ఏవోబీలో ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ సన్నద్ధం
మావోయిస్టుల కదలికలపై డ్రోన్ల నిఘా
ఏవోబీ అంతటా శాటిలైట్ మ్యాపింగ్
జీపీఎస్ ట్రాకింగ్‌ద్వారా భద్రతా దళాల కూంబింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల్ని ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. అందుకోసం మరింత విస్తృతంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సమాయత్తమైంది. ప్రధానంగా ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం దాదాపు లేదు. కానీ మన రాష్ట్ర సరిహద్దులకు అవతల ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టులకు ఇంకా పట్టుండటంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం సదా అప్రమత్తంగా ఉంటోంది.
ఇక ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపునిస్తారని పోలీసు శాఖ భావిస్తోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు తెగబడే అవకాశం ఉందని, ఉనికి చాటుకునేందుకైనా ఎక్కడో ఒకచోట పోలింగ్‌ను భగ్నం చేసేందుకు యత్నించవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో మన రాష్ట్రంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అందుకే ఏవోబీలోని మారుమూల గ్రామాలు, గూడేల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తొలిసారిగా వాడుకోనుంది.
♦ ఏవోబీలో పోలింగ్ నిర్వహణ కోసం డ్రోన టెక్నాలజీని తొలిసారిగా వినియోగించాలని నిర్ణయించింది. జమ్ము–కశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టేందుకు ఉపయోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీని తొలిసారిగా ఈ ఎన్నికల కోసం ఏవోబీలో ప్రవేశపెట్టనుంది.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పోలీసు నిఘా విధుల కోసం డ్రోన్లను ఉపయోగించనున్నారు. మొత్తం ఏవోబీ అంతా నిఘా పెట్టేందుకు అవసరమైన డ్రోన్లను ఇప్పటికే పోలీసు శాఖ తెప్పించింది. ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. మావోయిస్టులు, అనుమానితుల కదలికలపై ఈ డ్రోన్లతో నిఘా పెట్టనున్నారు.
♦ ఏవోబీ ప్రాంతాన్ని ప్రత్యేకంగా శాటిలైట్ మ్యాపింగ్ చేసేందుకు పోలీసు శాఖ కార్యాచరణ చేపట్టింది. గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించేందుకు నిర్వహించిన ‘ఆపరేషన్ పరివర్తన్’ కోసం గతంలో పోలీసు శాఖ ఎంపిక చేసిన ప్రాంతాలను శాటిలైట్ మ్యాపింగ్ చేసింది. ఈసారి మొత్తం ఏవోబీ ప్రాంతాన్ని శాటిలైట్ మ్యాపింగ్ చేయాలని నిర్ణయించింది.
ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉన్న ప్రధాన మార్గాలు, అడ్డదారులు, డొంకదారులతోసహా మొత్తం ప్రాంతాన్ని శాటిలైట్ మ్యాపింగ్ చేయనున్నారు. తద్వారా మావోయిస్టులు ఏపీలోకి ప్రవేశించేందుకు యత్నిస్తే వెంటనే గుర్తించి పోలీసు బలగాలను అప్రమత్తం చేయవచ్చని పోలీసు శాఖ భావిస్తోంది.
♦ ప్రశాంత పోలింగ్ నిర్వహించేందుకు ఏవోబీ అంతటిని పోలీసు, గ్రేహౌండ్స్ బలగాలు జల్లెడ పట్టనున్నాయి. అందుకోసం ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. కూంబింగ్‌లో ఉన్న పోలీసులపై మావోయిస్టులు దొంగదెబ్బ తీయకుండా ఆధునిక జీపీఎస్ టెక్నాలజీని వారికి అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం పోలింగ్ విధుల కోసం ఏవోబీలో మోహరించే భద్రతా బలగాలు కూడా అదే జీపీఎస్ టెక్నాలజీని వినియోగించుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment