అనంతపురం ఎడ్యుకేషన్ : ఒక కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ అనేది పోలీసులకు ఎంత ముఖ్యమో.. ప్రభుత్వం చేపట్టే వివిధ నిర్మాణాలకు సంబంధించి ఎంబుక్కు రికార్డు అంతే ముఖ్యం. ఏ చిన్న పనైనా ఎంబుక్ రికార్డు ఆధారంగానే నిధులు డ్రా చేయాల్సి ఉంటుంది. అయితే ఘనత వహించిన సర్వశిక్ష అభియాన్ ఇంజనీరింగ్ అధికారులు మాత్రం ఎంబుక్ రికార్డు లేకుండానే నిధులు డ్రా చేయడం చర్చనీయాంశమైంది. ప్రదీప్‌కుమార్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడగడంతో ఈ అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
2012-13 విద్యా సంవత్సరంలో మడకశిర డివిజన్‌కు 86 బాలికల మరుగుగొడ్లు మంజూరయ్యాయి. వీటిలో ఒక పాఠశాలలో పని ప్రారంభించలేదు. తక్కిన 85 పాఠశాలల్లో ఇంజనీరింగ్ అధికారులకే తెలియాలి. ఎంబుక్కుల్లో రికార్డు చేయకుండానే బిల్లులు డ్రా చేసినవిషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా అధికారికంగా అందజేశారు. ఎంబుక్కులో రికార్డు చేయకుండానే బిల్లులు చేశారంటే అధికారులకు తెలియకుండానే జరిగిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
సాధారణంగా క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన ఏఈ ఎంబుక్కులో రికార్డు చేయాల్సి ఉంది. బిల్లు మంజూరుకు డీఈకి నివేదిస్తే...ఎంబుక్కు ఆధారంగా డీఈ డాక్యుమెంట్లు పరిశీలించిన అనంతరం పనివద్దకు వచ్చి తనిఖీ చేసిన తర్వాత బిల్లు మంజూరు చేస్తారు. అయితే ఎంబుక్కులో నమోదు కాకుండానే నేరుగా నిధులు బిల్లులు చేయడం వెనుక ఆంతర్యమేమిటో అధికారులకే తెలియాలి.
ప్లంబౌట్ అయిన అమరాపురం కేజీబీవీ భవనం
అమరాపురం కేజీబీవీ భవనం నిర్మాణంలో లోపం (ప్లంబౌట్) వెలుగు చూసింది. నిర్మాణంలో చోటు చేసుకున్న నిర్లక్ష్యంతో ఈదుస్థితి నెలకొంది. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు అక్షరాల రూ.1.25 కోట్లు. ప్లంబౌట్ అయితే తిరిగి నిర్మాణం చేపట్టి సరి చేయాలి. అంతవరకు బిల్లు మంజూరు చేయకూడదు. అయితే ఈ భవనానికి సంబంధించి బిల్లులు చేయడం వెనుక భారీగానే నోట్లు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్లంబౌట్ అయిందనే బూచి చూపించి అధికమొత్తంలో గుంజినట్లు తెలిసింది.
ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులే ఇలా అక్రమాలకు పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. సాధారణంగా సొంతశాఖ నుంచి డెప్యూటేషన్‌పై ఇతర శాఖలకు వచ్చే అధికారులకు తిరిగి వారు సొంతశాఖకు వెళ్లాలంటే నోడ్యూస్, ఎల్‌పీసీ (లాస్ట్ పే సర్టిఫికెట్) సంబంధిత శాఖ అధికారి ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే ఈ శాఖలో గతంలో పని చేసిన కొందరు ఇంజనీరింగ్ అధికారులు వారి ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణాలకు సంబంధించి ఎంబుక్కులు సమర్పించకపోయినా అన్ని సక్రమంగా ఉన్నట్టు నోడ్యూస్, ఎల్‌పీసీ ఇచ్చారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. గతంలో పని చేసిన ఇద్దరు ఇంజనీర్ల వ్యవహారంపై బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఉన్నతస్థాయి అధికారులు దృష్టి సారిస్తే ఎస్‌ఎస్‌ఏలో మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
అడ్డగోలు చెల్లింపులు
Published Tue, Mar 10 2015 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM
Advertisement
Advertisement