coombing
-
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. 12 మంది నక్సల్స్ మృతి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో శుక్రవారం మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ సాగిస్తున్న భద్రతా బలగాలపై నక్సల్స్ కాల్పులకు దిగారు. ఇరువురి నడుమ ఎదురుకాల్పులు గంటలపాటు కొనసాగాయి. కాల్పుల అనంతరం ఘటనా ప్రాంతంలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఎం విష్ణుదేవ్ సాయ్ తెలిపారు. అదేసమయంలో, మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఒక బారెల్ గ్రెనేడ్ లాంఛర్, 12 బోర్ గన్, దేశవాళీ రైఫిల్, భారీగా పేలుడు పదార్థాలు లభించాయన్నారు. ఏప్రిల్ 16, 30వ తేదీల్లో చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్లలో 39 మంది మావోయిస్టులు చనిపోవడం తెల్సిందే. బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాదిలో వివిధ ఎన్కౌంటర్లలో103 మంది నక్సల్స్ చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. -
ప్రశాంత పోలింగ్‌కు టెక్ పోలీసింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల్ని ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. అందుకోసం మరింత విస్తృతంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సమాయత్తమైంది. ప్రధానంగా ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం దాదాపు లేదు. కానీ మన రాష్ట్ర సరిహద్దులకు అవతల ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టులకు ఇంకా పట్టుండటంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం సదా అప్రమత్తంగా ఉంటోంది.ఇక ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపునిస్తారని పోలీసు శాఖ భావిస్తోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు తెగబడే అవకాశం ఉందని, ఉనికి చాటుకునేందుకైనా ఎక్కడో ఒకచోట పోలింగ్‌ను భగ్నం చేసేందుకు యత్నించవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో మన రాష్ట్రంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అందుకే ఏవోబీలోని మారుమూల గ్రామాలు, గూడేల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తొలిసారిగా వాడుకోనుంది. ♦ ఏవోబీలో పోలింగ్ నిర్వహణ కోసం డ్రోన టెక్నాలజీని తొలిసారిగా వినియోగించాలని నిర్ణయించింది. జమ్ము–కశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టేందుకు ఉపయోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీని తొలిసారిగా ఈ ఎన్నికల కోసం ఏవోబీలో ప్రవేశపెట్టనుంది.శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పోలీసు నిఘా విధుల కోసం డ్రోన్లను ఉపయోగించనున్నారు. మొత్తం ఏవోబీ అంతా నిఘా పెట్టేందుకు అవసరమైన డ్రోన్లను ఇప్పటికే పోలీసు శాఖ తెప్పించింది. ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. మావోయిస్టులు, అనుమానితుల కదలికలపై ఈ డ్రోన్లతో నిఘా పెట్టనున్నారు. ♦ ఏవోబీ ప్రాంతాన్ని ప్రత్యేకంగా శాటిలైట్ మ్యాపింగ్ చేసేందుకు పోలీసు శాఖ కార్యాచరణ చేపట్టింది. గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించేందుకు నిర్వహించిన ‘ఆపరేషన్ పరివర్తన్’ కోసం గతంలో పోలీసు శాఖ ఎంపిక చేసిన ప్రాంతాలను శాటిలైట్ మ్యాపింగ్ చేసింది. ఈసారి మొత్తం ఏవోబీ ప్రాంతాన్ని శాటిలైట్ మ్యాపింగ్ చేయాలని నిర్ణయించింది.ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉన్న ప్రధాన మార్గాలు, అడ్డదారులు, డొంకదారులతోసహా మొత్తం ప్రాంతాన్ని శాటిలైట్ మ్యాపింగ్ చేయనున్నారు. తద్వారా మావోయిస్టులు ఏపీలోకి ప్రవేశించేందుకు యత్నిస్తే వెంటనే గుర్తించి పోలీసు బలగాలను అప్రమత్తం చేయవచ్చని పోలీసు శాఖ భావిస్తోంది. ♦ ప్రశాంత పోలింగ్ నిర్వహించేందుకు ఏవోబీ అంతటిని పోలీసు, గ్రేహౌండ్స్ బలగాలు జల్లెడ పట్టనున్నాయి. అందుకోసం ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. కూంబింగ్‌లో ఉన్న పోలీసులపై మావోయిస్టులు దొంగదెబ్బ తీయకుండా ఆధునిక జీపీఎస్ టెక్నాలజీని వారికి అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం పోలింగ్ విధుల కోసం ఏవోబీలో మోహరించే భద్రతా బలగాలు కూడా అదే జీపీఎస్ టెక్నాలజీని వినియోగించుకోనున్నాయి. -
పక్కా సమాచారం.. పకడ్బందీ వ్యూహం
మృతి చెందిన మావోయిస్టుల్లో గుర్తించింది వీరినే.. 1. సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ రావు (మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్), డీవీసీ మెంబర్, నార్త్ బస్తర్ మాస్ ఇన్చార్జి, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె 2. దాశశ్వర్ సుమన అలియాస్ రజిత, డీసీఎస్, సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ భార్య, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు 3. లలిత, డీవీసీ మెంబర్, జన తన సర్కార్ కమిటీ ఇన్చార్జి 4. మాధవి, నార్త్ బస్తర్ మెంబర్ 5. జగ్ను అలియాస్ మాలతి, పర్థాపూర్ ఏరియా కమిటీ 6. రాజు సలామ్ అలియాస్ సుఖాల్, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 7. వెల సోను అలియాస్ శ్రీకాంత్ సోను, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 8. రాణిత అలియాస్ జయమతి, రూపి, ప్రాగ్ ఎల్వోసీ కమాండర్ 9. రామ్ షీలా, నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్ సాక్షి ప్రతినిధి, వరంగల్: పక్కాగా అందిన సమాచారం, పకడ్బందీ వ్యూహం నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సోమవారం సాయంత్రం పోలీస్ ఇన్ఫార్మర్ పేరిట కాంకేర్ జిల్లాలో ఒకరిని హతమార్చిన మావోయిస్టులు.. అదే ప్రాంతంలో సమావేశం అయ్యారన్న సమాచారంతో బలగాలు ప్రత్యేక వ్యూహంతో కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లోనే 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. వీరిలో 15 మంది మహిళలు కాగా, 14 మంది పురుషులు ఉన్నారు. ఘటనా స్థలంలో ఏకే–47, ఎల్ఎంజీ, ఇన్సాస్ లాంటి అత్యాధునిక ఆయుధాలను స్వాదీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్, కాంకేర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంద్ర కళ్యాణ్ ఎల్లిసెల బుధవారం రాత్రి వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వారు తెలియజేశారు. ఇప్పటివరకు 9 మంది మావోయిస్టులను గుర్తించామన్నారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురానికి చెందిన సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు ఉన్నట్లు భావించామని, అయితే బుధవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్ అలియాస్ మురళి, అలియాస్ శంకర్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. ఆయనతో పాటు ఇప్పటివరకు గుర్తించిన మొత్తం 9 మంది పేర్లను తెలిపారు. మిగతా వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. ఆపరేషన్ యాంటీ మావోయిస్టులు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఆపరేషన్ యాంటీ మావోయిస్టులు పేరిట ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు గతంలోనే కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అందిన సమాచారం మేరకు.. మంగళవారం ఉదయం నుంచి కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులు (డీఆర్జీ), కేంద్ర భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు బుధవారం ప్రకటించారు. లోక్‌సభ మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఈనెల 19న 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో దండకారణ్య ప్రాంతంలోని బస్తర్, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి స్థానాలు కూడా ఉన్నాయి. ఎన్కౌంటర్ జరిగిన కాంకేర్ పార్లమెంట్ స్థానానికి రెండో విడతలో ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో నెల రోజులుగా నిఘా వేసిన పోలీసు వర్గాలకు అందిన పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టగా ఎన్కౌంటర్ జరిగినట్లు చెబుతున్నారు. మృతి చెందిన వారిలో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ పోలీసుల దృష్టిలో మోస్ట్ వాంటెడ్‌లుగా ఉన్న పలువురు టాప్ కమాండర్లు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. నాలుగైదు రోజుల ముందే అగ్రనేతలు, ఆర్కేబీ డివిజన్ కమిటీ ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన నేపథ్యంలో రావ్‌ఘాట్ ఏరియా కమిటీ (పర్థాపూర్)మాత్రమే ఛోటె బెటియా పోలీసుస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయి పోలీసుల ఎదురుకాల్పుల్లో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినట్లు సమాచారం. ముగిసిన 25 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం చిట్యాల: విప్లవ గీతాలకు ఆకర్షితుడై 25 ఏళ్లక్రితం అడవి బాటపట్టిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ విగతజీవుడై గ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. సిరిపెల్లి రాజపోశమ్మ–ఓదెలు దంపతుల కుమారుడు సుధాకర్ 1996లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తరువాత లొంగిపోయి జైలు జీవితం గడిపాడు. 1998లో మళ్లీ అడవి బాట పట్టాడు. దళ సభ్యుడి నుంచి నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, అనంతరం శంకర్ పేరుతో ఛత్తీస్‌గఢ్ ఏరియాలో జిల్లా కార్యదర్శిగా ఎదిగాడు. సుధాకర్ తండ్రి చనిపోగా, తల్లి వృద్ధాప్యంలో ఉంది. బస్తర్ ఎన్కౌంటర్లో సుధాకర్ చనిపోయాడని తెలియడంతో తల్లి, బంధువులు ఛత్తీస్‌గఢ్ వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. సుధాకర్ భార్య సుమన మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించినట్లు తెలిసింది. ఎన్కౌంటర్ మృతుల్లో చిన్నన్న లేడు ధ్రువీకరించిన సోదరులు ఆత్మకూరు రూరల్: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన 29 మంది మావోయిస్టుల్లో ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు, అలియాస్ నాగన్న అలియాస్ విజయ్ కూడా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే స్థానిక పోలీసులు చూపించిన ఎన్కౌంటర్ మృతుల ఫొటోల్లో చిన్నన్న లేడని ఆయన సోదరులు ధ్రువీకరించారు. సుగులూరి చిన్నన్న 1996లో అప్పటి పీపుల్స్‌వార్‌లో పూర్తికాల సభ్యుడిగా చేరారు. తొలుత కర్నూలు జిల్లాలో అప్పటి భవనాసిదళం సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన..2006 తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలోకి వెళ్లినట్లు సమాచారం. తదనంతర కాలంలో దండకారణ్యం స్పెషల్ జోనల్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాజ్‌నంద్‌గావ్–కాంకేర్ డివిజన్ కార్యదర్శిగా విజయ్ పేరుతో కొనసాగుతున్నట్లు పోలీసు రికార్డుల ఆధారంగా తెలుస్తోంది. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. మావోయిస్టు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయాడు. సోధి గజేంద్ర తదితర సుమారు 20 మంది మావోయిస్టులతో కూడిన కుంటా ఏరియా కమిటీ సమావేశమవుతున్నట్లు అందిన సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా భేజీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నగరం, పంటాభేజీ గ్రామాల మధ్య ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో ఒక మావోయిస్టు చనిపోయాడు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల ఘటనలో సీఆర్పీఎఫ్ 165వ బెటాలియన్ ఎస్ఐ సుధాకర్‌రెడ్డి వీరమరణం పొందగా రాము అనే కానిస్టేబుల్ గాయపడ్డారు. జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో బద్రేలోని సీఆర్పీఎఫ్ క్యాంపు నుంచి ఉర్సంగల్ వైపు జవాన్లు కూంబింగ్ సాగిస్తున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్సై సుధాకర్‌రెడ్డి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. సుధాకర్‌రెడ్డి సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు. ఈ నెలలో బస్తర్ డివిజన్లో మావోయిస్టుల సంబంధిత ఘటనల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా ఏడుగురు గాయపడ్డారు. 13న నారాయణ్‌పూర్ జిల్లా మావోయిస్టుల దాడిలో ఒక జవాను, 14న కాంకేర్ జిల్లా నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి మరో బీఎస్ఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు. -
