత్తిన తట్టపెట్టుకుని మట్టి మోస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామమిది. గతంలో పూర్తి నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడం, ఒకనాడు పోలీసుల బూట్ల చప్పుళ్లు, నక్సలైట్ల సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో భాగంగానే...ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఁసంసద్ ఆదర్శ గ్రామీణ యోజన*లో ఒక్కో పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలో మూడు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా మార్చాలి. అందులో భాగంగా వినోద్‌కుమార్ తొలి ఏడాది వీర్నపల్లెను ఆదర్శ గ్రామంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఁసంసద్ ఆదర్శ గ్రామీణ యోజన* కింద కేంద్రం ప్రత్యేకించి ఎలాంటి నిధులూ మంజూరు చేయదు. వివిధ కేంద్ర పథకాల కింద విడుదలయ్యే నిధులను ఎంపీ ఎంపిక చేసిన గ్రామానికి మళ్లించి అభివృద్ధి చేసే వెసులుబాటును కేంద్రం కల్పించింది. స్థానిక ఎంపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ గ్రామాన్ని తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని నియమిస్తారు. ఆదర్శ గ్రామమంటే...... ఆర్థిక తోడ్పాటుతోనే ఒక గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దలేమని గ్రహించిన కేంద్రం మొత్తం 72 అంశాలతో మార్గదర్శకాలను రూపొందించింది. వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, పర్యావరణ, మానవాభివృద్ధికి సంబంధించిన అంశాలతోపాటు సామాజిక భద్రత, సుపరిపాలనకు సంబంధించి పలు అంశాలను అందులో పొందుపర్చింది. ఇవన్నీ సాధ్యం కావాలంటే స్థానిక ప్రజల భాగస్వామ్యమే కీలకమని పేర్కొంది. సమస్యలకు కేరాఫ్ వీర్నపల్లి వీర్నపల్లి గ్రామం సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. 8 తండాల్లోనూ మంచినీటి సౌకర్యం లేదు. తండాల్లోని ఏ ఒక్క ఇంటికీ మరుగుదొడ్డి లేదు. 150కి పైగా కుటుంబాల జీవనం పూరి గుడిసెల్లోనే. పూర్తి అటవీ ప్రాంతం కావడంతో పులికుంట, పులిదేవుని, వెంకమ్మ చెరువులు అభివృద్ధికి నోచుకోలేదు. సాగునీటి సౌకర్యం అంతంత మాత్రమే. బోర్లపైనే ఆధారపడటం వల్ల రైతులు చితికిపోతున్నారు. భూగర్భ జలాలు సైతం అడుగంటడంతో బోర్లు కూడా పడే పరిస్థితి కన్పించడం లేదు. నిరక్ష్యరాస్యత తాండవిస్తున్న గ్రామమిది. మొత్తం జనాభాలో సగం మంది నిరక్షరాస్యులే. ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని గిరిజన తండాలన్నింటికీ ఈ గ్రామమే కేంద్ర బిందువు. అయినా, ఇక్కడ ప్రాథమిక ఆసుపత్రి కూడా లేదు. తండాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానం. తండాల నుంచి గ్రామ పంచాయతీకి వెళ్లాలంటే దారిలో ఉన్న పెద్దవాగును దాటాల్సిందే. ఇక్కడ కల్వర్టు లేకపోవడంతో వర్షాకాలమొస్తే పంచాయతీతో సంబంధాలు దాదాపు తెగినట్లే. అటవీ ప్రాంతంలో ఉన్న పలు గ్రామాల ప్రజలు బ్యాంకు లావాదేవీలు జరపాలంటే మండలకేంద్రానికి వెళ్లాల్సి రావడంతో ఆర్థిక భద్రత కొరవడింది. వీటన్నికంటే ఈ పంచాయతీ పరిధిలోని ప్రతి తండాలోనూ నాటుసారా ఏరులై పారుతోంది. మద్యం బారిన పడిన వారే ఎక్కువగా ఉన్నారు. ఎంపీ తమ గ్రామానికి, తండాలకు రావడంతో