6 నెలలు.. రూ.30 కోట్లు అరుణాచలం రావాల్సిందే! | Arunachalam has to be come to spend Rs 30 crore for 6 months | Sakshi
Sakshi News home page

6 నెలలు.. రూ.30 కోట్లు అరుణాచలం రావాల్సిందే!

Published Thu, Aug 14 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM

6 నెలలు.. రూ.30 కోట్లు అరుణాచలం రావాల్సిందే!

6 నెలలు.. రూ.30 కోట్లు అరుణాచలం రావాల్సిందే!

 ‘నెల రోజుల్లో రూ.30 కోట్లు ఖర్చుపెడితే రూ.3వేల కోట్లకు అధిపతి అవుతావు’ అన్న షరతుకు కట్టుబడి.. అరుణాచలం సినిమాలో హీరో రజినీకాంత్ 30 రోజుల్లో రూ.30 ఖర్చు పెడతాడు.. ఇలాంటి పరిస్థితే డ్వామా ఎదుర్కోవాల్సి ఉంది. వాటర్‌షెడ్ ప్రాజెక్టుల కోసం కేంద్రం విడుదల చేసిన రూ.40కోట్లలో కేవలం రూ.10 కోట్లు ఖర్చుపెట్టారు. ఆరు నెలలే గడువుంది.. ఆలోగా రూ.30 కోట్లు ఖర్చుపెట్టాలి. వీటిని అరుణాచలంలా ఖర్చుపెడతారో.. లేదో చూడాలి.
 
 నీలగిరి
 నిధలు లేక ప్రభుత్వ శాఖలు నీరసిస్తుంటే.. నిధులు ఉన్నా ఖర్చు పెట్టలేని దయనీయ స్థితిలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ కొట్టుమిట్టాడుతోంది. మెగా వాటర్‌షెడ్‌ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఖర్చుపెట్టడంలో అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శించారు. వృథాగా పోతున్న నీటిని సంరక్షించడంతోపాటు, సహజ వనరుల నిర్వహణ ద్వారా ప్రజల జీవనోపాధులు పెంపొందించేందుకు 2009-10లో జిల్లాకు తొలి విడత 7 మెగావాటర్ షెడ్ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం రూ.40 కోట్లు మంజూరు చేసింది. ఐదేళ్ల లక్ష్యానికిగాను ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది.
 
 వచ్చే ఏడాది మార్చి నాటికి ఏడు ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు మొత్తం కేటాయించిన నిధుల్లో కేవలం రూ.10 కోట్లతో మాత్రమే ప్రాజెక్టు పనులు చేపట్టారు. ప్రాజెక్టులు మంజూరైన నాలుగున్నర ఏళ్లలో రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన అధికారులు మరో ఆరు మాసాల్లో రూ.30 కోట్లు ఏవిధంగా ఖర్చు పెడతారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ఆరు మాసాల్లో ఏదో అద్భుతం జరిగితే తప్ప ఇంత తక్కువ వ్యవధిలో పనులు పూర్తిచేయడం సాధ్యం కాదు. అదీగాక రూ.30 కోట్లు ఖర్చు పెట్టి మరీ శరవేగంగా ప్రాజెక్టులు పూర్తిచేయాలి.
 
 ఇదే విషయమై జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ డ్వామా అధికారులను ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పుకోలేక నీళ్లు నమాల్సినపరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టులపై వీలైనంత త్వరగా ఓ ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భూ అభివృద్ధి పథకం, వాటర్‌షెడ్లు, ఉపాధి హామీ, ఇందిర జలప్రభ పథకాలు పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. బుధవారం జెడ్పీ కార్యాలయంలో సీఈఓ సి.దామోదర్‌రెడ్డితో కలిసి ఆయన వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ...ప్రభుత్వ పథకాల పురోగతిని పరిశీలించేందుకు త్వరలో క్షేత్రస్థాయి పర్యటన వెళ్లేందుకు ఓ కార్యాచరణ రూపొందించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
 
 పెండింగ్ పనులకు నిధుల కేటాయింపు..
 డీఆర్‌డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించిన చైర్మన్ అసంపూర్తిగా ఉన్న స్త్రీ శక్తి భవనాలు పూర్తి చేసేం దుకు అవసరమయ్యే నిధులను జెడ్పీ నుంచి కేటాయిస్తామని తెలిపారు. సుస్థిర వ్యవసాయం పురోగతి పరిశీలనకు గ్రామస్థాయిలో పర్యటిస్తామని పేర్కొన్నారు. రాజీవ్ యువకిరణాల ఇనిస్టిట్యూట్‌లు తనిఖీ చేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాంలు నిర్మాణానికి నాబార్డు సంప్రదించి ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. మత్స్యశాఖ నుంచి లబ్ధిదారులకు అందాల్సిన సబ్సిడీ రూ.40 లక్షలు విడుదల చేసేందుకు చైర్మన్ అంగీకరించారు. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు చిర్రా సుధాకర్, సునందారెడ్డి, మత్స్యశాఖ ఏడీ సాల్మన్‌రాజు, పశుసంవర్థకశాఖ అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement