Watershed Project
-
ఏసీబీ వలలో వాటర్‌షెడ్ టీఏ
► ఇద్దరు రైతుల నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత ► మార్కాపురం వాటర్‌షెడ్ పథకం కార్యాలయంలో ఘటన.. మార్కాపురం : ఇద్దరు రైతుల నుంచి లంచం తీసుకుంటున్న వాటర్‌షెడ్ పథకం టెక్నికల్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న వాటర్‌షెడ్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి కథనం ప్రకారం.. మార్కాపురం మండలం బిరుదుల నరవకు చెందిన సీహెచ్ చిన్న సాల్మన్, పెద్దనాగులు ఈ ఏడాది మేలో తమ పొలంలో పంట సంజీవని పథకం కింద నీటి కుంటలు తొవ్వుకున్నారు. ఒక్కో కుంటకు 1.80 లక్షల రూపాయలతో వాటర్‌షెడ్ కార్యాలయంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ (కాంట్రాక్టు ఉద్యోగి) త్రిపురారెడ్డి అధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఆరు నెలలు నుంచి బిల్లులు మంజూరు చేయకుండా రైతులను ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. ఒక్కొక్కరు తనకు 20 వేల రూపాయలు ఇస్తేనే నిధులు మంజూరు చేయిస్తానని రైతులతో చెప్పాడు. ఈ నెల 13న సాల్మన్, పెద్ద నాగులు కలిసి ఒంగోలులోని ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు వాటర్‌షెడ్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా సిద్ధం చేసిన పది రూ.2 వేల నోట్లు మొత్తం రూ.20 వేలు బాధిత రైతులకు ఇచ్చారు. ఆ నగదు తీసుకున్న రైతులు నేరుగా త్రిపురారెడ్డి వద్దకు వెళ్లి ఇచ్చారు. ఆయన వెంటనే ఆ నగదును జేబులో పెట్టుకున్నాడు. ఆ వెంటనే ఏసీబీ డీఎస్పీ మూర్తి, సీఐ ప్రతాప్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఎస్ఐ కరీముల్లా, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్‌లు లోపలికి వెళ్లి త్రిపురారెడ్డిని అదుపులోకి తీసుకుని రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేశారు. తమను ఆరు నెలల నుంచి బిల్లులు ఇవ్వకుండా తిప్పుకోవడంతో విసిగి వేసారి ఏసీబీ అధికా>రులను ఆశ్రయించినట్లు బాధిత రైతులు తెలిపారు. ఈ వార్త పట్టణంలో క్షణాల్లో తెలిసి పోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది అలర్ట్ అయ్యారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
వాటర్షెడ్కు స్వస్తి!
♦ ఏడాదిన్నరగా నిధులు విదల్చని సర్కారు ♦ ఇతర విభాగాల్లోకి ఉద్యోగుల బదలాయింపు ♦ ఇప్పటికే 33 మంది సిబ్బందికి డిప్యుటేషన్లు ♦ ఉపాధిహామీ పథకంలో విలీనంచేసే యోచన ♦ జిల్లాలో కొనసాగుతున్న 6 వాటర్‌షెడ్ పనులు ♦ డైలమాలో 221 గ్రామాల్లోని 17,849 పనులు వాననీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించి కరువును అరికట్టేందుకు తలపెట్టిన సమగ్ర వాటర్‌షెడ్ నిర్వహణ పథకానికి సర్కారు మంగళం పాడనుందా? చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతల ఏర్పాటుతో నీటి నిల్వ కోసం తలపెట్టే పనులకు స్వస్తి పలకనుందా? ఈ ప్రశ్నలకు అధికారులు స్పందించనప్పటికీ.. ప్రభుత్వ చర్యలు చూస్తుంటే.. అవుననే అనిపిస్తోంది. ఏడాదిన్నరగా వాటర్షెడ్కు నిధులు విదల్చని సర్కారు.. తాజాగా ఉద్యోగులను డిప్యుటేషన్‌పై పంపుతోంది. ఈ క్రమంలో ఇక్కడి ఉద్యోగుల సంఖ్య తగ్గుతుండడంతో ఐడబ్ల్యూఎంపీ ఇక అటకెక్కడం ఖాయమనిపిస్తోంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా/ వికారాబాద్ సాక్షి, రంగారెడ్డి జిల్లా/ వికారాబాద్ : జిల్లాలో ఆరు వాటర్‌షెడ్ పథకాలున్నాయి. ఇబ్రహీంపట్నం, కందుకూరు, షాబాద్, మోమిన్‌పేట్, నవాబుపేట్, పెద్దేముల్‌లలో వాటర్‌షెడ్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. 