మహారాష్ట్రలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టు సీనియర్ నేత సహా ఇద్దరు నక్సల్స్ చనిపోయారు. ఛత్తీస్‌గఢ్– మహారాష్ట్ర సరిహద్దుల్లోని బోధింటొలా ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ సమయంలో మావోయిస్టులు వారిపైకి కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో కసన్సూర్ దళం డిప్యూటీ కమాండర్ దుర్గేశ్ వట్టి, మరో గుర్తు తెలియని మావోయిస్టు చనిపోయారు. -
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి
కాళేశ్వరం: మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లా బాంబ్రాగాడ్ తాలూకా దామరంచ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి పోలీసులతో ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ తెలిపారు. పెరిమిలి, అహేరి మావోయిస్టు దళాలు సమావేశమయ్యాయనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా జరిఎదురు కాల్పుల్లో పెరిమిలి దళం కమాండర్ బిట్లు మడావి, వాసు, అహేరి దళానికి చెందిన శ్రీకాంత్ మృతి చెందారు. -
ఏవోసీబీలో కూంబింగ్ ముమ్మరం
సాక్షి, అమరావతి: ఆంధ్రా–ఒడిశా–ఛత్తీస్‌గఢ్ (ఏవోసీబీ) సరిహద్దుల్లోని ట్రై జంక్షన్ ప్రాంతంలో పోలీసు బలగాలు విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేతల కదలికల నేపథ్యంలో మన్యాన్ని జల్లెడపడుతున్నాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మంగళవారం, విశాఖ మన్యంలో బుధవారం జరిగిన వరుస ఎన్కౌంటర్లతో మన్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎదురుకాల్పుల నుంచి కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ్ అలియాస్ మహేందర్‌రెడ్డి, అరుణ తప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి అర కి.మీ. దూరంలోని మరో ప్రాంతంలో వారు ఉండటంతో కాల్పుల మోత వినగానే తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది మావోయిస్టుల రక్షణతో వారు ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్ సరిహద్దుల్లోని కట్ ఆఫ్ ఏరియాలోని ట్రై జంక్షన్ వైపు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. అందుకే వారి కోసం మూడు వైపుల నుంచి కుంబింగ్‌ను ముమ్మరం చేశారు. ట్రై జంక్షన్‌లోనే అగ్రనేతలు? ఆంధ్రా–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (ఏఓబీజెడ్‌సీ) ఆధ్వర్యంలో మళ్లీ కేడర్‌ను బలోపేతం చేసుకోవాలని మావోయిస్టులు సన్నద్ధమవుతన్నట్లు నిఘా వర్గాలకు స్పష్టమైన సమాచారం అందింది. జూన్–జులైలలో అందుకోసం పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారని కూడా పసిగట్టాయి. దీంతో బస్తర్ కేంద్రంగా మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు గత నెలలో సమావేశమైనట్లు సమాచారం. వరుస లొంగుబాట్లు, ఆనారోగ్య సమస్యలతోపాటు కరోనాతో కూడా మావోయిస్టులు గత కొద్దిరోజులుగా బలహీనపడిన నేపథ్యంలో మరింత కట్టుదిట్టంగా గాలింపు చర్యలు చేపట్టాలని వారు నిర్ణయించారు. శిక్షణా తరగతుల నిర్వహణకు ఇతర ప్రాంతాల నుంచి అగ్రనేతలు వచ్చేవరకు వేచి చూడాలని ముందుగానే నిర్ణయించారు. ఇంతలో అగ్రనేతలు చేరుకున్నారన్న సమాచారం రావడంతో గ్రేహౌండ్స్, కోబ్రా, ఎస్పీఎఫ్, ఐటీబీటీ, బీఎస్ఎఫ్ బలగాలు సంయుక్తంగా జూన్ రెండోవారం నుంచి కూంబింగ్‌ను విస్తృతం చేశాయి. ఈ నేపథ్యంలో.. ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో సోమ, మంగళవారాల్లో జరిగిన ఎదురుకాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకోగా.. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం తీగలంమెట్ట వద్ద బుధవారం ఎన్కౌంటర్లో ఇద్దరు డివిజన్ కమిటీ సభ్యులతోపాటు ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనలతో మల్కనగిరి, విశాఖ మన్యంలలో ఎన్కౌంటర్లపై మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించి కూంబింగ్‌ను విస్తృతం చేయాలని నిర్ణయించారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ్, అరుణలు 40 మంది మావోయిస్టుల రక్షణతో ట్రై జంక్షన్‌కు చేరుకోవచ్చని భావిస్తున్నారు. దాంతోపాటు ఏఓబీజెడ్‌సీ ఇన్చార్జ్ డుడుమలతోపాటు మరికొందరు అగ్రనేతలు ఆ ప్రాంతంలోనే ఉండొచ్చన్నది పోలీసు ఉన్నతాధికారుల అంచనా. అగ్రనేతల్లో ఎవరు ఉండొచ్చన్న దానిపై అప్పుడే ఏమీ చెప్పలేమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కానీ, ఆ ప్రాంతంలో భారీస్థాయిలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని.. ఇన్ఫార్మర్లు చెప్పినదాన్ని బట్టి ఒకరిద్దరు అగ్రనేతలు కూడా ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. దీంతో ఏఓసీబీలో పోలీసు బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. -
తెలంగాణ బంద్..అడవుల్లో హై అలర్ట్!
-
తెలంగాణ బంద్: అడవుల్లో హై అలర్ట్
సాక్షి, ఆదిలాబాద్ : ప్రజాకవి, విరసం నేత వరవరరావును విడుదల చేయాలని కోరుతు శనివారం తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ పటిష్టం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ ఏరియాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన బలగాలు.. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఆ ప్రాంతాలను వారి గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టి ఉంచారు. మంచిర్యాల-మహారాష్ట్ర ప్రాంతాలపై కోటపల్లి, వెమనపల్లి, నీల్వయి ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాల్లో 3 రోజులుగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, సాయుధ దళాల సంచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు అధికార పార్టీ ప్రతినిధి జగన్ రాష్ట్ర కార్యదర్శి పేరిట ఈ నెల 25 న బంద్ పిలుపునిచ్చారు. ఈ నెల 28 నుంచి అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించాలని ప్రకటనలు వెలువడ్డ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ అధ్వర్యంలో జిల్లా డీసీపీ, ఏసీపీలతో పాటు మొత్తం 500 మంది స్పెషల్ పార్టీ, క్యాట్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు ప్రాణహిత పరివాహక గ్రామాల్లోని అడవులను జల్లెడ పడుతున్నారు. అలాగే సీఐ, ఎస్పై, సీఆర్పీఎఫ్ బలగాలు, సివిల్ పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. కొత్త వ్యక్తులను గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయా గ్రామస్తులను కోరారు. సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంటుందన్నారు. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాలలో నిరంతరం నిఘా కోసం సీసీ కెమెరాలను అలాగే డోన్ కెమెరాలను వాడుతున్నట్టు అధికారులు తెలిపారు.మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి మావోలు నది దాటి వచ్చే అవకాశం ఉన్నందున అపరిచిత వ్యక్తులపై దృష్టి సారించామన్నారు. సరిహద్దు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేశారు. -
