అన్నలస్తున్రు!
మహదేవపూర్ :
పీపుల్స్‌వార్ ఉద్యమం జోరుగా ఉన్న సమయంలో ‘అన్న’లకు అమ్మఒడిలాంటి తూర్పు అడవుల్లో తిరిగి పట్టు సాధించేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 21 నుంచి 28 వరకు మావోయిస్టుల పదో ఆవిర్భావ దినం సందర్భంగా వారోత్సవాలు జరుపుకోనున్న నేపథ్యంలో.. పదిరోజులుగా జరుగుతున్న సంఘటనలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో ఇప్పటికే పలు హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్న మావోయిస్టులు.. తూర్పు అడవుల్లోనూ సంచరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. పదిరోజుల వ్యవధిలోనే మహారాష్ట్ర వైపు నుంచి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలోకి.. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాల నుంచి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లోకి ఏకకాలంలో వచ్చినట్లు ఆయా ప్రాంతాల్లో జరిగిన సంఘటనలను బట్టి తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల సంఘటన, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలను బట్టి మావోయిస్టులు వ్యూహాత్మకంగానే ఉత్తర తెలంగాణ అడవుల్లోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ (కేకేడబ్ల్యు) కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బడే దామోదర్ అలియాస్ చొక్కారావు భార్య సబిత ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన అనంతరం మహదేవపూర్, ఏటూరు నాగారం ఏరియా కమిటీ కమాండర్‌గా నియమితులైన వరంగల్ జిల్లా ఆజంనగర్ ప్రాంతానికి చెందిన మేకల రాజు అలియాస్ మురళి ఈ ప్రాంతంపై ఉన్న పట్టుతో పదిరోజుల క్రితం తూర్పు అడవుల్లోకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మహదేవపూర్ మండలంలోని వివిధ గ్రామాలతోపాటు మహాముత్తారం, వరంగల్‌జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సంచరించి తనకున్న పరిచయాలతో పార్టీని బలోపేతం చేయడంలో నిమగ్నమైనట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఏరియా కమిటీలోని సభ్యులతో ఈ ప్రాంతంలో పర్యటించిన ట్టు తెలుస్తోంది. కేకేడబ్ల్యు కార్యదర్శి దామోదర్, మేకల రాజు ఇద్దరికీ తూర్పు అడవుల్లోని అణువణువూ తెలుసని, ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో వారికున్న సంబంధాలతో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ సమాచారం అందుకున్న పోలీసు బలగాలు తూర్పు అడవుల్లో కూంబింగ్ ప్రారంభించాయి.
ఇటు మావోయిస్టుల సంచారానికి తోడు గతంలో పీపుల్స్‌వార్‌లో పనిచేసి లొంగిపోయి.. కొద్దిరోజులు జనశక్తిలో పనిచేసిన మండలంలోని బెగ్లూరు గ్రామానికి చెందిన చౌదరి శ్రీనివాస్ అలియాస్ రమాకాంత్ తిరిగి కొంతమందితో దళాన్ని తయారు చేసినట్టు తెలుస్తోంది. ఈయన ఇటీవల మండలంలోని ఓ లోతట్టు అటవీ గ్రామంలోకి తన దళంతోపాటు వచ్చి గ్రామంలోని కొందరిని కలిసినట్టు, అక్కడే వంట చేసుకుని తిని వెళ్లినట్టు తెల్సింది. ఇటు మావోయిస్టులు, అటు సొంతంగా ఏర్పాటు చేసుకున్న దళం సంచరిస్తుండడం.. సాయుధ పోలీసు బలగాలు కూంబింగ్‌తో దశాబ్ద కాలంగా ప్రశాంతంగా ఉన్న తూర్పు అడవులు భయంతో వణికిపోతున్నాయి. ఎప్పు డు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని అటవీ ప్రాంతాల ప్రజలు భిక్కుభిక్కుమంటున్నారు. మావోయిస్టుల వారోత్సవాలకు కొద్దిరోజుల ముందు సాయుధ దళాలు సంచరించడం యా ధృచ్ఛికమో..? లేక వ్యూహంలో భాగమో..? కానీ తూర్పు అడవుల్లో మాత్రం మళ్లీ అలజడి మొదలైందనేది మాత్రం నిజం.