
సాక్షి, తాడేపల్లి: ఏపీలో స్కీములు లేవు కానీ.. స్కాములు మాత్రం విచ్చలవిడిగా ఉన్నాయంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు. ఇసుక, మట్టి, లిక్కర్, మైనింగ్, రాజధాని పనుల్లో సైతం అవినీతి విలయ తాండవం చేస్తోందన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు వారి సన్నిహితులకు కారుచౌకగా భూములు కట్టబెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కనీసం ఒక టీ కంటే తక్కువ ఖర్చుకు భూములు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు.
అమరావతిలో జి+1 బిల్డింగ్‌లు కట్టేందుకు అధిక ధరలకు తన అనుంగులకు చంద్రబాబు కట్టబెట్టారు. వారి ద్వారా హైదరాబాద్‌లో ఒక బిల్డింగ్, మంగళగిరిలో పార్టీ కార్యాలయం కట్టించుకున్నారు. టెక్నాలజీ కంపెనీల పేరుతో చంద్రబాబు తన మనుషులకు భూములు దోచిపెడుతున్నాడు. ఊరూ పేరులేని ఉర్సా కంపెనీకి 3 వేల కోట్ల ఖరీదైన భూమిని కట్టబెట్టారు. ఏం అర్హత ఉందని... ఉర్సాకు 59.65 ఎకరాలు కేటాయించారు’’ అంటూ శివశంకర్‌రెడ్డి నిలదీశారు.
2024 సెప్టెంబర్ 27వ తేదీన అమెరికాలో ఉర్సా కంపెనీ రిజిస్టర్ అయ్యింది. అక్టోబర్‌లో లోకేష్ పర్యటన తర్వాత పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ఓ కథ అల్లారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన భారత దేశంలో ఉర్సా కంపెనీ రిజిస్టర్ చేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇంటిలో ఉర్సా కంపెనీ కార్యాలయం ఉంది. పది లక్షల రూపాయల మూలధనం పెట్టుబడితో ఉర్సా కంపెనీ పెట్టారు. అరసెంటు భూమి కూడా కేటాయించే అర్హత కూడా ఉర్సాకు లేదు. ఆఫీస్ కూడా లేని ఉర్సాకు మూడువేల కోట్ల రూపాయలు భూములు కట్టబెడతారా?’ అంటూ శివశంకర్‌రెడ్డి ప్రశ్నించారు.
21st సెంచ్యూరీ కంపెనీ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి పారిపోయిన వ్యక్తులు అబ్బూరి సతీష్. ఉర్సా కంపెనీ కేటాయింపులపై ఇంత రచ్చ నడుస్తుంటే ప్రభుత్వం, సీఎం, మంత్రులు ఎందుకు స్పందించరు?. ప్రభుత్వానికి బదులు ఉర్సా కంపెనీ ప్రతిధులు ఎలా సమాధానం చెబుతారు?. ప్రైవేట్ కంపెనీని టీడీపీ పార్టీ ఎందుకు భుజాన వేసుకుంటుంది?. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకోవడం దేనికి?. మూడు వేల కోట్ల రూపాయలు భూములు కేటాయింపులో ఎవరెవరికి ఎంత వాటాలు వెళ్లాయి? ఈ వాటాల లెక్కలు తేలాల్సిందే’’ అని శివశంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఉర్సాకు భూముల కేటాయింపు అతిపెద్ద కుంభకోణం. ఉర్సా భూ కుంభకోణం పై సీబిఐతో విచారణ జరిపించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. భవిష్యత్తు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీఎండీసీ 9 వేల కోట్ల రుణంతీసుకున్నారు. రోడ్లను సైతం ప్రైవేట్ పరం చేస్తోంది. రాజధానిలో ప్రజల సొమ్ముతో చంద్రబాబు ఐదెకరాల్లో ఇల్లు కట్టుకుంటున్నారు’’ అని శివశంకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.