2015-16 వార్షిక సంవత్సరంలో 10 మండలాలకు సంబంధించి 33 వాటర్‌షెడ్ పనులు నిర్దేశించారు. 221 గ్రామాల్లో 17,849 పనులు చేపట్టాల్సి ఉంది. ఇందులో రాళ్ల కట్టలు, చెక్‌డ్యాంలు, గులకరాళ్ల కట్టలు, ఊట కుంటలు, పశువుల తొట్లతోపాటు పశుసంపద పెంపొందించేందుకు పలు కార్యక్రమాలకు వాటర్‌షెడ్ యంత్రాంగం కార్యచరణ సిద్ధం చేసింది. వీటికి రూ.82.80 కోట్లు అవసరమని పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదించింది. ఈ క్రమంలో ఇప్పటికే రూ.32.86 కోట్లు ఖర్చుచేసి ఆ మేరకు పనులు పూర్తి చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం పైసా విదల్చకపోవడంతో ఈ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన పనులన్నీ అటకెక్కాయి. ఏడాది కాలంగా పనులు లేకపోవడంతో సిబ్బంది సైతం ఖాళీగా ఉన్నారు. ఈక్రమంలో ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి డెప్యుటేషన్‌పై పంపించాలని గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా నిర్ణయించింది. ఉపాధిలోకి బదలాయింపు? జిల్లాలో సమగ్ర వాటర్‌షెడ్ నిర్వహణ కార్యక్రమం కింద 216 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ప్రాజెక్టు ఆఫీసర్లు, జూనియర్ ఇంజినీర్లు, టెక్నికల్ ఆఫీసర్లు, కంప్యూటర్ ఆపరే టర్లతోపాటు వాటర్‌షెడ్ అసిస్టెంటు ఉన్నారు. ఏడాదికాలంగా నిధులు ఇవ్వకపోవడంతో వాటర్‌షెడ్ పనులు అటకెక్కాయి. ఈ క్రమంలో సిబ్బందికి పని లేకపోవడంతో వారిని ఉపాధిహామీ పనుల్లో భాగస్వామ్యం చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించిం ది. ప్రస్తుతం ఉపాధిహామీ పనులు జోరందుకున్నాయి. దీంతో ఈజీఎస్‌లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ల స్థానంలో 27 మంది టెక్నికల్ ఆఫీసర్లను డెప్యుటేషన్‌పై పంపించారు. అదేవిధంగా మరో ఆరుగురు కంప్యూటర్ ఆపరేటర్లు కూడా ఈజీఎస్‌లో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి 33 మంది డెప్యుటేషన్‌పై వెళ్లగా మరో 40 మందిని ఇదే తరహాలో పంపించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సిబ్బందిని ఈజీఎస్‌లో సర్దుబాటు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. -
అవినీతి కట్టలు
మద్దిరేవుల మైరాడా వాటర్‌షెడ్ పనుల్లో లక్షలాది రూపాయల అక్రమాలు ఏడాదిలోపే పాతరాతికట్టలను తొలగించి కొత్తవిగా మార్చిన వైనం బీడుభూములు, మట్టిగడ్డలను ఆర్ఎఫ్డీలుగా మార్చిన కాంట్రాక్టర్లు మామూళ్లు తీసుకుని బిల్లులు చెల్లిస్తున్న అధికారులు లక్కిరెడ్డిపల్లె: వాటర్‌షెడ్ పథకంలో అవినీతి రాజ్యమేలుతోంది. లక్కిరెడ్డిపల్లె మండలంలోని మద్దిరేవుల గ్రామ పంచాయతీకి చెందిన అప్పలరాజుగారిపల్లె, ఈడిగపల్లె, వంకగడ్డరాచపల్లె, రెడ్డివారిపల్లె, కొత్త ఎస్సీ కాలనీ తదితర గ్రామాల్లో జరుగుతున్న ఐడబ్ల్యుఎంపీ మైరాడా వాటర్‌షెడ్ పనుల్లో లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతున్నా పట్టించుకునే వారు లేరు. ఇక్కడ పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది మొదలుకుని ఓ స్థాయి కలిగిన అధికారి వరకు 20 శాతానికి పైబడి పర్సెంటేజీలు తీసుకుని అక్రమాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంట పొలాలు, బీడు భూముల్లో మట్టి గడ్డలను ఆసరాగా చేసుకుని ఇష్టానుసారంగా రాతి కట్టలు (ఆర్ఎఫ్డీలు), ఎల్బీలు కడుతున్నా పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం ఇప్పటికే కొన్ని బిల్లులు చెల్లించి, మిగిలిన బిల్లులు కూడా చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే గ్రామంలో ఏడాది క్రితం పనులు చేయకుండానే బిల్లులు చెల్లించేందుకు సిద్ధపడగా అప్పట్లో ఆ విషయాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయగా స్పందించిన ఉన్నతాధికారులు డబ్బును రికవరీ చేయడంతో పాటు సిబ్బందిని తొలగించారు. కానీ ఏడాది గడవకముందే తిరిగి అదే గ్రామంలో అవినీతి, అక్రమాలకు తెరతీయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొన్ని ప్రాంతాలలో ఏడాది క్రితం కట్టిన రాతి కట్టలను తొలగించి ప్రస్తుతం వాటి స్థానంలో మళ్లీ కొత్త కట్టలను చేపట్టి బిల్లును కూడా పూర్తి చేశారు. అప్పలరాజుగారిపల్లె పరిధిలోనే 40కి పైబడి నిర్మించగా, పది లక్షల రూపాయల బిల్లులు చెల్లించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. దాదాపు నిర్మాణం చేపట్టిన రాతి కట్టలన్నీ కూడా లోపలంతా మట్టి తోసి బయట మాత్రం రాళ్లు కనిపించే విధంగా ఆర్ఎఫ్డీలను ఏర్పాటు చేశారు. మరికొన్ని ప్రదేశాల్లో మామిడి తోటల్లోని గ ట్లకు రాళ్లు పేర్చి ఆర్ఎఫ్డీల నెంబర్లు వేసి బిల్లులు చెల్లించేశారు. ఇంకొన్ని ప్రదేశాల్లో రోడ్డు పక్కనే ఉన్న చదునైన పొలాల్లో 20 మీటర్ల పొడవునా కట్టలను నిర్మించారు. నిత్యం వాహనాలు తిరిగే ఈ మార్గంలో ఉన్న రాతి కట్టలను చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మైరాడా వాటర్‌షెడ్ పనులు కాంట్రాక్టర్లకు, అవినీతి అధికారులకు వరంగా మారాయే తప్ప వీటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే పంచాయతీ పరిధిలోని సోమలవాండ్లపల్లె, జీఎంఆర్ కాలనీ, మార్లవాండ్లపల్లె, శింగరాజుగారిపల్లె గ్రామాల్లో ఇప్పటి వరకు పనులు కల్పించలేదని ఆయా గ్రామాల వారు పేర్కొంటున్నారు. జీఎంఆర్ కాలనీలో వంద కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు. దాదాపు వెయ్యికి పైబడే గొర్రెలు, పశువులు ఉన్నా తాగేందుకు నీళ్ల తొట్టి కూడా లేదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్పందించని పీఓ వాటర్‌షెడ్ పనులకు సంబంధించిన పనుల వివరాలు కావాలని పీఓ శ్రీనివాసులును కోరగా ఆయన గాలివీడు ఆఫీసుకు రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్లి ఫోన్ చేయగా కుర్నూతల గ్రామంలో ఉన్నాను అక్కడకి రండి అన్నారు. కుర్నూతలకు వెళ్లి ఫోన్ చేయగా ‘నేను రాయచోటికి వెళ్తున్నాను అక్కడికి రండి మాట్లాడదాం’ అని ఫోన్ కట్ చేశారు. రాయచోటికి వెళ్లి ఫోన్ చేయగా వేరే చోట ఉన్నాను.. రేపు ఆఫీసుకు రండి వివరాలు ఇస్తానని చెప్పారు. పనుల వివరాలు చెప్పేందుకు పీఓ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
6 నెలలు.. రూ.30 కోట్లు అరుణాచలం రావాల్సిందే!