స్థానిక ప్రజలు అనేక సమస్యలు ఏకరవు పెట్టారు. మంచినీళ్లు లేవని కొందరు, పింఛన్లు రావడం లేదని మరికొందరు వ్యక్తిగత అర్జీలు ఇచ్చారు. ఏడాదిలో రూపరేఖలు మారుస్తా సామాజిక ఉద్యమం చేపట్టి ఏడాదిలోగా వీర్నపల్లి రూపరేఖలు మారుస్తానని ఎంపీ వినోద్‌కుమార్ చెప్పారు. శుక్రవారం వీర్నపల్లితోపాటు మూడు తండాల్లో పర్యటించిన ఆయన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, బాలవికాస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.శౌరిరెడ్డితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘వీర్నపల్లి నా పుట్టినూరు కాదు, అత్తగారి ఊరు అసలే కాదు. అయినా రాబోయే రోజుల్లో ఇక్కడే ఉంటా. కేంద్ర పథకాలతోపాటు ఎంపీ నిధులను కూడా ఇక్కడ ఖర్చు చేస్తా. ప్రవాస భారతీయులు, పారిశ్రామికవేత్తలు, సంపన్నుల సాయం తీసుకుంటా. వారికి స్ఫూర్తి కలిగించేలా పథకాన్ని త్వరలోనే రూపొందిస్తా. ప్రతి గ్రామంలో యువ కమిటీలను ఏర్పాటు చేస్తా. మేధావులు, అధ్యాపకులను ఇక్కడికి తీసుకొస్తా. ఉత్సాహంగా ఉన్న ఈ ఊరి ప్రజలే నా శక్తి. గ్రామపెద్దలు, ఉత్సాహవంతులను ఆదర్శ గ్రామాలైన గంగదేవిపల్లె, అంకాపూర్ ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ జరిగిన అభివృద్ధిని వివరిస్తా. నెలరోజుల్లోనే ఇక్కడ తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖను ఏర్పాటు చేయిస్తా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, తండాల్లో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తా’ అని హామీ ఇచ్చారు. -
11 ఏళ్ల తర్వాత.. బ్రహ్మోత్సవాలకు బాబు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బ్రహ్మాండనాయకుడికి పట్టువస్త్రాలు సమర్పించేందు కు 11 ఏళ్ల తర్వాత సీఎం హోదాలో ఎన్.చంద్రబాబునాయుడు శుక్రవారం తిరుమలకు రానున్నారు. 2003 అక్టోబరు 1న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళుతున్న చంద్రబాబుపై అలిపిరి వద్ద మావోయిస్టులు క్లెమోర్‌మైన్‌తో దాడిచేసిన విషయం విదితమే. ఆ కేసులో ముగ్గురిని దోషులుగా నిర్ధారించి తిరుపతి కోర్టు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు ను ఇవ్వడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున శ్రీవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టువస్త్రాలను సమర్పించేవారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టేదాకా ఇదే సంప్రదాయం కొనసాగింది. కానీ.. గరుడసేవ సం దర్భంగా తిరుమలకు లక్షలాది మంది భక్తులు వస్తారని, ఇదే సమయంలో సీఎం వస్తే భక్తులు ఇబ్బంది పడతారని అర్చకులు, వేద పండితులు వైఎస్ దృష్టికి తీసుకెళ్లారు. భక్తులను ఇబ్బందులకు గురిచేయకూడదనే ఉద్దేశంతో బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం రోజునే శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించే ఆనవాయితీకి 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తెరతీశారు. ఆ ఆనవాయితీని కొనసాగించాలని చం ద్రబాబు నిర్ణయించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శుక్రవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏడుకొండలస్వామికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు చంద్రబాబు తిరుమలకు వస్తున్నారు. సీఎం హోదాలో చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి సరిగ్గా 11 ఏళ్లు అవుతోంది. అక్టోబరు 1, 2003న అలిపిరి వద్ద చంద్రబాబుపై మావోయిస్టులు క్లెమోర్‌మైన్స్‌తో దాడి చేశారు. ఆ సానుభూతిని ఓట్ల రూపంలో మల్చుకుని.. మరో సారి అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో వైఎస్ ప్రభంజనం ముందు సానుభూతిపై చంద్రబాబు పెంచుకున్న ఆశలు నిలబడలేకపోయాయి. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరింది. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోసారి ఏర్పాటైంది. నాలుగు నెలల క్రితం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో చంద్రబాబూ మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటికే అలిపిరి దాడి కేసు విచారణ కూడా తుదిదశకు చేరుకుంది. ఈలోగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సంబరానికి తెరలేచింది. ధ్వ జారోహణం సందర్భంలోనే వేంకటేశ్వరునికి పట్టువస్త్రాలను సమర్పించడానికి శుక్రవారం తిరుమలకు చేరుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు పర్యటనకు సరిగ్గా 24 గంటల ముందు అలిపిరి దాడి కేసుపై తిరుపతి కోర్టు తీర్పు వెలువరించింది. ఆ కేసులో ముగ్గురిని దోషులుగా నిర్ధారించి శిక్షను విధిస్తూ తీర్పును ఇవ్వడం గమనార్హం. ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. చిత్తూరు (సెంట్రల్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు రానున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లో బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఒంటి గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 1.50 గంటలకు తిరుమల శ్రీపద్మావతి అతిథి భవనానికి చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి 7 గంటల నుంచి 8.45 గంటల వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. 9 గంటలకు తిరుమల నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 10 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాద్‌కు వెళ్తారని కలెక్టర్ తెలిపారు. -
అన్నలస్తున్రు!
మహదేవపూర్ : పీపుల్స్‌వార్ ఉద్యమం జోరుగా ఉన్న సమయంలో ‘అన్న’లకు అమ్మఒడిలాంటి తూర్పు అడవుల్లో తిరిగి పట్టు సాధించేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 21 నుంచి 28 వరకు మావోయిస్టుల పదో ఆవిర్భావ దినం సందర్భంగా వారోత్సవాలు జరుపుకోనున్న నేపథ్యంలో.. పదిరోజులుగా జరుగుతున్న సంఘటనలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో ఇప్పటికే పలు హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్న మావోయిస్టులు.. తూర్పు అడవుల్లోనూ సంచరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. పదిరోజుల వ్యవధిలోనే మహారాష్ట్ర వైపు నుంచి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలోకి.. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాల నుంచి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లోకి ఏకకాలంలో వచ్చినట్లు ఆయా ప్రాంతాల్లో జరిగిన సంఘటనలను బట్టి తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల సంఘటన, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలను బట్టి మావోయిస్టులు వ్యూహాత్మకంగానే ఉత్తర తెలంగాణ అడవుల్లోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ (కేకేడబ్ల్యు) కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బడే దామోదర్ అలియాస్ చొక్కారావు భార్య సబిత ఎన్కౌంటర్లో చనిపోయిన అనంతరం మహదేవపూర్, ఏటూరు నాగారం ఏరియా కమిటీ కమాండర్‌గా నియమితులైన వరంగల్ జిల్లా ఆజంనగర్ ప్రాంతానికి చెందిన మేకల రాజు అలియాస్ మురళి ఈ ప్రాంతంపై ఉన్న పట్టుతో పదిరోజుల క్రితం తూర్పు అడవుల్లోకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మహదేవపూర్ మండలంలోని వివిధ గ్రామాలతోపాటు మహాముత్తారం, వరంగల్‌జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సంచరించి తనకున్న పరిచయాలతో పార్టీని బలోపేతం చేయడంలో నిమగ్నమైనట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఏరియా కమిటీలోని సభ్యులతో ఈ ప్రాంతంలో పర్యటించిన ట్టు తెలుస్తోంది. కేకేడబ్ల్యు కార్యదర్శి దామోదర్, మేకల రాజు ఇద్దరికీ తూర్పు అడవుల్లోని అణువణువూ తెలుసని, ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో వారికున్న సంబంధాలతో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ సమాచారం అందుకున్న పోలీసు బలగాలు తూర్పు అడవుల్లో కూంబింగ్ ప్రారంభించాయి. ఇటు మావోయిస్టుల సంచారానికి తోడు గతంలో పీపుల్స్‌వార్‌లో పనిచేసి లొంగిపోయి.. కొద్దిరోజులు జనశక్తిలో పనిచేసిన మండలంలోని బెగ్లూరు గ్రామానికి చెందిన చౌదరి శ్రీనివాస్ అలియాస్ రమాకాంత్ తిరిగి కొంతమందితో దళాన్ని తయారు చేసినట్టు తెలుస్తోంది. ఈయన ఇటీవల మండలంలోని ఓ లోతట్టు అటవీ గ్రామంలోకి తన దళంతోపాటు వచ్చి గ్రామంలోని కొందరిని కలిసినట్టు, అక్కడే వంట చేసుకుని తిని వెళ్లినట్టు తెల్సింది. ఇటు మావోయిస్టులు, అటు సొంతంగా ఏర్పాటు చేసుకున్న దళం సంచరిస్తుండడం.. సాయుధ పోలీసు బలగాలు కూంబింగ్‌తో దశాబ్ద కాలంగా ప్రశాంతంగా ఉన్న తూర్పు అడవులు భయంతో వణికిపోతున్నాయి. ఎప్పు డు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని అటవీ ప్రాంతాల ప్రజలు భిక్కుభిక్కుమంటున్నారు. మావోయిస్టుల వారోత్సవాలకు కొద్దిరోజుల ముందు సాయుధ దళాలు సంచరించడం యా ధృచ్ఛికమో..? లేక వ్యూహంలో భాగమో..? కానీ తూర్పు అడవుల్లో మాత్రం మళ్లీ అలజడి మొదలైందనేది మాత్రం నిజం. -
మన్యంలో మళ్లీ అలజడి
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి కాల్చివేత మృతుడు మాజీ ఎల్జీఎస్ కమాండర్ నరేష్ ఇన్ఫార్మర్ కాదు : భార్య మావోయిస్టులు మళ్లీ పెట్రేగారు. ఇన్ఫార్మర్ నెపంతో మాజీ మావోయిస్టును చంపి పోలీసులకు సవాల్ విసిరారు. విశాఖ-తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులో జరిగిన ఈ సంఘటనతో మన్యంలో మళ్లీ అలజడి రేగింది. కొయ్యూరు: విశాఖ మన్యంలో పోలీస్ ఇన్ఫార్మర్ పేరిట మావోయిస్టులు ఓ గిరిజనుడిని తుపాకీతో కాల్చి చంపారు. గతంలో దళంలో పనిచేసి లొంగిపోయిన మువ్వల లచ్చి అలియాస్ లక్ష్మణరావు అలియాస్ నరేష్(25)ను తూర్పు గోదావరి విశాఖ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన జంగాలతోట సమీపంలో శనివారం తెల్లవారుజామున గాలికొండ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టు నేతలు ఆజాద్, ఆనంద్ మరో నలుగురు కలిసి కాల్చి చంపా రు. నరేష్ ఇన్ఫార్మర్ నెట్‌వర్క్‌లో చేరి ప్రజలకు అన్యాయం చేయడంతో హతమార్చినట్లు మావోయిస్టులు అక్కడ వదిలిన లేఖలో పేర్కొన్నారు. నరేష్ నేపథ్యం యు.చీడిపాలెం పంచాయతీ ఎండకోటకు చెందిన మువ్వల నరేష్ 2001లో మావోయిస్టుల్లో చేరి 2005 వరకు పనిచేశాడు. తర్వాత ఏరియా కమిటీ సభ్యునిగా, పలకజీడి ఏరియా కమిటీకీ కమాండర్‌గా పనిచేశారు. 2006లో కాకినాడలో లొంగిపోయాడు. 2007లో ధారకొండలో పదవ తరగతి వరకు చదివాడు. అది పూర్తయిన వెంటనే ఎండకోట వచ్చి వ్యవసాయం చేసేవాడు. 2009 వరకు ఎండకోటలో ఉన్న నరేష్ మావోయిస్టుల నుంచి ఇబ్బందులు వస్తాయని వై.రామవర ం వెళ్లిపోయాడు. తర్వాత పోలీసు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నారని అనుమానించిన మావోయిస్టులు వారి హిట్ జాబితాలో చేర్చారు. సంఘటన ఎలా జరిగిందంటే! : వై.రామవరంలో మకాం పెట్టిన నరేష్ జీవన భృతి కోసం కొంతకాలంగా రోజ్‌వుడ్, నేరేడు కలప ముక్కలను కొయ్యూరు సంతలో విక్రయిస్తూ కాలం నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో నరేష్ బుధవారం ఈ కలప కోసం వేమపాలెం వచ్చాడు. నరేష్ వేమపాలెంలో ఉన్నారని తెలుసుకున్న మావోయిస్టులు ఆ ఇంటిని శుక్రవారం అర్ధరాత్రి చుట్టుముట్టారు. ఇంటి తలుపుకొట్టి నరేష్ వద్ద ఉన్న సెల్ఫోన్లు ఇవ్వాలంటూ అడిగారు. లేవని చెప్పడంతో నరేష్‌ను వారి వెంట తీసుకెళ్లారు. నరేష్ మావయ్య రామారావు అడ్డుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో నరేష్‌ను వేమపాలేనికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగాలతోట వద్దకు తీసుకెళ్లి తుపాకీతో కాల్చి చంపారు. నా భర్త ఇన్ ఫార్మర్ కాదు: మావోయిస్టులు తన భర్త నరేష్‌ను అన్యాయంగా చంపేశారని భార్య హేమలత బోరుమని రోదిస్తోంది. ఆమె తమ రెండేళ్ల కూతురు రోజాను విలేకరులకు చూపిస్తూ కన్నీరుమున్నీరయింది. వై.రామవరంలో కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నామని చెప్పింది. కుటుంబం గడవడం కష్టం కావడంతో నరేష్ ప్రతి శనివారం కొయ్యూరుకు కలప ముక్కలు తీసుకెళ్లి విక్రయించి, సరకులు తెస్తారని పేర్కొంది. నరేష్ అంటే గిట్టని ఎండకోట, ఈదులబందతో పాటు మరో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇచ్చిన తప్పుడు సమాచారం నమ్మి మావోయిస్టులు హతమార్చారని వాపోయింది. నరేష్ మృతదేహం వద్ద తండ్రి అప్పారావు, తల్లి లచ్చి బోరున విలపించారు. ఏ తప్పూ చేయని తమ బిడ్డ ఉసురు తీసేశారని బోరుమన్నారు. -
సరిహద్దులో ఉద్రిక్తత
ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు గిరిజనుల హతం వారోత్సవాలకు భయాందోళనలు సీలేరు : ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీఎల్జీఏ వారోత్సవాల ప్రారంభానికి ముందు మావోయిస్టులు తెగబడ్డారు. ఒక్కసారిగా మన్యంలో వాతావరణం వేడెక్కింది. సరిహద్దులోని ఒడిశా మల్కన్‌గిరిజిల్లా సలిమెల పోలీసు స్టేషన్ పరిధి గొర్రెగుడకు చెందిన ఇద్దరు గిరిజనులను పోలీసు ఇన్ఫార్మర్ల నెపంతో దళసభ్యులు హతమార్చారు. శుక్రవారం మధ్యాహ్నం సాయుధు మావోయిస్టులు గ్రామంలోకి వచ్చి దొంగ మడకాని, దెబొ మడకానిల గురించి ఆరాతీశారు. పోలీసు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ ఇద్దరినీ చంపారు. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ సంఘటనా స్థలంలో ఓ లేఖ వదిలి వెళ్లారు. ఈ నెల 28 నుంచి వారోత్సవాల నేపథ్యంలో సరిహద్దుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఒడిశా, ఆంధ్ర పోలీసు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇప్పటికే వందలాది మంది గ్రేహాండ్స్, బీఎస్ఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ సంఘటనతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ అనుమానితులను ఆరాతీస్తున్నారు. ప్రజా ప్రతినిధులు మైదానానికి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. శుక్రవారం సీలేరులో ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఆధార్ సిబ్బంది కిడ్నాప్ సరిహద్దు మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మరిగట్టు పంచాయతీలో ఆధార్ నమోదు సిబ్బందిని 15 మంది మావోయిస్టులు అడ్డగించి కిడ్నాప్ చేశారు. 7 గంటలపాటు నిర్బంధించి అనేక అంశాలను వారితో చర్చించారు. అనంతరం వారి వద్ద ఉన్న 3 ల్యాప్‌టాప్‌లు, 2 ప్రింటర్లను లాక్కుని కొంత దూరం తీసుకొచ్చి వదిలి వెళ్ళారు. అనంతరం ఆధార్ సిబ్బంది కాలిబాటన కలిమెల హెడ్ క్వార్టర్స్‌కు చేరుకొన్నారు. -
మన్యం రోడ్లకు మావోల బెడద
నిలిచిన 14 రహదారుల పనులు నిర్మాణానికి ముందుకు రాని కాంట్రాక్టర్లు రవాణాకు గిరిజనుల ఇబ్బందులు పాడేరు : ఏజెన్సీలోని జీకేవీధి మండలం నుంచి ముంచంగిపుట్టు వరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమైన 14 రోడ్డు పనులు మావోయిస్టుల హెచ్చరికలతో నిలిచిపోయాయి. పీఎంజీఎస్‌వై పథకం కింద మూడేళ్లలో ఈ 14 రోడ్లకు రూ.47.30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అన్ని రోడ్ల పనులను చేసేందుకు టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు మట్టి చదును పనుల దశలోనే వీటిని నిలిపివేశారు. పలు రోడ్ల వద్ద మావోయిస్టులు యంత్రాలను దహనం చేయడం, నిర్మాణదారులకు రోడ్డు పనులు నిలిపివేయాలని హెచ్చరికలు జారీ చేయడం వంటి కారణాలతో ఈ రోడ్డు పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ రోడ్లను పూర్తి చేయలేమంటూ కాంట్రాక్టర్లంతా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపారు. ప్రస్తుతం మట్టి చదును పనులతో నిలిచిపోయిన రోడ్లన్నీ అధ్వానంగానే మారాయి. రోడ్డు పనులు చేపట్టడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ మావోయిస్టుల హెచ్చరికలతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఈ రోడ్డు పనులు పూర్తయితే సుమారు 300 మారుమూల పల్లెలకు పక్కా రోడ్డు సౌకర్యం ఏర్పడుతుంది. అయితే ఈ రోడ్లన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఉండడంతో నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. ముఖ్యమైన ఈ మారుమూల రోడ్లు అభివృద్ధి చెందకపోవడంతో రవాణాపరంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంచంగిపుట్టు మండలంలోని లబ్బూరు నుంచి బుంగాపుట్టుకు పోయే 21 కి.