వీర్నపల్లి | Virnapalli | Sakshi
Sakshi News home page

వీర్నపల్లి

Published Sat, Nov 22 2014 4:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

వీర్నపల్లి

వీర్నపల్లి

వరంగల్ జిల్లా గంగదేవిపల్లి... దేశంలోనే ఆదర్శ గ్రామంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆ ఊరు స్ఫూర్తితో జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లిని సైతం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బి.వినోద్‌కుమార్ నడుం బిగించారు. సంసద్ ఆదర్శ్ యోజన పథకంలో భాగంగా వీర్నపల్లిని దత్తత తీసుకున్న ఎంపీ... శుక్రవారం అధికార యంత్రాంగాన్ని, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మీడియాను వెంటబెట్టుకుని వీర్నపల్లిలో పర్యటించారు.

వాడవాడలా కలియతిరిగారు. మూడున్నర గంటలపాటు దళిత, బీసీ వాడలతోపాటు తండవాసులతోనూ మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు చెప్పిందంతా సావధానంగా విన్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గంగదేవిపల్లి తరహాలో వీర్నపల్లిని ఒకే ఒక్క ఏడాదిలో దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. స్థానిక ప్రజలంతా ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా వీర్నపల్లిని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేయడానికి గల కారణాలను, ఏడాది వ్యవధిలో ప్రజల భాగస్వామ్యంతో చేపట్టబోయే కార్యక్రమాలను వినోద్ మీడియాకు వివరించారు.     
- సాక్షి ప్రతినిధి, కరీంనగర్
 
 అట్టడుగువర్గాల పల్లె !
 వీర్నపల్లిని ఆదర్శగ్రామంగా ఎంపిక చేసేందుకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి.మొత్తం 3,684 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో 99 శాతం ప్రజలు దళిత, గిరిజన, వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన వారే కావడం. 8 తండాలున్న ఈ పంచాయతీలో 42 శాతం ఎస్టీ, 22 శాతం ఎస్సీ, 35 శాతం బీసీ జనాభా ఉన్నారు. మిగిలిన ఒకే ఒక్క శాతం జనాభాలో ఒక వెలమ, 10 వైశ్య సామాజిక కుటుంబాలు నివసిస్తున్నాయి. పురుష, మహిళా నిష్పత్తిలో మహిళలే అధికంగా ఉన్న పల్లె ఇది.
 
      2007లో ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి కరీంనగర్ ఎంపీ కేసీఆర్ ఈ గ్రామంలో పర్యటించారు. వీర్నపల్లిని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, అందుకోసం స్వయంగా నెత్తిన తట్టపెట్టుకుని మట్టి మోస్తానని హామీ ఇచ్చారు.

      కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామమిది. గతంలో పూర్తి నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడం, ఒకనాడు పోలీసుల బూట్ల చప్పుళ్లు, నక్సలైట్ల సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో భాగంగానే...ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఁసంసద్ ఆదర్శ గ్రామీణ యోజన*లో ఒక్కో పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలో మూడు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా మార్చాలి. అందులో భాగంగా వినోద్‌కుమార్ తొలి ఏడాది వీర్నపల్లెను ఆదర్శ గ్రామంగా మార్చేందుకు సిద్ధమయ్యారు.

వాస్తవానికి ఁసంసద్ ఆదర్శ గ్రామీణ యోజన* కింద కేంద్రం ప్రత్యేకించి ఎలాంటి నిధులూ మంజూరు చేయదు. వివిధ కేంద్ర పథకాల కింద విడుదలయ్యే నిధులను ఎంపీ ఎంపిక చేసిన గ్రామానికి మళ్లించి అభివృద్ధి చేసే వెసులుబాటును కేంద్రం కల్పించింది. స్థానిక ఎంపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ గ్రామాన్ని తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని నియమిస్తారు.

 ఆదర్శ గ్రామమంటే......
 ఆర్థిక తోడ్పాటుతోనే ఒక గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దలేమని గ్రహించిన కేంద్రం  మొత్తం 72 అంశాలతో మార్గదర్శకాలను రూపొందించింది. వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, పర్యావరణ, మానవాభివృద్ధికి సంబంధించిన అంశాలతోపాటు సామాజిక భద్రత, సుపరిపాలనకు సంబంధించి పలు అంశాలను అందులో పొందుపర్చింది. ఇవన్నీ సాధ్యం కావాలంటే స్థానిక ప్రజల భాగస్వామ్యమే కీలకమని పేర్కొంది.

