విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ఆర్టీసీ కాంట్రాక్టు డ్రైవర్లను చిత్తూరు జిల్లాకు వెళ్లి పనిచేయాలని ఆర్టీసీ ఆర్‌ఎం ఆదేశిస్తున్నారని ఈ విధానం సరికాదంటూ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ పోర్టికో వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తాడంగి సాయిబాబు, పాలక రంజిత్ కుమార్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో వారు మాట్లాడుతూ 2015 జూలై నుంచి వివిధ డిపోల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు ఏడాది కాలంగా పనిచేయించకుండా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో పనిచేయాలని లేకుంటే ఉద్యోగం మానేయండని ఆర్‌ఎం ఆదేశిస్తున్నారన్నారు.
సంవత్సరానికి కేవలం ఐదారు నెలలే పని కల్పిస్తూ ఇప్పుడు ఉన్న పళంగా ఇతర జిల్లాలకు వెళ్లమనడం భావ్యం కాదన్నారు. ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను పద్ధతి ప్రకారం రెగ్యులర్‌పోస్టుల్లో నియమించాల్సి ఉన్నా కాంట్రాక్టు పద్ధతిలో నియమించడమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఇతర జిల్లాలకు వెళ్లి పనిచేయాలనీ లేకుంటే మానేయండనడం ఎంతవరకూ సమంజసమని వారు ప్రశ్నిం చారు. ఈ సందర్భంగా సంవత్సర కాలమంతా డ్యూటీలు కల్పించి డిపోల పరిధిలోనే డ్యూటీలు వేయాలని కోరుతూ వారు జిల్లా అధికారులకు వినతిపత్రాన్ని అందించారు.
ఇతర జిల్లాల్లో డ్యూటీలొద్దు
Published Thu, May 19 2016 12:30 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement