♦ ఏడాదిన్నరగా నిధులు విదల్చని సర్కారు
♦ ఇతర విభాగాల్లోకి ఉద్యోగుల బదలాయింపు
♦ ఇప్పటికే 33 మంది సిబ్బందికి డిప్యుటేషన్లు
♦ ఉపాధిహామీ పథకంలో విలీనంచేసే యోచన
♦ జిల్లాలో కొనసాగుతున్న 6 వాటర్‌షెడ్ పనులు
♦ డైలమాలో 221 గ్రామాల్లోని 17,849 పనులు
వాననీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించి కరువును అరికట్టేందుకు తలపెట్టిన సమగ్ర వాటర్‌షెడ్ నిర్వహణ పథకానికి సర్కారు మంగళం పాడనుందా? చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతల ఏర్పాటుతో నీటి నిల్వ కోసం తలపెట్టే పనులకు స్వస్తి పలకనుందా? ఈ ప్రశ్నలకు అధికారులు స్పందించనప్పటికీ.. ప్రభుత్వ చర్యలు చూస్తుంటే.. అవుననే అనిపిస్తోంది. ఏడాదిన్నరగా వాటర్‌షెడ్‌కు నిధులు విదల్చని సర్కారు.. తాజాగా ఉద్యోగులను డిప్యుటేషన్‌పై పంపుతోంది. ఈ క్రమంలో ఇక్కడి ఉద్యోగుల సంఖ్య తగ్గుతుండడంతో ఐడబ్ల్యూఎంపీ ఇక అటకెక్కడం ఖాయమనిపిస్తోంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా/ వికారాబాద్
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ వికారాబాద్ : జిల్లాలో ఆరు వాటర్‌షెడ్ పథకాలున్నాయి. ఇబ్రహీంపట్నం, కందుకూరు, షాబాద్, మోమిన్‌పేట్, నవాబుపేట్, పెద్దేముల్‌లలో వాటర్‌షెడ్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. 2015-16 వార్షిక సంవత్సరంలో 10 మండలాలకు సంబంధించి 33 వాటర్‌షెడ్ పనులు నిర్దేశించారు. 221 గ్రామాల్లో 17,849 పనులు చేపట్టాల్సి ఉంది. ఇందులో రాళ్ల కట్టలు, చెక్‌డ్యాంలు, గులకరాళ్ల కట్టలు, ఊట కుంటలు, పశువుల తొట్లతోపాటు పశుసంపద పెంపొందించేందుకు పలు కార్యక్రమాలకు వాటర్‌షెడ్ యంత్రాంగం కార్యచరణ సిద్ధం చేసింది. వీటికి రూ.82.80 కోట్లు అవసరమని పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదించింది. ఈ క్రమంలో ఇప్పటికే రూ.32.86 కోట్లు ఖర్చుచేసి ఆ మేరకు పనులు పూర్తి చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం పైసా విదల్చకపోవడంతో ఈ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన పనులన్నీ అటకెక్కాయి. ఏడాది కాలంగా పనులు లేకపోవడంతో సిబ్బంది సైతం ఖాళీగా ఉన్నారు. ఈక్రమంలో ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి డెప్యుటేషన్‌పై పంపించాలని గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా నిర్ణయించింది.
ఉపాధిలోకి బదలాయింపు?
జిల్లాలో సమగ్ర వాటర్‌షెడ్ నిర్వహణ కార్యక్రమం కింద 216 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ప్రాజెక్టు ఆఫీసర్లు, జూనియర్ ఇంజినీర్లు, టెక్నికల్ ఆఫీసర్లు, కంప్యూటర్ ఆపరే టర్లతోపాటు వాటర్‌షెడ్ అసిస్టెంటు ఉన్నారు. ఏడాదికాలంగా నిధులు ఇవ్వకపోవడంతో వాటర్‌షెడ్ పనులు అటకెక్కాయి. ఈ క్రమంలో సిబ్బందికి పని లేకపోవడంతో వారిని ఉపాధిహామీ పనుల్లో భాగస్వామ్యం చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించిం ది. ప్రస్తుతం ఉపాధిహామీ పనులు జోరందుకున్నాయి. దీంతో ఈజీఎస్‌లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ల స్థానంలో 27 మంది టెక్నికల్ ఆఫీసర్లను డెప్యుటేషన్‌పై పంపించారు. అదేవిధంగా మరో ఆరుగురు కంప్యూటర్ ఆపరేటర్లు కూడా ఈజీఎస్‌లో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి 33 మంది డెప్యుటేషన్‌పై వెళ్లగా మరో 40 మందిని ఇదే తరహాలో పంపించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సిబ్బందిని ఈజీఎస్‌లో సర్దుబాటు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ యోచిస్తున్నట్లు సమాచారం.