‘నెల రోజుల్లో రూ.30 కోట్లు ఖర్చుపెడితే రూ.3వేల కోట్లకు అధిపతి అవుతావు’ అన్న షరతుకు కట్టుబడి.. అరుణాచలం సినిమాలో హీరో రజినీకాంత్ 30 రోజుల్లో రూ.30 ఖర్చు పెడతాడు.. ఇలాంటి పరిస్థితే డ్వామా ఎదుర్కోవాల్సి ఉంది. వాటర్‌షెడ్ ప్రాజెక్టుల కోసం కేంద్రం విడుదల చేసిన రూ.40కోట్లలో కేవలం రూ.10 కోట్లు ఖర్చుపెట్టారు. ఆరు నెలలే గడువుంది.. ఆలోగా రూ.30 కోట్లు ఖర్చుపెట్టాలి. వీటిని అరుణాచలంలా ఖర్చుపెడతారో.. లేదో చూడాలి. నీలగిరి నిధలు లేక ప్రభుత్వ శాఖలు నీరసిస్తుంటే.. నిధులు ఉన్నా ఖర్చు పెట్టలేని దయనీయ స్థితిలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ కొట్టుమిట్టాడుతోంది. మెగా వాటర్షెడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఖర్చుపెట్టడంలో అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శించారు. వృథాగా పోతున్న నీటిని సంరక్షించడంతోపాటు, సహజ వనరుల నిర్వహణ ద్వారా ప్రజల జీవనోపాధులు పెంపొందించేందుకు 2009-10లో జిల్లాకు తొలి విడత 7 మెగావాటర్ షెడ్ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం రూ.40 కోట్లు మంజూరు చేసింది. ఐదేళ్ల లక్ష్యానికిగాను ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఏడు ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు మొత్తం కేటాయించిన నిధుల్లో కేవలం రూ.10 కోట్లతో మాత్రమే ప్రాజెక్టు పనులు చేపట్టారు. ప్రాజెక్టులు మంజూరైన నాలుగున్నర ఏళ్లలో రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన అధికారులు మరో ఆరు మాసాల్లో రూ.30 కోట్లు ఏవిధంగా ఖర్చు పెడతారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ఆరు మాసాల్లో ఏదో అద్భుతం జరిగితే తప్ప ఇంత తక్కువ వ్యవధిలో పనులు పూర్తిచేయడం సాధ్యం కాదు. అదీగాక రూ.30 కోట్లు ఖర్చు పెట్టి మరీ శరవేగంగా ప్రాజెక్టులు పూర్తిచేయాలి. ఇదే విషయమై జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ డ్వామా అధికారులను ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పుకోలేక నీళ్లు నమాల్సినపరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టులపై వీలైనంత త్వరగా ఓ ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భూ అభివృద్ధి పథకం, వాటర్షెడ్లు, ఉపాధి హామీ, ఇందిర జలప్రభ పథకాలు పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. బుధవారం జెడ్పీ కార్యాలయంలో సీఈఓ సి.దామోదర్‌రెడ్డితో కలిసి ఆయన వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ...ప్రభుత్వ పథకాల పురోగతిని పరిశీలించేందుకు త్వరలో క్షేత్రస్థాయి పర్యటన వెళ్లేందుకు ఓ కార్యాచరణ రూపొందించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులకు నిధుల కేటాయింపు.. డీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించిన చైర్మన్ అసంపూర్తిగా ఉన్న స్త్రీ శక్తి భవనాలు పూర్తి చేసేం దుకు అవసరమయ్యే నిధులను జెడ్పీ నుంచి కేటాయిస్తామని తెలిపారు. సుస్థిర వ్యవసాయం పురోగతి పరిశీలనకు గ్రామస్థాయిలో పర్యటిస్తామని పేర్కొన్నారు. రాజీవ్ యువకిరణాల ఇనిస్టిట్యూట్లు తనిఖీ చేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాంలు నిర్మాణానికి నాబార్డు సంప్రదించి ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. మత్స్యశాఖ నుంచి లబ్ధిదారులకు అందాల్సిన సబ్సిడీ రూ.40 లక్షలు విడుదల చేసేందుకు చైర్మన్ అంగీకరించారు. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఏ, డ్వామా పీడీలు చిర్రా సుధాకర్, సునందారెడ్డి, మత్స్యశాఖ ఏడీ సాల్మన్‌రాజు, పశుసంవర్థకశాఖ అధికారులు పాల్గొన్నారు.