ఏజెన్సీలకు ఆరు నెలలుగా అందని బిల్లు
జిల్లాలో సుమారు రూ.10 కోట్ల బకాయి
వడ్డీలు కట్టడానికీ అప్పులు చేస్తున్న వైనం
వచ్చిన నిధులు వేతనాలకే సరిపోయాయి: డీఈఓ
వాళ్లేమీ మేడలు, మిద్దెలు కట్టడం లేదు. అయినా ఇంట్లో ఉన్న బంగారం తాకట్టుకు వెళ్లిపోతోంది. లక్షల్లో బ్యాంకులకుఅప్పున్నవారూ కారు. అయినా ఒంటిపై ఉన్న తాళిబొట్టు సైతం బాకీ కింద జమైపోతోంది. సర్కారు బడుల్లోని మధ్యాహ్న భోజన నిర్వాహకుల దుస్థితి ఇది. అప్పుల మీద అప్పులు చేస్తూ స్కూళ్లో పిల్లల కడుపు నింపుతున్న నిర్వాహకులపై సర్కారు శీతకన్ను వేస్తోంది. బడి పిల్లలను సొంత పిల్లల్లా భావించి అన్నం పెడుతున్న వారి కడుపు కొడుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఇవ్వాల్సిన బకాయి * ’10 కోట్లు ఉందంటే వారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడంతోపాటు పౌష్టికాహార అందించేందుకు ఉద్దేశించి అమలు చేస్తున్న మధ్యాహ్నభోజన పథకం అభాసుపాలవుతోంది. మధ్యాహ్న వంటలు చేస్తున్న మహిళలకు ఆరు నెలులుగా బిల్లులు చెల్లించడం లేదు. 9, 10వ తరగతి బిల్లులు మాత్రం రెండునెలలవి మాత్రమే ఉన్నాయి. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు వండివారుస్తున్న ఏజెన్సీలకు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
చేసిన అప్పులు సకాలంలో తీర్చలేక మరో దగ్గర అప్పులు చేయాల్సి వస్తోంది. లోటు బడ్జెట్‌ను చూపుతూ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వీరి కడుపు మాడుతోంది. జిల్లాలోని సుమారు 2,960 వరకు ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నిర్వహణకు ప్రతి స్కూల్‌కి ఒక్కో ఏజెన్సీని ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచాలనే ఉద్దేశ్యంతో 2003లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒకటి నుంచి 7 తరగతుల విద్యార్థులను ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చింది. 2008లో 8వ తరగతి, 2008-09 విద్యాసంవత్సరం నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. జిల్లాలో వీరి కోసం సరాసరిన నెలలకు రూ. 3 కోట్ల వరకు నిధులు కావాలి. అయితే ప్రైమరీ పాఠశాలలో నాలుగు, ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరు నెలల బిల్లు బకాయి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు నెలలో బడ్జెట్ కేటాయింపులు చేసినా దాదాపు రూ.10 కోట్ల బిల్లు బకాయి పెట్టడడం దారుణమని నిర్వాహకులు గోలపెడుతున్నారు. ప్రభుత్వం ముందస్తుగా నిధులు ఇవ్వకపోయినా వంట ఏజెన్సీలు అప్పు చేసి విద్యార్థుల ఆకలి తీరుస్తున్నాయి. మరోవైపు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు ప్రభుత్వం ఇస్తున్న మొత్తం గిట్టుబాటు కాకపోయినా నిర్వాహకులు అతికష్టంపై నెట్టుకొస్తున్నారు. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పథకానికి ప్రాధాన్యం ఇచ్చి, బడ్జెట్‌తో సంబంధం లేకుండా గ్రీన్ చానల్ ద్వారా ఎప్పటికప్పుడు ఆటంకం లేకుండా నిధులు మంజూరు చేసేందుకు నిర్ణయించిన ప్రభుత్వమే మధ్యాహ్నభోజనానికి మోకాలడ్డుతోంది. ఫలితంగా పథకం నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.
బడి వంట... వడ్డీ మంట
Published Sat, Sep 26 2015 12:28 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement