సాక్షి, న్యూఢిల్లీ : భారత అవినీతి నిరోధక చట్టంలో సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఓ బిల్లును ప్రవేశపెట్టగా వారం క్రితం రాజ్యసభలో ఆ బిల్లుకు కొన్ని సవరణలు సూచించారు. మంగళవారం ఆ బిల్లు లోక్‌సభ పరిశీలనకురాగా దాన్ని సభ్యులు యథాతథంగా ఆమోదించారు. అవినీతి ఆరోపణలపై కేసును నమోదుచేయడం దగ్గరి నుంచి దర్యాప్తు జరిపి దోషుల్ని తేల్చడం, అనంతరం వారికి శిక్షలు విధించడం వరకున్న పలు నిబంధనల్లో సవరణలు తీసుకొచ్చారు. దేశంలో రోజురోజుకు అవినీతి కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తీసుకొచ్చిన ఈ సవరణ చట్టం వల్ల శిక్షలు ఎక్కువ పడి కేసులు తగ్గుతాయా? లేదా? అన్న అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించాలి.
ఇంతకుముందు ప్రభుత్వాధికారి లంచం తీసుకోవడం అంటే ‘ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకుండా ఓ వ్యక్తికి పని చేయడం కోసం అతని నుంచి డబ్బు లేదా ఇతర రూపాల్లో విలువైన వస్తువులను అక్రమంగా తీసుకోవడం’ అవినీతికి విస్తత నిర్వచనం. ఈ నిర్వచనానికి ‘టెస్ట్ ఆఫ్ ఇంటెన్షన్’ అనే పదాన్ని జోడించారు. ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటే అది ఏ ఉద్దేశంతో తీసుకున్నారో అంటే, లంచంగానే తీసుకున్నారా? అన్న అంశాన్ని దర్యాప్తు సంస్థ ముందుగా తేల్చాలి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఇక ముందు ఎవరిపై కేసులు దాఖలు చేయడానికి వీల్లేదు. అంటే ఆస్తులపై దాడులు జరిపి ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ కేసులు దాఖలు చేయడానికి వీల్లేదు. లంచం తీసుకున్నారా, లేదా ? అన్న అంశం ప్రాతిపదికనే కేసులు దాఖలు చేయాలి. అంతేకాకుండా ఓ అధికారి తన నిజాయితీని పక్కన పెట్టి బాధ్యతా రాహిత్యంగా ఓ వ్యక్తికి అనసరమైన ప్రయోజనం కలిగించారా? అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారానే లంచం తీసుకున్నారా, లేదా అన్న అభిప్రాయానికి రావాలి.
ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకుండా ఓ వ్యక్తి నుంచి లంచంగా లేదా అక్రమ పద్ధతిలో డబ్బు లేదా ఇతర విలువైన వస్తువును తీసుకోవడమే అవినీతి అని పాత చట్టం సులభంగా నిర్దేశిస్తోంది. ఈ నిర్వచనం ప్రకారమే బోఫోర్స్ దగ్గరి నుంచి 2జీ స్కామ్ వరకు, కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి కోల్‌స్కామ్ వరకు కేసులను నమోదు చేసి విచారించారు. కొత్త సవరణల ప్రకారం అధికారులపై కచ్చితమైన అనుమానాలున్నా అవినీతి కేసును నమోదు చేయరాదు. విచారించాకే కేసును నమోదు చేయాలి. విచారించేందుకు కూడా సంబంధిత ఉన్నతాధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ కొత్త నిబంధన తెచ్చారు. సదరు అధికారి అనుమతిస్తే విచారణ జరపాల్సి ఉంటుంది. లంచం తీసుకోవడమే కాకుండా లంచం ఇవ్వడాన్ని కూడా నేరంగా పరిగణిస్తూ చట్టాన్ని సవరించడం మరీ దారుణం. ప్రస్తుతం లంచాలిచ్చే వారిపై లంచాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై మాత్రమే కేసు పెట్టే అధికారం ఉండగా, అంటే దర్యాప్తు సంస్థ కేసు పెట్టాలి అనుకుంటేనే పెట్టే అవకాశం ఉండింది. సంస్థలు, కంపెనీలపైనే లంచం ఇచ్చినందుకు కేసు పెట్టారే తప్ప, సామాన్య పౌరులపై కేసులు ఎప్పుడు పెట్టలేదు. ఇప్పుడు లంచం ఇవ్వడం కూడా నేరమే అవుతుంది కనుక లంచం ఇచ్చిన వారిపై కూడా తప్పనిసరి కేసు పెట్టాల్సిందే. కేసు పెడతారన్న భయంతో అవినీతిపై ఫిర్యాదు చేయడానికే ప్రజలు ముందుకు రారన్నది అందరికి తెల్సిందే. లంచం ఇచ్చేలా తనపై తీవ్రమైన ఒత్తిడి చేశారని, ఇక ఏమాత్రం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లోనే లంచం ఇవ్వాల్సి వచ్చిందంటూ లంచం ఇచ్చిన వారు నిరూపించుకోగలిగితేనే శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు. అది ఎంత మందికి సాధ్యం అవుతుంది? ఎన్ని కేసుల్లో సాధ్యం అవుతుంది?
ఎమ్మెల్యేలు, మంత్రులు సహా ప్రభుత్వ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించేందుకు ‘సంబంధిత అధికారి’ నుంచి అనుమతి తీసుకోవాలని సవరణలో ప్రభుత్వం పేర్కొంది. ఆ సంబంధిత అధికారి ఎవరో మాత్రం వెల్లడించలేదు. కేంద్రంలోని లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తాలు అనుమతి మంజూరు చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. 2013 నాటి లోక్‌పాల్, లోకాయుక్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆమోదించనే లేదు. ఎప్పుడు ఆమోదించాలి. అది ఎప్పుడు అమల్లోకి వచ్చేను? అవినీతి రహిత సమాజంగా మారుస్తానన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం, అది సాధ్యం కాదనుకొని అవినీతి కేసుల రహిత దేశంగా మారుద్దామని తీర్మానించికుందా?
Comments
Please login to add a commentAdd a comment