పట్టుదలతో మావోలు.. పంతంతో పోలీసులు
సాక్షి, బెల్లంపల్లి : వ్యూహ ప్రతి వ్యూహాలతో మావోయిస్టులు, పోలీసులు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పటి పట్టుకోసం మావోలు ప్రయత్నాలు చేస్తుండగా ఆ వ్యూహాన్ని ఆదిలోనే తిప్పికొట్టేందుకు బహుముఖ వ్యూహాలతో పోలీసులు పథక రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మావోయిస్టుల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు పోలీసు యంత్రాంగం అన్నిరకాలా సంసిద్ధమవుతోంది. ఆసిఫాబాద్ జిల్లా పరిధి తిర్యాణి అటవీప్రాంతం తొక్కిగూడ వద్ద ఇటీవల జరిగిన పరస్పర ఎదురు కాల్పుల ఘటనతో అటవీప్రాంతం అట్టుడుకుతోంది. మావోయిస్టులు తారసపడినట్లే పడి తృటిలో తప్పించుకోవడాన్ని పోలీసులు జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది. ఐదుగురు సభ్యులతో కూడిన దళం క్షణాల్లో తప్పించుకోవడం సంచలనమైంది. ఈ చర్యతో ఇరువర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రవెల్లిలో మావోల కుటుంబీకులను పరామర్శిస్తున్న ఏసీపీ (ఫైల్) గిరిజన యువతను ఆకట్టుకుని పట్టుసాధించాలనే తలంపులో మావోలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఎలాగైనా అడ్డుకుని మావోలపై పైచేయి సాధించాలనే కృత నిశ్చయంతో పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తోంది. ఎదురు కాల్పుల ఘటన తర్వాత మావో లు కొత్తగా ఏర్పాటు చేసిన ఏరియా కమిటీలు ఒక్కసారిగా తెరమీదకు రావడం, పత్రికల్లో ప్రకటనలు రావడం మారిన పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇదే క్రమంలో విప్లవ కవి వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాలను జైలులో నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న మావోయిస్టుపార్టీ రాష్ట్రబంద్‌కు పిలుపునివ్వడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈక్రమంలో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో బంద్ ప్రభావం ఏమేరకు ఉంటుందనేది చర్చనీయాంశమైంది. -
సరిహద్దుపై డేగ కన్ను
వేమనపల్లి: దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం. ఒకవైపు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేపై మావోలు దాడి చేసి పొట్టన పెట్టుకున్నారు. దీం తో తెలంగాణ మహారాష్ట్ర, ఛతీస్‌గఢ్ సరిహద్దు ప్రాణహిత, గోదావరి నదీ తీరం వెంటా డేగకళ్లతో పోలీసులు పహారా కాస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో నేడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా గ్రా మాలు అప్పటికే పోలీసుల రక్షణ వలయంలోకి వెళ్లి పోయాయి. ప్రాణహితానది అవతలి వైపున్న గడిచిరోలి జిల్లా అభయారణ్యం మావోయిస్టులకు షెల్టర్‌జోన్. ఎతైనా.. గుట్టలు, దట్టమైన అడవులు ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఎన్నికల స మయంలో మావోలు తమ ఉనికి చాటుకునేందుకు అవకాశాలున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా పోలీస్ బలగాలు నిఘా తీవ్రతరం చేశాయి. ఎన్నికల ప్రక్రియకు మాత్రం ఆటంకం కలగకుండా అన్ని పీఎస్‌లపై దృష్టిసారించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు వెంట రామగుండం పోలీస్‌కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ రక్షితా కే. మూర్తి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చో టులేకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి గ్రామాల్లో ఓటింగ్ సరళి పెంచేందుకు గ్రామసభలు ఏర్పాటుచేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మా ర్చి 26న తీరం వెంట భారీ కూబింగ్ నిర్వహించారు. అదే రోజు ముక్కిడిగూడెం, కల్లంపల్లి గ్రా మస్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటుహక్కు ప్రాధాన్యత, మావోల ప్రజావ్యతిరేక విధానాలపై వివరించారు. ప్రాణహిత ఫెర్రీపాయింట్‌ల వద్దకు డ్రోన్ కెమెరాల సహాయంతో తీరం వెంట గస్తీ నిర్వహిస్తున్నారు. జైపూర్ ఏసీపీ వెంకటరెడ్డి, రూరల్ సీఐ జగదీష్, ఎస్సై భూమేష్‌లు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి భద్రత పరమైన చర్యలు తీసుకుంటున్నారు. నిరంతర నిఘా.. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రాణాహిత తీరం వెంట నిరంతర నిఘా కొనసాగుతోంది. జిల్లాలో 53 ఒకప్పటి మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో 98 పోలింగ్‌స్టేషన్లున్నాయి. సుమారు 88 మంది మావోయిస్ట్ మాజీ సానుభూతిపరులు, మాజీ మిలిటెంట్లు ఉన్నారు. వీరందరితో సమావేశాలు నిర్వహించి, అసాంఘిక శక్తులకు సహకరించొద్దని వారిని బైండోవర్ చేశారు. నది వెంట 16 ఫెర్రీ పాయింట్లుండగా వచ్చి పోయే ప్రయాణికుల మీద దృష్టి సారించారు. పడవలు నడిపే బోట్‌రైడర్లు, జాలరులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఇరు రాష్ట్రాల సరిహద్దు పోలీస్స్టేషన్ల సిబ్బంది సమన్వయంతో ఎప్పటికప్పుడు అనుమానిత వ్య క్తుల సమాచారం తెలుసుకుంటున్నారు. యాక్షన్‌టీంలాంటి వాటి సంచారాన్ని తిప్పికొట్టేందుకు కౌంటర్ యాక్షన్ టీం, క్యూఆర్టీ, టాస్క్‌ఫోర్స్ టీం లను ఏర్పాటు చేశారు. యాక్షన్‌టీం సభ్యుల ఫొటోలను గ్రామాల్లో గోడలపై అంటించి వారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రచారం చేయిస్తున్నారు. సరిహద్దు వెంట ఉన్న సుమారు 284 కల్వర్టులను ప్రత్యేకపోలీస్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలను నిర్వహించారు. -
