దినదిన గండం
మన్యంలో గిరిజనుల పరిస్థితి దయనీయం
ఇటు పోలీసులు- అటు
మావోయిస్టుల ఒత్తిళ్లు
మరికొందరిపైనా గురిపెట్టిన మావోయిస్టులు
వారికంత లోకజ్ఞానం తెలి యదు. బయట ప్రపంచంతో పెద్దగా సంబంధాలుండవు. ఉన్న ఊరేవారికి ప్రపంచం. ఎవరేం చెబితే అదే నిజమని నమ్మేస్తారు. ఎవరేది అడిగినా మర్మం లేకుండా చెప్పేస్తారు. కుట్రలు, కుతంత్రాలకు వారు దూరం. ఏజెన్సీలోని ఏ గ్రామానికెళ్లినా, ఏ గిరిజనుడ్ని చూసినా ఇది స్పష్టమవుతుంది. ఇప్పుడా అమాయకత్వమే ప్రాణాల్ని తీసేస్తోంది. అటు పోలీసులు, ఇటు మావోయిస్టుల మధ్య నలిగిపోతున్నారు. కొందరైతే ప్రాణాలను సైతం
పోగోట్టుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం :మొన్న మిడియం కృష్ణ, నిన్న పూసూరి వెంకటరావు, రేపు ఇంకెవరో... ఏజెన్సీలో ఏం జరిగినా అమాయక గిరిజనులే బలి అవుతున్నారు. మావోయిస్టులు అడుగెట్టినా, పోలీసులు రంగంలోకి దిగినా వారే లక్ష్యంగా మారిపోతున్నారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లోనూ అమాయక గిరిజనులే ప్రాణాలు కోల్పోతున్నారు. మావోయిస్టుల కోసం పోలీసులు వేటాడుతారు. ప్రతీకారం కోసం మావోయిస్టులు ఎదురు దాడికి దిగుతారు. ఇరువురూ ఏజెన్సీ తండాలనే కేంద్రంగా చేసుకుంటారు. మావోయిస్టుల కదలికలను, సమాచారాన్ని తమకు తెలియజేయాలని స్థానిక గిరిజనులను పోలీసులు సతాయిస్తుంటారు.
ఈ క్రమంలో బయటికి చెప్పలేనంత ఇబ్బందులు పెడతారన్న వాదనలూ ఉన్నాయి. మరోవైపు పోలీసుల సమాచారం కోసం అదే గిరిజనుల నుంచి మావోయిస్టులు ఆరాతీస్తుంటారు. అంతటితో ఆగకుండా పోలీసులకేమైనా సమాచారం ఇస్తున్నారా అనే కోణంలోనూ పరిశీలిస్తారు. మావోయిస్టులకు సహకరించే వారిని పోలీసులు మావో సానుభూతి పరులుగా చిత్రీకరిస్తే, పోలీసులకు సహకరించారని అనుమానం వస్తే మావోయిస్టులు పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా ముద్ర వేస్తారు. ఇది వారి ప్రాణాలకు ముప్పు తెస్తుంది.
ఒత్తిళ్లకు తలొగ్గితే...
ఇరు వర్గాల ఒత్తిళ్లతో గిరిజనులు ఏదో ఒక సందర్భంలో నోరు జారక తప్పదు. అదే వారి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. మన్యంలో ఇప్పుడిదే జరుగుతోంది. మిడియం కృష్ణ, పూసూరి వెంకటరావుతో మావోయిస్టులు చేతులు దులుపుకునేలా లేదు. జాకరవలసలో హత్యకు గురైన వెంకటరావు మృతదేహం మీద లభ్యమైన శ్రీకాకుళం - కొరాఫుట్ డివిజన్ కమిటీ వదిలేసిన లేఖ చూస్తుంటే భవిష్యత్‌లో మరికొంతమందిపైనా కక్షతీర్చుకునే అవకాశం ఉంది.
మరో నాలుగు రోజుల్లో కుమార్తె పెళ్లి
సాలూరు మండలం కురుకుట్టి పంచాయతీ జాకరవలసకు చెందిన పూసూరి వెంకటరావు(35) చింతపండు, తదితర సీజనల్ వ్యాపారం, వ్యవసాయం చేస్తుండేవాడు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తన 21ఏళ్ల కుమార్తె కవితకు ఈ నెల 27వ తేదీన రాళ్లగెడ్డ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. సోమవారం రాత్రి 12గంటల ప్రాంతంలో ఐదుగురు సాయుధ మావోయిస్టులు నేరుగా ఇంటికొచ్చి వెంకటరావును తీసుకెళ్లారు. జండమామిడి కొండవద్ద ఆయన ఎడమ చెవి దగ్గర తుపాకీతో కాల్చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేగాదు. ఒక లేఖ రాసి వెంకటరావు మృతదేహంపై ఉంచి వెళ్లారు. అందులో ఏముందంటే...ఆంధ్రా పోలీసులతో రెండేళ్లుగా సంబంధాలు ఉన్నాయని, పార్టీ దళ సమాచారాన్ని ఎప్పకటిప్పుడు చేరవేస్తున్నారని, తరుచూ పోలీసులనుంచి తప్పించుకుంటున్నామని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 20వ తేదీన దళ సమాచారం అందించడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చుట్టుముట్టాయని, అప్పుడు కూడా త్రుటిలో తప్పించుకున్నామని మావోయిస్టులు ప్రస్తావించారు. ఈ విషయమై ప్రజల ముందు విచారించి, ప్రజామోదం మేరకు ఖతం చేశామని స్పష్టం చేశారు. పోలీసులకు సమాచారం అందించే వారందరికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఘటన జరిగిన తర్వాత గ్రామస్తుల్ని ఎవరిని కదిపినా మాట్లాడటం లేదు. వారంతా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మావోయిస్టులు వదిలి వెళ్లిన లేఖను గత లేఖలతో పోల్చి చూస్తుంటే దళ కమాండర్ అరుణ రాసినట్టు ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఖాళీ అవుతున్న గ్రామాలు : వరుసగా జరుగుతున్న హత్యలు, భయానక పరిస్థితుల నేపథ్యంలో గిరిజన గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. భయాందోళనలతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఆయా ప్రాంతాల్లో వ్యాపారం, వ్యవసాయాలు చేస్తున్న సొండీలు, వ్యాపారులు సైతం ఆయా ప్రాంతాలను విడిచిపెట్టి పార్వతీపురం, విజయనగరం, రాయగడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు తరలిపోతున్నారు.