నిధులకు కత్తెర
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్)కి ప్రభుత్వం గండికొట్టింది. నియోజకవర్గానికి రూ.2 కోట్లు ఇస్తామని ప్రకటించి చివరకు చేతులెత్తేసింది. ఎస్‌డీఎఫ్ కింద జిల్లాకు రావాల్సిన రూ.14 కోట్లలో కేవలం రూ.1.70 లక్షలు మంజూరు చేసి మమ అనిపించింది. నియోజకవర్గాల్లో విరివిగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈ నిధులు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్‌డీఎఫ్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు సీడీపీ (నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం) కింద రూ.1.50 కోట్లను విడుదల చేస్తున్న ప్రభుత్వం.. దీనికి అదనంగా ఈ నిధులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిర్దేశించింది.
సంకల్పం మంచిదే అయినా.. సర్కారులో చిత్తశుద్ధి లోపించింది. ఆర్థిక సంవత్సరం ముగిసినా నిధులివ్వకుండా దాటవేసింది. ఇబ్బడిముబ్బడిగా పనులను ప్రతిపాదించిన ఎమ్మెల్యేలకు తాజా పరిస్థితులు మింగుడుపడడంలేదు. క్షేత్రస్థాయిలో పనుల కోసం ఒత్తిళ్లు పెరిగిపోవడం.. ప్రభుత్వం నిధులు విదల్చకపోవడంతో దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. నిధుల కేటాయిస్తారా.. లేదా దానిపై కూడా స్పష్టత లేకపోవడం గందరగోళానికి తావిస్తోంది.
ప్రతిపాదనలతో సరి..!
జిల్లా మంత్రి కోటా కింద ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ.2 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ్యుల ప్రతిపాదిత జాబితాను యథాతథంగా సిఫార్సు చేయాలని మంత్రులకు సూచించింది. దీంతో జిల్లాలోని రాజేంద్రనగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్‌బీనగర్, షాద్‌నగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రూ.2 కోట్ల విలువైన పనులను ప్రతిపాదించారు. ప్రతిపాదిత జాబితాకు మంత్రి సిఫార్సు మేరకు జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపింది. ప్రణాళిక శాఖ పరిశీలన అనంతరం జాబితాను ఆర్థికశాఖకు పంపాల్సి ఉంది. అయితే, ప్రణాళిక శాఖలోనే ప్రతిపాదనలు ఆగిపోయాయి.
గతేడాది ఆగస్టు నెలలో ప్రతిపాదించిన పనులకు మోక్షం కలిగించిన సర్కారు.. ఆ తర్వాత జాబితాలను పక్కనపెట్టింది. దీంతో కేవలం చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు మినహా ఇతర సెగ్మెంట్లకు నయాపైసా విడుదల కాలేదు. ఈ నిధులపై గంపెడాశ పెట్టుకున్న ఎమ్మెల్యేలు ప్రతిరోజు ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. అప్పుడు ఇప్పుడు అంటూ దాటవేస్తూ వస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు నిధులు విడుదలవుతాయని భావించిన శాసనసభ్యుల ఆశలపైనా ప్రభుత్వం నీళ్లు చల్లింది.
సమాధానం చెప్పలేక..
ఎస్‌డీఎఫ్‌కు ప్రభుత్వం కోత విధించడం ఎమ్మెల్యేలను నిరాశకు గురిచేస్తోంది. భారీగా నిధులు వస్తాయనే ఆశతో ఇబ్బడిముబ్బడిగా పనులను ప్రతిపాదించామని, ఈ దశలో నిధులు రాకపోవడం.. వస్తాయనే సంకేతాలు లేకపోవడం రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తోందని ‘సాక్షి’ ప్రతినిధితో ఓ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు.ఈ నిధుల వినియోగంలో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో చిన్నా చితకా పనులేకాకుండా. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను కూడా ప్రతిపాదించామని, ఈ పరిస్థితుల్లో నిధులివ్వకపోవడం సరికాదని అన్నారు.మరోవైపు అధికారులు మాత్రం నిధుల విడుదలపై స్పష్టతనివ్వడంలేదు.
ప్రణాళిక శాఖలో పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలకు మోక్షం కలిగితే ఆర్థికశాఖ నిధులు విడుదల చేసే అవకాశముందని, ఆర్థిక సంవత్సరం ముగిసినా నిధులు మురిగిపోయే ఛాన్స్‌లేని జిల్లా ఉన్నతాధికారి ఒకరు అన్నారు.అయితే, ఏ నిర్ణయమైనా ప్రభుత్వ విచక్షణపైనే ఆధారపడి ఉందని చెప్పారు.