 సమస్యలకు కేరాఫ్ వీర్నపల్లి
 వీర్నపల్లి గ్రామం సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. 8 తండాల్లోనూ మంచినీటి సౌకర్యం లేదు. తండాల్లోని ఏ ఒక్క ఇంటికీ మరుగుదొడ్డి లేదు. 150కి పైగా కుటుంబాల జీవనం పూరి గుడిసెల్లోనే. పూర్తి అటవీ ప్రాంతం కావడంతో పులికుంట, పులిదేవుని, వెంకమ్మ చెరువులు అభివృద్ధికి నోచుకోలేదు. సాగునీటి సౌకర్యం అంతంత మాత్రమే. బోర్లపైనే ఆధారపడటం వల్ల రైతులు చితికిపోతున్నారు. భూగర్భ జలాలు సైతం అడుగంటడంతో బోర్లు కూడా పడే పరిస్థితి కన్పించడం లేదు.

నిరక్ష్యరాస్యత తాండవిస్తున్న గ్రామమిది. మొత్తం జనాభాలో సగం మంది నిరక్షరాస్యులే. ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని గిరిజన తండాలన్నింటికీ ఈ గ్రామమే కేంద్ర బిందువు. అయినా, ఇక్కడ ప్రాథమిక ఆసుపత్రి కూడా లేదు. తండాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానం. తండాల నుంచి గ్రామ పంచాయతీకి వెళ్లాలంటే దారిలో ఉన్న పెద్దవాగును దాటాల్సిందే. ఇక్కడ కల్వర్టు లేకపోవడంతో వర్షాకాలమొస్తే పంచాయతీతో సంబంధాలు దాదాపు తెగినట్లే. అటవీ ప్రాంతంలో ఉన్న పలు గ్రామాల ప్రజలు బ్యాంకు లావాదేవీలు జరపాలంటే మండలకేంద్రానికి వెళ్లాల్సి రావడంతో ఆర్థిక భద్రత కొరవడింది.

వీటన్నికంటే ఈ పంచాయతీ పరిధిలోని ప్రతి తండాలోనూ నాటుసారా ఏరులై పారుతోంది. మద్యం బారిన పడిన వారే ఎక్కువగా ఉన్నారు. ఎంపీ తమ గ్రామానికి, తండాలకు రావడంతో స్థానిక ప్రజలు అనేక సమస్యలు ఏకరవు పెట్టారు. మంచినీళ్లు లేవని కొందరు, పింఛన్లు రావడం లేదని మరికొందరు వ్యక్తిగత అర్జీలు ఇచ్చారు.

 ఏడాదిలో రూపరేఖలు మారుస్తా
 సామాజిక ఉద్యమం చేపట్టి ఏడాదిలోగా వీర్నపల్లి రూపరేఖలు మారుస్తానని ఎంపీ వినోద్‌కుమార్ చెప్పారు. శుక్రవారం వీర్నపల్లితోపాటు మూడు తండాల్లో పర్యటించిన ఆయన టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, బాలవికాస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.శౌరిరెడ్డితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘వీర్నపల్లి నా పుట్టినూరు కాదు, అత్తగారి ఊరు అసలే కాదు. అయినా రాబోయే రోజుల్లో ఇక్కడే ఉంటా.  కేంద్ర పథకాలతోపాటు ఎంపీ నిధులను కూడా ఇక్కడ ఖర్చు చేస్తా. ప్రవాస భారతీయులు, పారిశ్రామికవేత్తలు, సంపన్నుల సాయం తీసుకుంటా.

వారికి స్ఫూర్తి కలిగించేలా పథకాన్ని త్వరలోనే రూపొందిస్తా. ప్రతి గ్రామంలో యువ కమిటీలను ఏర్పాటు చేస్తా. మేధావులు, అధ్యాపకులను ఇక్కడికి తీసుకొస్తా. ఉత్సాహంగా ఉన్న ఈ ఊరి ప్రజలే నా శక్తి. గ్రామపెద్దలు, ఉత్సాహవంతులను ఆదర్శ గ్రామాలైన గంగదేవిపల్లె, అంకాపూర్ ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ జరిగిన అభివృద్ధిని వివరిస్తా. నెలరోజుల్లోనే ఇక్కడ తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖను ఏర్పాటు చేయిస్తా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, తండాల్లో అంగన్‌వాడీ కేంద్రాన్ని  ఏర్పాటు చేయిస్తా’ అని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement