ఆరోగ్యానికి అవినీతి
- సొంత సిబ్బందినే వేధించుకుతింటున్న అధికారులు
- ప్రతి పనికీ ఓ రేటు
- కొరవడిన పర్యవేక్షణ
సాక్షి, విశాఖపట్నం: ప్రతి మనిషికి తిండి ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం..అందుకే ఆ శాఖపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలి. అడిగినన్ని నిధులు సమకూర్చాలి. సరిపడా సిబ్బందిని నియమించాలి. ఈ విషయంలో ప్రభుత్వం తన బాధ్యతను కొంత వరకూ నెరవేరుస్తోంది. కానీ వేలకు వేలు జీతాలు తీసుకుంటూ, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను బొక్కేస్తూ, అదీ చాలదన్నట్టు సొంత సిబ్బం దినే దోచుకోవడం ప్రారంభించారు. అవినీతిలో కూరుకుపోయిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ దుస్థితి ఇది.
చింతపల్లి ట్రెజరీ కుంభకోణంలో వెలుగుచూసిన అక్రమాలు ఇప్పటికే వైద్యారోగ్య శాఖ ప్రతిష్టను మంటగలిపాయి. కుంభకోణంలో ఇప్పటివరకూ 17మందిని అరెస్ట్ చేయగా వారిలో 5గురు వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఉన్నారు. తాజాగా ఆ శాఖ సిబ్బంది ఇద్దరు ఏసీబీకి చిక్కడంతో మరోసారి ఆశాఖ అవినీతి వెలుగులోకొచ్చింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆశాఖ ఉద్యోగులు ఎవరికి బదిలీ కావాలన్నా, ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలన్నా ఇక్కడి నుంచే జరుగుతుంది. ప్రాంతీయాధికారితో పాటు, డిప్యూటీ డెరైక్టర్, ఇద్దరు సూపరింటెండెంట్లు ఈ బాధ్యతల్లో కీలకపాత్ర వహిస్తుంటారు.
నిబంధనల ప్రకారం ఇవి జరిగితే తామెలా లాభపడతామనుకున్నారో ఏమో పక్కదారిలో సొమ్ము చేసుకోవడానికి సిద్ధపడ్డారు ఇక్కడి సిబ్బంది. ప్రతి పనికి ఉద్యోగుల స్థాయిని బట్టి రేటు నిర్ణయించారంటే ఇక్కడ అవినీతి ఎంత పకడ్బందీగా జరుగుతుందో అర్థమవుతుంది. ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే కిందిస్థాయి సిబ్బంది నేతృత్వంలో ఈ వ్యవహారం అత్యంత గోప్యంగా నడిచిపోతున్నదనే విమర్శలు ఉన్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు, ఎంపీహెచ్‌ఈలు,హెల్త్ సూపర్‌వైజర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్ల సర్వీసు వ్యవహారాలను వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం చూస్తుంది. ఉద్యోగుల బదిలీలు, సెలవులు, క్రమబద్ధీకరణ, పదోన్నతులకు అవసరమైన సీనియారిటీ జాబితా తయారు చేయడం, గెజిటెడ్ అధికారికి సంబంధించిన సరెండర్ లీవ్‌ల మంజూరు వంటి పనులు ఇక్కడ జరుగుతుంటాయి.
మెడికల్ లీవ్ మంజూరు, మెటర్నటీ సెలవులు, సర్వీసు క్రమబద్ధీకరణకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకూ చెల్లించాల్సి వస్తోందని కొందరు సిబ్బంది చెబుతున్నారు. విధులకు హాజరు కాకుండానే హాజరైనట్లు రికార్డులు సృష్టించడం దగ్గర్నుంచి, క్రమబద్ధీకరణ, బదిలీలు,సీనియారిటీ జాబితా తయారీలో సొమ్ములు తీసుకుని అవకతవకలకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచిత్రం ఏమిటంటే ఈ విషయాలన్నీ ఉన్నతాధికారులకు తెలియకుండా ఉండే అవకాశం లేదు. అయినా వారు పట్టించుకోనట్టే వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపిస్తే మరికొన్ని అవినీతి భాగోతాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.