మావోల కోసం వేట
తూర్పుగోదావరి , చింతూరు (రంపచోడవరం): సరిహద్దుల్లో తమ ఉనికిని చాటుకుంటున్న మావోయిస్టుల కోసం వేట మొదలైంది. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రభావం పెంచుకుంటున్న మావోయిస్టుల జాడ కోసం ప్రత్యేక బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. రెండు రోజుల క్రితం విలీన మండలాల్లో మావోయిస్టులు ఆర్టీసీ బస్సు, లారీని దహనం చేసిన నేపథ్యంలో మన్యంలో ఒక్కసారిగా అలజడి రేగింది. దీంతో జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పర్యటించి బలగాలను అప్రమత్తం చేశారు. మావోయిస్టులను కట్టడి చేసేందుకు సరిహద్దుల్లో కూంబింగ్ ముమ్మరం చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఘటనలకు పాల్పడింది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు దళ సభ్యులైనా ఆ ప్రభావం విలీన మండలాలపై పడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో ఓవైపు మావోయిస్టుల కార్యకలాపాలు, మరోవైపు ప్రత్యేక బలగాల కూంబింగ్‌తో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో కొంతకాలం స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడంతో పాటు గురువారం మావోయిస్టులు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చారు. దీనిని పురస్కరించుకుని మావోయిస్టులు అటు ఛత్తీస్‌గఢ్‌లో పలు హింసాత్మక సంఘటనలకు పాల్పడడంతో పాటు ఇటీవల చింతూరు మండలం పేగలో ఓ వ్యానును, సరివెల వద్ద జాతీయ రహదారిపై తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు, లారీని దగ్ధం చేశారు. కుంట ఏరియా కమిటీ పనేనా? ఈ రెండు ఘటనలు మావోయిస్టు పార్టీ కుంట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినట్టు పోలీసులు భావిస్తున్నారు. గతంలో విలీన మండలాల్లో మావోయిస్టు పార్టీ శబరి ఏరియా కమిటీ క్రియాశీలకంగా వ్యవహరించింది. ఆ కమిటీ కార్యదర్శి కల్మా చుక్కా అలియాస్ నగేష్ ఎన్కౌంటర్ అనంతరం రూపు మార్చుకుని చర్ల, శబరి ఏరియా కమిటీగా అవతరించింది. ఈ కమిటీకి కొంతకాలం రజిత, సునీల్‌లు కార్యదర్శులుగా వ్యవహరించారు. అనంతరం సునీల్ పోలీసులకు లొంగిపోడంతో ఈ కమిటీ బాధ్యతలను భద్రాద్రి కొత్తగూడెం, ఈస్ట్ గోదావరి జిల్లాల కమిటీ ఆధ్వర్యంలోనే పర్యవేక్షిస్తూ ఈ కమిటీకి శారదక్కను కార్యదర్శిగా నియమించినట్టు తెలిసింది. కాగా శబరి లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్(ఎల్వోఎస్)కు సోమ్‌డాను కమాండర్‌గా నియమించినట్టు సమాచారం. చర్ల, శబరి ఏరియా కమిటీ ప్రధానంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల కార్యకలాపాలను శబరి ఎల్వోఎస్, కుంట ఏరియా కమిటీకి అప్పగించినట్లుగా సమాచారం. సరిహద్దుల్లో జాయింట్ ఆపరేషన్ బస్సు, లారీ దగ్థం ఘటన అనంతరం ప్రత్యేక బలగాలతో నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో జాయింట్ ఆపరేషన్ ద్వారా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆంధ్రాకు చెందిన గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ, సీఆర్పీఎఫ్ బలగాలు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కోబ్రా, ఎస్టీఎఫ్, డీఎఫ్, సీఏఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఘటనలకు పాల్పడుతున్న మావోయిస్టులు సరిహద్దు గ్రామాల్లో తలదాచుకునే అవకాశమున్న నేపధ్యంలో సరిహద్దుల్లోని మల్లంపేట, నర్శింగపేట, నారకొండ, అల్లిగూడెం, దొంగల జగ్గారం, దుర్మా, మైతా, సింగారం, బండ ప్రాంతాలను బలగాలు జల్లెడ పడుతున్నాయి. అటు పోలీసుల జాయింట్ ఆపరేషన్, ఇటు మావోయిస్టుల ఆధిపత్య పోరు నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని సరిహద్దు పల్లెల ఆదివాసీల్లో ఆందోళన నెలకొంది. మావోయిస్టుల బంద్ కారణంగా రెండోరోజు కూడా విలీన మండలాలకు బస్సులు బంద్ అయ్యాయి. ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు చెందిన బస్సులు తిరగక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. -
ఉలిక్కిపడిన సరిహద్దు గ్రామాలు
విజయనగరం, సాలూరు రూరల్: ఏఓబీకి 20కిలోమీటర్ల దూరంలో ఒడిశారాష్ట్రంలో ఆదివారం మధ్యాహ్నం పోలీసులు – మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన సంఘటన ఇక్కడి గిరిజన పల్లెల్లో కలకలం సృష్టించింది. విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్యసంఘటన తరువాత ఏఓబీలో పోలీసుల గాలింపు ముమ్మరమైంది. పోలీసుల బూట్ల చప్పుళ్లతో గిరిజన పల్లెలు మార్మోగుతున్నాయి. ఇంతలోనే ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సుంకి సమీపంలోని షట్రాయ్ అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 1.45గంటల సమయంలో కాల్పుల సంఘటన చోటు చేసుకున్నట్టు ఒడిశా పోలీసు అధికారులు ధ్రువీకరించారు. అయితే ఈ సంఘటనలో ఎవరూ చనిపోయినట్టు సమాచారం లేదు. కానీ మావోయిస్టులకు చెందిన డంప్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గాలింపు మరింత తీవ్రం ఒడిశా ఘటనలో మావోయిస్టులు తప్పించుకోవడంతో వారిని ఎలాగైనా వెంబడించి కచ్చితంగా పట్టుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఇక్కడివారిలో ఎక్కువైంది. ఇదే సమయంలో గతంలోని మావోయిస్టుల సంఘటనలు గుర్తు చేసుకుంటున్నారు. సాలూరు, పాచిపెంట మండలాల్లో గతంలో మావోల కదలికలు ఉండేవి. పాచిపెంట మండలంలో 2017 ఫిబ్రవరి 1న మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో సుమారు 11 మంది ట్రైనీ పోలీసులు మృతిచెందడం, 2016 మార్చి నెలలో శ్రీకాకుళం–కొరాపుట్ డివిజన్ కమిటీ(మావోయిస్టులు) సాలూరు మండలం కురుకూటి పంచాయతీ జాకరవలసలో గిరిజనుడైన పూసరి వెంకటరావును ఇన్ఫార్మర్ నెపంతో కాల్చిచంపిన సంఘటనలు గుర్తుచేసుకుంటున్నారు. మళ్లీ ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. -
మన్యంలో భయం భయం
సాక్షి, విశాఖపట్నం :అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు మట్టుబెట్టడంతో విశాఖ ఏజెన్సీలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కొంతకాలంగా గ్రామ, మండల స్థాయి నాయకులనే పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో హతమార్చడం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి ఘటనలకు పాల్పడిన మావోలు ఏకంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలనే హతమార్చడం పోలీసులకు సవాల్‌గా మారింది. తమ నేతలను రక్షించడంలో విఫలమయ్యారంటూ అరుకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆదివారం నాటి ఉద్రిక్త çపరిస్థితులు సోమవారం నాటికి కాస్త అదుపులోకి వచ్చాయి. అయితే ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన గిరిజనుల్లో నెలకొంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హతమార్చిన ఘటనలో పాల్గొన్న మావోయిస్టులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రత్యక్ష సాక్షులు గుర్తించిన ముగ్గురు మావోల వివరాలను మీడియాకు విడుదల చేశారు. అయితే వీరు ఏ దళంలో పనిచేస్తున్నది.. ఇప్పటి వరకు ఏఏ ఘటనల్లో పాల్గొన్నది మాత్రం చెప్పలేదు. మిగిలిన వారిని కూడా త్వరలోనే గుర్తిస్తామని ప్రకటించారు. నిన్నటి ఘటన నేపథ్యంలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. విశాఖ మన్యంతోపాటు ఏవోబీలో గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ పార్టీ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. ఘటన జరిగిన డుంబ్రిగూడ మండలంతోపాటు మావోల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. కటాఫ్ ఏరియాతోపాటు ఏవోబీ ప్రాంతాల్లో అణువణువు గాలిస్తున్నారు. అదనపు బలగాల కూంబింగ్ ఆపరేషన్‌తో ఏజెన్సీ గ్రామాలన్నీ భయం గుప్పెట్లో వణికిపోతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన గిరిజన గ్రామాల్లో కన్పిస్తోంది. గిరిజనులైతే ఇళ్లు వదిలి బయటకొచ్చేందుకు భయపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కర్నీ ప్రశ్నిస్తున్నారు. నిన్నటి ఘటనలో పాల్గొన్న మావోయిస్టులను చూసారా? వారి కదలికలను గమనిం చారా? గుర్తుపట్టగలరా అంటూ ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బలగాల బూట్ల చప్పుళ్లతో విశాఖ ఏజెన్సీ దద్దరిల్లిపోతుంది. మొత్తమ్మీద విశాఖ మన్యంలో ఏ క్షణాన్న ఏం జరుగుతుందోననే ఆందోళన సర్వత్రా నెలకొంది. అర్ధరాత్రి బస్సు సర్వీసులు నిలిపివేత సీలేరు (పాడేరు): ఏవోబీలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నం నుంచి ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతాల వరకు అడుగడుగునా పోలీసు బలగాలు మోహరించాయి. విశాఖ నుంచి ఏజెన్సీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే రాత్రి పూట బస్సు సర్వీసులను నిలిపివేశారు. విశాఖ–భద్రాచలం, విశాఖ–హైదరాబాదు, భద్రాచలం మీదుగా రాత్రి పూట వెళ్లే బస్సులు తిరగలేదు. ఆంధ్రా, ఒడిశా, తూర్పుగోదావరి, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ముమ్మర గాలింపు చేస్తున్నారు. -
సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్
కాటారం(మంథని) వరంగల్ : రాష్ట్ర సరిహద్దులోని గోదావరితీర అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్, మావోయిస్టుల హత్యలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి తీరప్రాంతమైన మహదేవపూర్ నుంచి ఏటూరునాగారం వరకు కూంబింగ్ చేపట్టారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా కుకడాంజోర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుమీయాబెడా అడవుల్లో సీఆర్ఫీఎఫ్ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా కామాండర్తోపాటు నలుగురు మావోయిస్టులు మరణించారు. ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టులు గోదావరి దాటి తెలంగాణలో తలదాచుకునే అవకాశాలు ఉన్నట్లు నిఘావర్గాల సమాచారం మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కాంకేర్ జిల్లా బందె పోలీస్‌స్టేషన్ పరిధిలోని తాడంవెల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. చత్తీస్‌గఢ్ – మహారాష్ట్ర మధ్య ప్రవహిస్తున్న ఇంద్రావతి నది దాటి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా తాడగూడ రోడ్డు వద్ద సోనువదా, సోమ్జీవదాను మావోయిస్టులు గొంతుకోసి చంపారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కలిసే మహదేవపూర్ అడవుల్లోకి మావోయిస్టులు చొరబడి తలదాచుకునే అవకాశాలున్నట్లు నిఘావర్గాలు హెచ్చరించడంతో జిల్లా ఎస్పీ భాస్కరన్, మహదేవపూర్ సబ్ డివిజన్ పోలీసులను అప్రమత్తం చేశారు. డీఎస్పీ కేఆర్కే.ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. సరిహద్దుల్లోని గడ్చిరోలి, బీజాపూర్, నారాయణపూర్, సుక్మా, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల పోలీసులతో ఎప్పటికప్పుడు మావోయిస్టుల సంచారంపై సమాచారాన్ని తెలుసుకుంటూ గాలింపు చర్యలు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు, కన్నెపల్లి పంప్‌హౌస్, గ్రావిటీ కెనాల్ పనుల వద్ద మహదేవపూర్ సీఐ రంజిత్‌కుమార్, కాటారం సీఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా అటవీ గ్రామాల్లో పోలీసుల గాలింపు చేపట్టడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అడవిబిడ్డలు ఆందోళన చెందుతున్నారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ఎన్‌హెచ్–163 పై పేలుడు పదార్థాలున్నట్లు అనుమానం ఏటూరునాగారం(ములుగు) : ఏజెన్సీలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం ప్రధాన రహదారులు, హైదరాబాద్ టు ఛత్తీస్‌గఢ్ 163–జాతీయ రహదారికి ఇరువైపులా బాంబ్ స్క్వాడ్ బృందం సోమవారం తనిఖీలు చేపట్టింది. చత్తీస్‌గఢ్ వెళ్లే జాతీయ రహదారి ఏటూరునాగారం తాళ్లగడ్డ నుంచి ముల్లకట్ట బ్రిడ్జి వరకు ఉన్న 13 కిలోమీటర్ల మేర మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేశారు. మావోయిస్టులు మందుపాతరలు పెట్టారనే అనుమానంతో ట్రాక్టర్ బ్లేడ్ బండి ద్వారా ఫ్లవ్ వేసి పరిశీలించారు. తుపాకులగూడెం వెళ్లే రోడ్లను సైతం పోలీసులు పరిశీలించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీల్లో సీఐ సత్యనారాయణ, ఎస్సై సాంబమూర్తి, బాంబ్ స్క్వాడ్ బృందం పాల్గొన్నారు. -
మావోలకు మరో ఎదురు దెబ్బ