మీ రోడ్డుకు రూ.740.90 లక్షలు, 14.13 కి.మీ జొడిగుమ్మ-రంగబయలు రోడ్డుకు రూ.730 లక్షలు, పెదబయలు మండలంలోని బూసిపుట్టు-ఒడిషా సరిహద్దులో 11 కి.మీ రోడ్డుకు రూ.343.60 లక్షలు, పెదగుల్లెలు 4.41 కి.మీ రోడ్డుకు రూ.332.02 లక్షలు, వనడ 5.70 కి.మీ రోడ్డుకు రూ.426.93 లక్షలు, గంజిగబురాల రోడ్డుకు రూ.265.40 లక్షలు, మరో బిట్‌కు రూ.94.25 లక్షలు, ఇదే రోడ్డులోని చివరిబిట్టుకు రూ.49.70 లక్షలు, చింతగరువు-తారాబు రోడ్డుకు రూ.141.35 లక్షలు, కిండలం రోడ్డుకు రూ.321.02 లక్షలు, జీకేవీధి మండలంలోని బూరుగుపాకల నుంచి పశువులబంద రోడ్డుకు రూ.228.75 లక్షలు, నిమ్మలపాలెం-గోమువాడ రోడ్డుకు రూ.221 లక్షలు, చింతపల్లి ప్రాంతంలోని నిమ్మపాడు-గొప్పుగుడిసెల రోడ్డుకు రూ.313 లక్షలు, పెదగరువు నుంచి లక్ష్మిపురం రోడ్డుకు రూ.562 లక్షల పీఎంజీఎస్‌వై నిధులు మంజూరయ్యాయి. -
పోలీసులకు పెను సవాల్
మన్యం ప్రజాప్రతినిధులకు మావోయిస్టుల లక్ష్మణరేఖ ఏజెన్సీలో ఘర్షణపూరిత వాతావరణం కత్తి మీద సాములా సాధారణ ఎన్నికలు కొయ్యూరు/పెదబయలు, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికలు పోలీసులకు పెను సవాలుగా మారాయి. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు అవకాశం కోసం కాచుకుని కూర్చున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఏజెన్సీలో ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశముందంటూ నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల జిల్లా ఎస్పీ ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో మన్యంలో ప్రచారంలో తిరిగే ప్రజాప్రతినిధులను మట్టుబెట్టడానికి యాక్షన్టీములను నియమించినట్టు తమకు సమాచారముందని ఎస్పీ దుగ్గల్ తెలిపారు. దళసభ్యుల హిట్‌లిస్టులో ఉన్న 36 మంది ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మైదానంతోపాటు ఏజెన్సీలోనూ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటుందన్న వాదన వ్యక్తమవుతోంది. ఇదే అదనుగా తమ ఉనికిని చాటుకోవడానికి మావోయిస్టులు తహతహలాడుతున్నా రు. ఎన్నికల ప్రచారానికొచ్చేవారిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. మావోయిస్టులు ఇటీవల బల పం పంచాయతీ సర్పంచ్ కార్లను చంపడం ద్వారా హింసకు పాల్పడతామని పరోక్షంగా స్పష్టం చేశారు. గత 15 రోజుల నుంచి మిలీషియాతో కలిసి దళసభ్యులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. గతనెల 22న పెదబయలు మండలం గుల్లేలు సమీపంలో మావోయిస్టులు పొక్లెయిన్‌ను దగ్ధం చేసినప్పటి నుంచి ఒక్క సారిగా వాతావరణం వేడెక్కింది. అలా గే గత నెల 27 న పెదబయలు మండలం ఇంజరి అటవీ ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించి ఇంజరి, గిన్నెలకోట, జామిగుడ పంచాయితీ సర్పంచ్‌లు, ఇంజరి మాజీ సర్పంచ్, గిన్నెగరువు,మూలలోవ గ్రామాలకు చెందిన కొందరికి దేహశుద్ధి చేశారు. అంతటితో ఊరుకోకుండా ఊరు విడిచి వెళ్లరాదంటూ లక్ష్మణ రేఖ గీశారు. గ్రామాల్లోని నాయకులపై మిలీషియా సభ్యులు కన్నేసి ఉంచుతున్నారు. అరకు,పాడేరు నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రా లు అన్నింటిని సమస్యాత్మకమైనవిగా అధికారులు పరిగణిస్తున్నారు. పాడేరు నియోజకవర్గంలోని 242 పోలింగ్ కేంద్రాల్లో 130కి పైగా కేంద్రాల్లో ఏమి జరిగినా తెలిసే సమాచార వ్యవస్థ లేదు. ఇవన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో ఆయా కేంద్రాలకు పోలీసు బలగాలు, పోలింగ్‌సిబ్బంది, బ్యాలెట్ బాక్సుల తరలింపు, తీసుకురావడానికి అధికారులు రెండు హెలికాప్టర్లను సిద్ధం చేస్తున్నారు. ఇలా ఈ సారి ఎన్నికలు పోలీసులకు కత్తిమీద సాములా కనిపిస్తున్నాయి. -
‘కాఫీ’పై మావోయిస్టుల కన్నెర్ర
=ట్రాక్టర్ దహనం, సిబ్బందిపై దాడితో హల్చల్ =భౌతిక దాడులతో ఉద్యోగులు బెంబేలు =భవిష్యత్తుపై అధికారులతో చర్చలు చింతపల్లి, న్యూస్‌లైన్: ఏజెన్సీలో మావోయిస్టులు మళ్లీ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్డీసీ) ఆస్తులు లక్ష్యంగా దాడులకు తలపడ్డారు. కాఫీ సంస్థపై దాడులకు తెగబడ్డారు. మొన్నటి వరకు ఆ సంస్థ ఆస్తులనే ధ్వంసం చేసే మావోయిస్టులు నానాటికీ ఉద్యోగులపైన భౌతిక దాడులకు సమాయత్తమవుతున్నారు. ఉద్యోగుల గుండెల్లో కలవరం సృష్టిస్తున్నారు. ఆదివా రం రాత్రి చింతపల్లి మండలంలోని చెరపల్లి వద్ద ఎపీఎఫ్‌డీసీ కాఫీ గింజలను తరలిస్తున్న ట్రాక్టర్‌కు నిప్పటించడంతోపాటు వాచ్మెన్ ఉంటున్న పూరిపాకను దహనం చేశారు. అక్కడే ఉన్న ఫీల్డ్‌మన్ సత్యనారాయణ, వాచ్మెన్ పండన్న, రాంబాబులకు దేహశుద్ధి చేశారు. మరోవైపున జీకే వీధి మండలంలోని పెదవలసలో కాఫీ ఉద్యోగి ద్విచక్ర వాహనాన్ని దహనం చేశారు. ఆ సమయంలో అతను ఇంటిలో లేరు. ఏజెన్సీలో ప్రభుత్వ పరంగా సాగుచేస్తున్న కాఫీ తోటలన్నిటినీ గిరిజనులకు పంచిపెట్టాలని, కాఫీ అధికారులు తోటల జోలికి రావద్దని హెచ్చరిస్తూ కరపత్రాలు వెదజల్లారు. చింతపల్లి, జీకే వీధి మండలాల్లో నాలుగు డివిజన్లలో3,400 హెక్టార్లలో ఎపీఎఫ్‌డీసీ కాఫీ సాగు చేపడుతుంది. ఇవి దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇప్పటికే బలపం ప్రాంతంలోని 110 హెక్టా ర్లు, మర్రిపాకలు ఎస్టేట్‌లోని 60 హెక్టార్ల కాఫీ తోటలను మావోయిస్టులు గిరిజనులకు పంపిణీ చేశారు. చాపరాతిపాలెం ప్రాంతంలో సుమారు 100 హెక్టార్ల కాఫీ తోటలను స్థానిక గిరిజనులకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ తోటల జోలికి రావద్దని ఆ శాఖ అధికారులకు పలుమార్లు హెచ్చరించారు. తాజాగా చెరపల్లిలోని 110 హెక్టార్ల కాఫీ తోటలను గిరిజనులకు పంపిణీ చేయాలని మావోయిస్టులు పథకం వేశారు. ఇందులోభాగంగానే ఆదివారం రాత్రి ట్రాక్టర్‌కు నిప్పంటించి కరపత్రాలు వెదజల్లడమే కాకుండా ఆ శాఖ ఉద్యోగులపై దాడి చేశారు. దీంతో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో విధులు నిర్వహించ డం కష్టంగా ఉందని కాఫీ సంస్థ ఉద్యోగులు వాపోతున్నారు. పండ్ల సేకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో మావోయిస్టులు దాడులకు పాల్పడుతుండడంతో ఉద్యోగులంతా మండల కేంద్రాలకు పరుగులు పెట్టారు. భవిష్యత్ కార్యచరణపై ఆ శాఖ అధికారులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.