- నిలిచిన 14 రహదారుల పనులు
- నిర్మాణానికి ముందుకు రాని కాంట్రాక్టర్లు
- రవాణాకు గిరిజనుల ఇబ్బందులు
పాడేరు : ఏజెన్సీలోని జీకేవీధి మండలం నుంచి ముంచంగిపుట్టు వరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమైన 14 రోడ్డు పనులు మావోయిస్టుల హెచ్చరికలతో నిలిచిపోయాయి. పీఎంజీఎస్‌వై పథకం కింద మూడేళ్లలో ఈ 14 రోడ్లకు రూ.47.30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అన్ని రోడ్ల పనులను చేసేందుకు టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు మట్టి చదును పనుల దశలోనే వీటిని నిలిపివేశారు.
పలు రోడ్ల వద్ద మావోయిస్టులు యంత్రాలను దహనం చేయడం, నిర్మాణదారులకు రోడ్డు పనులు నిలిపివేయాలని హెచ్చరికలు జారీ చేయడం వంటి కారణాలతో ఈ రోడ్డు పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ రోడ్లను పూర్తి చేయలేమంటూ కాంట్రాక్టర్లంతా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులకు మొరపెట్టుకున్నారు.
ఈ నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపారు. ప్రస్తుతం మట్టి చదును పనులతో నిలిచిపోయిన రోడ్లన్నీ అధ్వానంగానే మారాయి. రోడ్డు పనులు చేపట్టడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ మావోయిస్టుల హెచ్చరికలతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఈ రోడ్డు పనులు పూర్తయితే సుమారు 300 మారుమూల పల్లెలకు పక్కా రోడ్డు సౌకర్యం ఏర్పడుతుంది. అయితే ఈ రోడ్లన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఉండడంతో నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది.
ముఖ్యమైన ఈ మారుమూల రోడ్లు అభివృద్ధి చెందకపోవడంతో రవాణాపరంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంచంగిపుట్టు మండలంలోని లబ్బూరు నుంచి బుంగాపుట్టుకు పోయే 21 కి.మీ రోడ్డుకు రూ.740.90 లక్షలు, 14.13 కి.మీ జొడిగుమ్మ-రంగబయలు రోడ్డుకు రూ.730 లక్షలు, పెదబయలు మండలంలోని బూసిపుట్టు-ఒడిషా సరిహద్దులో 11 కి.మీ రోడ్డుకు రూ.343.60 లక్షలు, పెదగుల్లెలు 4.41 కి.మీ రోడ్డుకు రూ.332.02 లక్షలు, వనడ 5.70 కి.మీ రోడ్డుకు రూ.426.93 లక్షలు, గంజిగబురాల రోడ్డుకు రూ.265.40 లక్షలు, మరో బిట్‌కు రూ.94.25 లక్షలు, ఇదే రోడ్డులోని చివరిబిట్టుకు రూ.49.70 లక్షలు, చింతగరువు-తారాబు రోడ్డుకు రూ.141.35 లక్షలు, కిండలం రోడ్డుకు రూ.321.02 లక్షలు, జీకేవీధి మండలంలోని బూరుగుపాకల నుంచి పశువులబంద రోడ్డుకు రూ.228.75 లక్షలు, నిమ్మలపాలెం-గోమువాడ రోడ్డుకు రూ.221 లక్షలు, చింతపల్లి ప్రాంతంలోని నిమ్మపాడు-గొప్పుగుడిసెల రోడ్డుకు రూ.313 లక్షలు, పెదగరువు నుంచి లక్ష్మిపురం రోడ్డుకు రూ.562 లక్షల పీఎంజీఎస్‌వై నిధులు మంజూరయ్యాయి.