చర్ల/మల్కన్‌గిరి: మావోయిస్టులు వరుస నష్టాలు చవిచూస్తున్నారు. తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన సందర్భంగా పలువురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు గుర్తించిన అక్కడి పోలీసు యంత్రాంగం.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం ఉదయం బిజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మరిమల అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులు పోలీస్ బలగాలపైకి కాల్పులు జరిపారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో .. ఇద్దరు పురుషులు, ఆరుగురు మహిళా మావోయిస్టులు చనిపోగా మిగతా వారు పరారయ్యారు. ఘటన స్థలం నుంచి ఒక ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, రివాల్వర్‌తోపాటు నాలుగు ఎస్‌బీబీఎస్ తుపాకులు, ఆరు రాకెట్ లాంచర్లు, ఆరు గ్రనేడ్లు, పది కిట్ బ్యాగులు, నాలుగు జతల ఆలివ్ గ్రీన్ దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను హెలికాప్టర్లో బిజాపూర్ ఆస్పత్రికి తరలించారు. గాలింపు చర్యల్లో తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. -
సరిహద్దులోభయం.. భయం
ముంచంగిపుట్టు(అరకులోయ): ఆంధ్రఒడిశా సరిహద్దు ప్రాంతంలో మళ్లీ యుద్ధ వాతవారణం నెలకొంది. ఇటీవల కొన్ని రోజుల పాటు పోలీసులు ఏవోబీలో కూంబింగ్‌ను నిలిపివేశారు. దీంతో గిరిజనులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే వారి ఆనందం ఎంతోకాలం నిలువలేదు. ఇటు ఆంధ్ర, అటు ఒడిశా పోలీసులు మళ్లీ కూంబింగ్ మొదలు పెట్టారు. దీంతో సరిహద్దు గ్రామాలు భీతిల్లుతున్నాయి. ఇటుకల పండుగను ఆనందోత్సాహాల మ ధ్య జరుపుకోవలసిన గిరిజనులు తీవ్రభయాందోళనల మధ్య గడుపుతున్నారు. పండుగ అనవాయి తీలో భాగంగా గిరిజనులు వారం రోజుల పాటు అడవిలోకి వేటకు వెళ్లాలి. అయితే ఈ సమయంలో అడవిలోకి వెళ్లితే ప్రాణాలపై ఆశవదులుకోవలసి వస్తుందన్న భయంతో వారు వేట వినోదానికి స్వస్తి చెప్పారు. బుధవారం రాత్రి ముంచంగిపుట్టు మండల కేంద్రం మీదుగా భారీగా పోలీసు బలగాలు ఏవోబీ వైపు కదలాయి.అలాగే ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా నుంచి సరిహద్దు వైపు ఒడిశా పోలీసులు సైతం కూంబింగ్ చేస్తూ వస్తున్నారు. ఆంధ్ర ఒడిశా పోలీసులు కూంబింగ్‌ను మొదలుపెట్టి ఏవోబీని జల్లెడ పడుతున్నాయి. కొన్ని రోజులుగా సరిహద్దులో మావోయిస్టులు కార్యకాలపాలు అధికమయ్యాయి. భారీగా విధ్వంసానికి పాల్పపడవచ్చన్న నిఘా వర్గాల సమచారంతో పోలీసులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. రంగబయలు,బుంగాపుట్టు,భూసిపుట్టు పంచాయతీల్లో పలు గ్రామాలకు రోడ్లు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణానికి వినియోగించే జేసీబీలు, ఇతర యంత్రాలను మావోయిస్టులు దహనం చేయవచ్చని భావించిన పోలీసు బలగాలు ఏవోబీలో మోహరించినట్టు సమచారం.అలాగే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజాపుర్ సుక్మ జిల్లాలో మావోయిస్టులు వరుస అలజడులు సృష్టించి, అక్కడి నుంచి వచ్చి ఏవోబీ లో తలదాచుకున్నారని అనుమానిస్తున్న పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. దీంతో ఈ సీజన్లో ఇటుకల పండుగతో సందడి ఉండవలసిన గిరిజన గ్రామాలు భయాందోళనల మధ్య మగ్గిపోతున్నాయి. ఎవరూ గ్రామాలను విడిచి బయటకు రావడం లేదు. బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. -
టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై స్మగ్లర్ల దాడి
చంద్రగిరి: మండలంలోని నరసింగాపు రం అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున కూంబింగ్ చేపట్టిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై ఎర్ర స్మగ్లర్లు దాడికి దిగారు. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఆరుగురు దుండగులు పారిపోయారు. ఆర్ఎస్ఐ భాస్కర్ కథ నం మేరకు.. ఎర్రచందనం చెట్లు నరికేం దుకు స్మగ్లర్లు శేషాచలం అడవిలోకి వెళుతున్నట్టు ఐజీ కాంతారావుకు సమాచా రం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఆర్ఎస్ఐ భాస్కర్ తన బృందంతో కలిసి నరసింగాపురం అటవీ ప్రాంతంలో కూం బింగ్ చేపట్టారు. ఏడుగురు స్మగ్లర్లు నిత్యావసర సరుకులను తీసుకుని అడవిలోకి వెళుతున్నట్టు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిం చారు. నలుగురు అధికారులు మాత్రమే ఉన్నట్టు పసిగట్టిన స్మగ్లర్లు వారి వద్ద ఉ న్న ఆయుధాలతో తిరగబడ్డారు. అధి కారులు చాకచక్యంగా వ్యవహరించి ఒక స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకుని నిత్యా వసర వస్తువులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు పారిపోయారు. వారి కోసం గాలిస్తున్నారు. తప్పిన ముప్పు పారిపోతున్న కూలీలను పట్టుకునేం దుకు అధికారులు వారిని వెంబడించా రు. ఆ ప్రాంతంలో మూడు అడుగుల ఎత్తులో విద్యుత్ తీగలు ఉండడాన్ని గమనించి ఆగిపోయారు. దీంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. తీగలను గుర్తించకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అధికా రులు తెలిపారు. అధికారులపై కూలీలు దాడికి దిగినట్లు తెలుసుకున్న ఐజీ కాంతారావు అక్కడికి చేరుకుని సమీక్షిం చారు. ఐజీ మాట్లాడుతూ చీకట్లో విద్యుత్ తీగలకు తగిలి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేదన్నారు. అనంతరం సిబ్బందిని ఆయన అభినందించారు. తనకు ముగ్గురు ఆడపిల్లలని నిందితుడు సేలం జిల్లాకు చెందిన ఆండి తెలిపాడు. తనకు డబ్బు ఆశను చూపి ఇక్కడికి తీసుకొచ్చి నట్లు పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ హరినాథ్ బాబు, ఎఫ్ఆర్ఓలు ప్రసాద్, లక్ష్మీపతి, ఎసిఎఫ్ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. వాహనం సహా ఎర్రచందనం దుంగలు స్వాధీనం తిరుపతి మంగళం : అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తిరుపతి స్ట్రైకింగ్ ఫోర్సు అధికారులు తెలపారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) జగదీష్ చంద్రప్రసాద్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు గురువారం తెల్లవారుజామున స్ట్రైకింగ్‌ఫోర్సు అధికారులు రేణిగుంట–పుత్తూరు హైవే గాజులమండ్యం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న మారుతీ జెన్ కారును ఆపారు. వాహనంలోని స్మగ్లర్లు పోలీసులను గమనించి పారిపోయారు. కారులో పరిశీలించగా 8 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. కారుతో సహా దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. వాటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎఫ్‌బీవో ఎం.మూనియానాయక్, స్ట్రైకింగ్ ఫోర్సు సిబ్బంది మురళి, పి.మూర్తి, జేసీ నారాయణ, నరసింహులు, శంకర్‌నాయక్ పాల్గొన్నారు. -
