ఆపరేషన్ యాంటీ మావోయిస్టులో భాగంగా కూంబింగ్
బస్తర్ ఎన్‌కౌంటర్‌లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన రావ్‌ఘాట్ ఏరియా కమిటీ
మృతుల్లో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు
తెలంగాణకు చెందిన సిరిపల్లె సుధాకర్ దంపతులతో పాటు 9 మంది గుర్తింపు
మృతి చెందిన మావోయిస్టుల్లో గుర్తించింది వీరినే..
1. సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ రావు (మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్),
డీవీసీ మెంబర్, నార్త్ బస్తర్ మాస్ ఇన్‌చార్జి, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె
2. దాశశ్వర్ సుమన అలియాస్ రజిత, డీసీఎస్, సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ భార్య,
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు
3. లలిత, డీవీసీ మెంబర్, జన తన సర్కార్ కమిటీ ఇన్‌చార్జి
4. మాధవి, నార్త్ బస్తర్ మెంబర్ 5. జగ్ను అలియాస్ మాలతి, పర్థాపూర్ ఏరియా కమిటీ
6. రాజు సలామ్ అలియాస్ సుఖాల్, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్
7. వెల సోను అలియాస్ శ్రీకాంత్ సోను, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్
8. రాణిత అలియాస్ జయమతి, రూపి, ప్రాగ్ ఎల్వోసీ కమాండర్
9. రామ్ షీలా, నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: పక్కాగా అందిన సమాచారం, పకడ్బందీ వ్యూహం నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సోమవారం సాయంత్రం పోలీస్ ఇన్‌ఫార్మర్ పేరిట కాంకేర్ జిల్లాలో ఒకరిని హతమార్చిన మావోయిస్టులు.. అదే ప్రాంతంలో సమావేశం అయ్యారన్న సమాచారంతో బలగాలు ప్రత్యేక వ్యూహంతో కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లోనే 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. వీరిలో 15 మంది మహిళలు కాగా, 14 మంది పురుషులు ఉన్నారు.
ఘటనా స్థలంలో ఏకే–47, ఎల్‌ఎంజీ, ఇన్‌సాస్ లాంటి అత్యాధునిక ఆయుధాలను స్వాదీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్, కాంకేర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంద్ర కళ్యాణ్ ఎల్లిసెల బుధవారం రాత్రి వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వారు తెలియజేశారు. ఇప్పటివరకు 9 మంది మావోయిస్టులను గుర్తించామన్నారు.
మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురానికి చెందిన సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్‌రావు ఉన్నట్లు భావించామని, అయితే బుధవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్ అలియాస్ మురళి, అలియాస్ శంకర్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. ఆయనతో పాటు ఇప్పటివరకు గుర్తించిన మొత్తం 9 మంది పేర్లను తెలిపారు. మిగతా వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు.
ఆపరేషన్ యాంటీ మావోయిస్టులు
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఆపరేషన్ యాంటీ మావోయిస్టులు పేరిట ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు గతంలోనే కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అందిన సమాచారం మేరకు.. మంగళవారం ఉదయం నుంచి కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులు (డీఆర్జీ), కేంద్ర భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు బుధవారం ప్రకటించారు. లోక్‌సభ మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఈనెల 19న 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
ఇందులో దండకారణ్య ప్రాంతంలోని బస్తర్, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి స్థానాలు కూడా ఉన్నాయి. ఎన్‌కౌంటర్ జరిగిన కాంకేర్ పార్లమెంట్ స్థానానికి రెండో విడతలో ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో నెల రోజులుగా నిఘా వేసిన పోలీసు వర్గాలకు అందిన పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టగా ఎన్‌కౌంటర్ జరిగినట్లు చెబుతున్నారు. మృతి చెందిన వారిలో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ పోలీసుల దృష్టిలో మోస్ట్ వాంటెడ్‌లుగా ఉన్న పలువురు టాప్ కమాండర్లు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.
నాలుగైదు రోజుల ముందే అగ్రనేతలు, ఆర్‌కేబీ డివిజన్ కమిటీ ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన నేపథ్యంలో రావ్‌ఘాట్ ఏరియా కమిటీ (పర్థాపూర్)మాత్రమే ఛోటె బెటియా పోలీసుస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయి పోలీసుల ఎదురుకాల్పుల్లో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినట్లు సమాచారం.
ముగిసిన 25 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం
చిట్యాల: విప్లవ గీతాలకు ఆకర్షితుడై 25 ఏళ్లక్రితం అడవి బాటపట్టిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ విగతజీవుడై గ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. సిరిపెల్లి రాజపోశమ్మ–ఓదెలు దంపతుల కుమారుడు సుధాకర్ 1996లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తరువాత లొంగిపోయి జైలు జీవితం గడిపాడు.
1998లో మళ్లీ అడవి బాట పట్టాడు. దళ సభ్యుడి నుంచి నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, అనంతరం శంకర్ పేరుతో ఛత్తీస్‌గఢ్ ఏరియాలో జిల్లా కార్యదర్శిగా ఎదిగాడు. సుధాకర్ తండ్రి చనిపోగా, తల్లి వృద్ధాప్యంలో ఉంది. బస్తర్ ఎన్‌కౌంటర్‌లో సుధాకర్ చనిపోయాడని తెలియడంతో తల్లి, బంధువులు ఛత్తీస్‌గఢ్ వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. సుధాకర్ భార్య సుమన మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించినట్లు తెలిసింది.
ఎన్‌కౌంటర్ మృతుల్లో చిన్నన్న లేడు
ధ్రువీకరించిన సోదరులు
ఆత్మకూరు రూరల్: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మరణించిన 29 మంది మావోయిస్టుల్లో ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్‌రావు, అలియాస్ నాగన్న అలియాస్ విజయ్ కూడా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే స్థానిక పోలీసులు చూపించిన ఎన్‌కౌంటర్ మృతుల ఫొటోల్లో చిన్నన్న లేడని ఆయన సోదరులు ధ్రువీకరించారు.
సుగులూరి చిన్నన్న 1996లో అప్పటి పీపుల్స్‌వార్‌లో పూర్తికాల సభ్యుడిగా చేరారు. తొలుత కర్నూలు జిల్లాలో అప్పటి భవనాసిదళం సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన..2006 తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలోకి వెళ్లినట్లు సమాచారం. తదనంతర కాలంలో దండకారణ్యం స్పెషల్ జోనల్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాజ్‌నంద్‌గావ్–కాంకేర్ డివిజన్ కార్యదర్శిగా విజయ్ పేరుతో కొనసాగుతున్నట్లు పోలీసు రికార్డుల ఆధారంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment