అవినీతి కట్టలు
మద్దిరేవుల మైరాడా వాటర్‌షెడ్ పనుల్లో లక్షలాది రూపాయల అక్రమాలు
ఏడాదిలోపే పాతరాతికట్టలను తొలగించి కొత్తవిగా మార్చిన వైనం
బీడుభూములు, మట్టిగడ్డలను ఆర్‌ఎఫ్‌డీలుగా మార్చిన కాంట్రాక్టర్లు
మామూళ్లు తీసుకుని బిల్లులు చెల్లిస్తున్న అధికారులు
లక్కిరెడ్డిపల్లె: వాటర్‌షెడ్ పథకంలో అవినీతి రాజ్యమేలుతోంది. లక్కిరెడ్డిపల్లె మండలంలోని మద్దిరేవుల గ్రామ పంచాయతీకి చెందిన అప్పలరాజుగారిపల్లె, ఈడిగపల్లె, వంకగడ్డరాచపల్లె, రెడ్డివారిపల్లె, కొత్త ఎస్సీ కాలనీ తదితర గ్రామాల్లో జరుగుతున్న ఐడబ్ల్యుఎంపీ మైరాడా వాటర్‌షెడ్ పనుల్లో లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతున్నా పట్టించుకునే వారు లేరు. ఇక్కడ పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది మొదలుకుని ఓ స్థాయి కలిగిన అధికారి వరకు 20 శాతానికి పైబడి పర్సెంటేజీలు తీసుకుని అక్రమాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంట పొలాలు, బీడు భూముల్లో మట్టి గడ్డలను ఆసరాగా చేసుకుని ఇష్టానుసారంగా రాతి కట్టలు (ఆర్‌ఎఫ్‌డీలు), ఎల్‌బీలు కడుతున్నా పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం ఇప్పటికే కొన్ని బిల్లులు చెల్లించి, మిగిలిన బిల్లులు కూడా చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే గ్రామంలో ఏడాది క్రితం పనులు చేయకుండానే బిల్లులు చెల్లించేందుకు సిద్ధపడగా అప్పట్లో ఆ విషయాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయగా స్పందించిన ఉన్నతాధికారులు డబ్బును రికవరీ చేయడంతో పాటు సిబ్బందిని తొలగించారు.
కానీ ఏడాది గడవకముందే తిరిగి అదే గ్రామంలో అవినీతి, అక్రమాలకు తెరతీయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొన్ని ప్రాంతాలలో ఏడాది క్రితం కట్టిన రాతి కట్టలను తొలగించి ప్రస్తుతం వాటి స్థానంలో మళ్లీ కొత్త కట్టలను చేపట్టి బిల్లును కూడా పూర్తి చేశారు. అప్పలరాజుగారిపల్లె పరిధిలోనే 40కి పైబడి నిర్మించగా, పది లక్షల రూపాయల బిల్లులు చెల్లించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. దాదాపు నిర్మాణం చేపట్టిన రాతి కట్టలన్నీ కూడా లోపలంతా మట్టి తోసి బయట మాత్రం రాళ్లు కనిపించే విధంగా ఆర్‌ఎఫ్‌డీలను ఏర్పాటు చేశారు. మరికొన్ని ప్రదేశాల్లో మామిడి తోటల్లోని గ ట్లకు రాళ్లు పేర్చి ఆర్‌ఎఫ్‌డీల నెంబర్లు వేసి బిల్లులు చెల్లించేశారు. ఇంకొన్ని ప్రదేశాల్లో రోడ్డు పక్కనే ఉన్న చదునైన పొలాల్లో 20 మీటర్ల పొడవునా కట్టలను నిర్మించారు. నిత్యం వాహనాలు తిరిగే ఈ మార్గంలో ఉన్న రాతి కట్టలను చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మైరాడా వాటర్‌షెడ్ పనులు కాంట్రాక్టర్లకు, అవినీతి అధికారులకు వరంగా మారాయే తప్ప వీటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే పంచాయతీ పరిధిలోని సోమలవాండ్లపల్లె, జీఎంఆర్ కాలనీ, మార్లవాండ్లపల్లె, శింగరాజుగారిపల్లె గ్రామాల్లో ఇప్పటి వరకు పనులు కల్పించలేదని ఆయా గ్రామాల వారు పేర్కొంటున్నారు. జీఎంఆర్ కాలనీలో వంద కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు. దాదాపు వెయ్యికి పైబడే గొర్రెలు, పశువులు ఉన్నా తాగేందుకు నీళ్ల తొట్టి కూడా లేదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
స్పందించని పీఓ
వాటర్‌షెడ్ పనులకు సంబంధించిన పనుల వివరాలు కావాలని పీఓ శ్రీనివాసులును కోరగా ఆయన గాలివీడు ఆఫీసుకు రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్లి ఫోన్ చేయగా కుర్నూతల గ్రామంలో ఉన్నాను అక్కడకి రండి అన్నారు. కుర్నూతలకు వెళ్లి ఫోన్ చేయగా ‘నేను రాయచోటికి వెళ్తున్నాను అక్కడికి రండి మాట్లాడదాం’ అని ఫోన్ కట్ చేశారు. రాయచోటికి వెళ్లి ఫోన్ చేయగా వేరే చోట ఉన్నాను.. రేపు ఆఫీసుకు రండి వివరాలు ఇస్తానని చెప్పారు. పనుల వివరాలు చెప్పేందుకు పీఓ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.