టాస్క్‌ఫోర్స్ పోలీసులపై స్మగ్లర్ల రాళ్లదాడి
సాక్షి, కాశీనాయన/ చంద్రగిరి : వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ళ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నల్లమల అడవుల్లోను, చిత్తూరు జిల్లా నాగపట్ల ఈస్టు బీట్ పరిధిలోని శేషాచల అటవీ ప్రాంతం శ్రీవారిమెట్టు వద్ద పోలీసులు పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. బుధవారం అర్థరాత్రి కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్లతో దాడి చేసి పారిపోయారు. ఈ సంఘఠనలో ఒక కానీస్టేబుల్ గాయపడ్డాడు. దాడిచేసినవారిపై పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ సందర్భంగా 47 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు ఎర్రచందనం కూలీలు పోలీసుల అదుపులో ఉన్నట్లు చెబుతున్నారు. ఆర్ఎస్సై వాసు, డీఆర్వో పీవీఎన్.రావు బృందం బుధవారం అర్ర్థరాత్రి నాగపట్ల ఈస్టు బీట్ పరిధిలోని శేషాచల అటవీ ప్రాంతం శ్రీవారిమెట్టు వద్ద కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో తమిళనాడు జావాదిమలైకు చెందిన మురుగన్ అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. తాను ఎర్రచందనం కూలీలకు పైలట్‌గా వచ్చానని అతను చెప్పడంతో, అతన్ని తీసుకుని శ్రీవారిమెట్టు మార్గంలోని పంప్‌హౌస్ సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. కూలీలు దుంగలు మోసుకొస్తూ కనిపించడంతో అధికారులు వారిపై దాడులు చేశారు. కూలీలు వారి వద్దనున్న కర్రలు, రాళ్లతో ఎదురుదాడికి దిగారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ చేతికి గాయమైంది. దాంతో అధికారులు గాల్లో కాల్పులు జరపగా, ఎర్రకూలీలు అటవీ ప్రాంతంలోకి పరుగులు పెట్టారు. చివరకు తమిళనాడు తిరువణ్ణామలైకు చెందిన చిన్నప్పయ్య, స్వామినాథన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు జిల్లాల పరిధిలో ఎర్ర కూలీల నుంచి సుమారు 47 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దాడిలో గాయపడ్డ పీసీ లక్ష్మీనారాయణకు మెరుగైన వైద్యంకోసం తిరుపతి రుయాకు తరలించారు. -
ఇద్దరు కూలీలు అరెస్ట్: ఎర్రచందనం స్వాధీనం
కడప : రైల్వేకోడూరు మండలం పుల్లగూరపెంట అటవీ ప్రాంతంలో బుధవారం పోలీసులు, టాస్క్‌పోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని గమనించిన... ఎర్రచందనం తమిళ కూలీలు.. వారిపై గొడ్డళ్లతో దాడికి యత్నించారు. ఆ క్రమంలో పోలీసులు వెంటనే స్పందించి... తమిళ కూలీల దాడిని అడ్డుకుని.. ఇద్దరు కూలీలను అరెస్ట్ చేశారు. మరో 21 మంది కూలీలు అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ సందర్భంగా 20 లక్షల విలువు చేసే ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అరెస్ట్ చేసిన ఇద్దరు ఎర్రచందనం కూలీలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సరిహద్దులో నిరంతర గస్తీ
–ఎస్పీ బ్రహ్మారెడ్డి పాతపట్నం : ఒడిశా సరిహద్దులోని ఆంధ్రా ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి వెనుక ఉన్న ఒడిశా నేరగాళ్లపై నిఘా పెట్టినట్లు ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి అన్నారు. శనివారం పాతపట్నం çసర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో చోరీలతో పాటు గుట్కా, గంజాయి, ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆంధ్రా ప్రాంతాల్లో నేరాలు చేసిన వారు పోలీసులకు చిక్కకుండా కొంతకాలం ఒడిశాలో తిరుగుతున్నారని చెప్పారు. అనంతరం ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పోలీస్ చెక్‌పోస్టును పరిశీలించారు. ఒడిశా నుంచి రాకపోకలు సాగించే వాహనాలను తప్పనిసరిగా తనిఖీచేయాలని ఎస్ఐ సురేష్‌బాబును ఎస్పీ ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీలు వివేకానంద, సీహెచ్.ఆదినారాయణ, ట్రైనీ ఎస్ఐలు పి.మనోజ్, జె.సురేష్, ఏఎస్ఐ శివాజీరెడ్డి ఉన్నారు. -
గాలిలోకి కాల్పులు
కడప అర్బన్ : వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు పోలీసు స్టేషన్ పరిధిలో కంజిమడుగు అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు తమిళ కూలీలను అరెస్టు చేసి 40 ఎర్రచందనం దుంగలు, పెద్ద ఎత్తున గొడ్డళ్లు, ఆహార సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఓఎస్డీ (ఆపరేషన్స్) సత్య ఏసుబాబు కథనం మేరకు.. అటవీశాఖ టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున కంజిమడుగు అటవీ ప్రాంతంలో 40 మంది తమిళ కూలీలు గొడ్డళ్లలతో ఎర్రచందనం చెట్లను నరికేందుకు ప్రయత్నిస్తూ స్పెషల్ పార్టీ పోలీసులకు తారసపడ్డారు. వెంటనే వారు స్పెషల్ పార్టీ పోలీసులపై గొడ్డళ్లను విసురుతూ రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు నాలుగు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఇద్దరు తమిళ కూలీలు పోలీసులకు పట్టుబడగా మిగిలిన వారు పారిపోయారు. సంఘటన స్థలం నుంచి 40 ఎర్రచందనం దుంగలు, భారీగా గొడ్డళ్లను, ఆహార సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కూంబింగ్ : ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి: చిత్తూరు జిల్లా బాకారాపేట శ్యామల రేంజ్ అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 37 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కూంబింగ్ కొనసాగుతుంది. ఈ కూంబింగ్‌కి టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు నేతృత్వం వహిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 30 లక్షలు ఉంటుందని టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.