రొడ్డవలస సమీపంలో మావోయిçస్టులు మందుపాతర పేల్చిన స్థలం(ఫైల్), మావోలు విడుదల చేసిన లేఖ(ఫైల్)
విజయనగరం, సాలూరు రూరల్: ఏఓబీకి 20కిలోమీటర్ల దూరంలో ఒడిశారాష్ట్రంలో ఆదివారం మధ్యాహ్నం పోలీసులు – మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన సంఘటన ఇక్కడి గిరిజన పల్లెల్లో కలకలం సృష్టించింది. విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్యసంఘటన తరువాత ఏఓబీలో పోలీసుల గాలింపు ముమ్మరమైంది. పోలీసుల బూట్ల చప్పుళ్లతో గిరిజన పల్లెలు మార్మోగుతున్నాయి. ఇంతలోనే ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సుంకి సమీపంలోని షట్రాయ్ అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 1.45గంటల సమయంలో కాల్పుల సంఘటన చోటు చేసుకున్నట్టు ఒడిశా పోలీసు అధికారులు ధ్రువీకరించారు. అయితే ఈ సంఘటనలో ఎవరూ చనిపోయినట్టు సమాచారం లేదు. కానీ మావోయిస్టులకు చెందిన డంప్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
గాలింపు మరింత తీవ్రం
ఒడిశా ఘటనలో మావోయిస్టులు తప్పించుకోవడంతో వారిని ఎలాగైనా వెంబడించి కచ్చితంగా పట్టుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఇక్కడివారిలో ఎక్కువైంది. ఇదే సమయంలో గతంలోని మావోయిస్టుల సంఘటనలు గుర్తు చేసుకుంటున్నారు. సాలూరు, పాచిపెంట మండలాల్లో గతంలో మావోల కదలికలు ఉండేవి. పాచిపెంట మండలంలో 2017 ఫిబ్రవరి 1న మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో సుమారు 11 మంది ట్రైనీ పోలీసులు మృతిచెందడం, 2016 మార్చి నెలలో శ్రీకాకుళం–కొరాపుట్ డివిజన్ కమిటీ(మావోయిస్టులు) సాలూరు మండలం కురుకూటి పంచాయతీ జాకరవలసలో గిరిజనుడైన పూసరి వెంకటరావును ఇన్‌ఫార్మర్ నెపంతో కాల్చిచంపిన సంఘటనలు గుర్తుచేసుకుంటున్నారు. మళ్లీ ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment