సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని రోడ్లకు మోక్షం కలగనుంది. రోడ్లు, భవనాల శాఖ అంచనాలతో కూడిన ఓ నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు ఎన్ని సార్లు రోడ్లు వేస్తున్నా దీర్థకాలికంగా అవి నిలబడడం లేదు. మరమ్మతులు చేస్తున్నా కొన్నాళ్లకే మొదటికొస్తున్నాయి. కాంట్రాక్టర్ల మాయాజాలం, అధికారులు నిర్లక్ష్యం వెరసి కోట్లాది రూపాయలు వృధా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని రోడ్ల దుస్థితిని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
రాష్ట్రం వద్ద నిధులు లేకపోతే కేంద్రం నుంచైనా రప్పించాలని నివేదికలో కోరారు. గతేడాది నీలం తుపానుకు చాలా రోడ్లు కొట్టుకుపోయాయి. మరికొన్నింటికి గండ్లు పడ్డాయి. కాంట్రాక్టర్లు భద్రపరచుకున్న వస్తు సామగ్రీ గంగ పాలయింది. నీలం తుపాను నష్టంపై ప్రభుత్వం అరకొరగానే నిధులు విదిల్చింది. మూడు దశల్లో రోడ్లకు పూర్వ వైభవం తెస్తామని అప్పట్లో రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీ ప్రకటన కాగితాలకే పరిమితమయింది. ఫలితంగా నీలం తుపాను ప్రభావిత రోడ్లతో పాటు గ్రామీణ ప్రాంత రోడ్లకూ మరమ్మతులు చేపట్టాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రోడ్లకు 10 శాతం మాత్రమే ఖర్చు పెడుతుండడంతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) నిధులతో కేంద్రం ఆదుకుంటోంది.
ఇలా సుమారు రూ.400 కోట్ల నిధులను రెండు విడతల్లో మంజూరుకు ఆమోదం తెలిపినట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో ఉన్నతాధికారులు విశాఖ జిల్లాకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కనీసం రూ.100 కోట్లు కేంద్రం రాష్ట్రానికి కేటాయిస్తే అందులో విశాఖ జిల్లాకు రూ.10 కోట్లయినా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ నిధులతో ముందస్తుగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా వేయాల్సిన రోడ్లు, అంతర్గత రోడ్లు, సర్వీస్ రోడ్లు, మరమ్మతులు చేయాల్సిన వాటి జాబితాను ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. దీని ఫైల్ ముఖ్యమంత్రి వద్ద ఉన్నట్టు ఆ శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
జాతీయ గుర్తింపు కలేనా?
జిల్లాలో పలు రోడ్లను జాతీయ రహదార్లుగా గుర్తించినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఢిల్లీలోని హైవే అధారిటీ అధికారులు ఈ రోడ్ల అభివృద్ధి నిధులు మంజూరుకు సర్వే రికార్డుల్ని పంపాలని కోరింది. ఆ జాబితా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే అక్కడి నుంచి కేంద్రానికి వెళ్లాలన్న ఆదేశాలొచ్చాయి. దీంతో శివారు ప్రాంతాలు, ఏజెన్సీ రోడ్ల నిధులు మంజూరుకు మరో రెండేళ్లయినా పట్టవచ్చని అంటున్నారు. అప్పటికి ఇక్కడి రోడ్లు మళ్లీ మరమ్మతులకు గురవుతాయని, జాతీయ గుర్తింపు వల్ల ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.