దండకారణ్యంలో గాలింపు చర్యలకు తరలివెళ్తున్న కేంద్ర బలగాలు
ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్..
16 మంది మావోయిస్టులు మృతి
మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి.. కీలక నేతలు ఉన్నట్టు ప్రచారం
సోమవారం ఉదయమే మొదలైన ఎన్‌కౌంటర్.. దశల వారీగా ఎదురుకాల్పులు
తొలిరోజున ఇద్దరు..రెండో రోజు 14 మంది మృతదేహాలు లభ్యం
ఇంకా కొనసాగుతున్న బలగాల కూంబింగ్
25 నుంచి 30 మంది వరకు మావోయిస్టులు మృతిచెంది ఉండొచ్చనే అంచనాలు
కాంకేర్ ఎన్‌కౌంటర్ జరిగి వారం తిరగకముందే మరో ఎదురుదెబ్బ
చర్ల/ మల్కన్‌గిరి/ సాక్షి, పాడేరు: వరుస ఎన్‌కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18 మంది మృతి చెంది వారం తిరగకముందే.. ఛత్తీస్‌గఢ్– ఒడిశా సరిహద్దుల్లో గరియాబంద్ జిల్లా కులారీఘాట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మరణించారు. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చలపతి కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే మృతుల సంఖ్య 25 నుంచి 30 వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి తర్వాత కూడా ఎదురుకాల్పులు, కూంబింగ్ కొనసాగుతూ ఉండటంతో బుధవారం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
19వ తేదీ నుంచే కూంబింగ్..
దండకారణ్యంలోని కులారీఘాట్ అటవీ ప్రాంతంలో 60 మందికిపైగా మావోయిస్టులు సమావేశం అయ్యారన్న నిఘా వర్గాల సమాచారంతో బలగాలు రంగంలోకి దిగాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్, కోబ్రా, డి్రస్టిక్ట్ ఫోర్స్, ఒడిశాకు చెందిన ఎస్‌ఓజీ (స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్) బలగాలు ఈ నెల 19 నుంచి సరిహద్దుల్లో కూంబింగ్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో 20వ తేదీన ఉదయం పోలీసు బలగాలు, మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్‌కౌంటర్ మొదలైంది.
తొలిరోజు ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇరు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను రంగంలోకి దింపి.. సోమవారం మధ్యాహ్నం నుంచి కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. మంగళవారం తెల్లవారుజామున మళ్లీ మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. కొన్ని గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 14 మంది మృతి చెందారు. రెండు రోజుల్లో కలిపి మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 16కు పెరిగింది.
మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా– ఒడిశా బోర్డర్ (ఏఓబీ) స్పెషల్ జోనల్ కమిటీ మిలిటరీ కమిషన్ చీఫ్ చలపతి అలియాస్ ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ జయరాం ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినట్టు పోలీసులు ప్రకటించారు. ఆయనతోపాటు మరికొందరు కీలక నేతలు కూడా మృతుల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే చలపతి మృతిపై స్పష్టత ఇచ్చిన పోలీసులు మిగతా వారి వివరాలను వెల్లడించలేదు. మృతుల సంఖ్య 25 – 30 మంది వరకు పెరగవచ్చని భావిస్తున్నారు.
1,500 మంది.. 15 కిలోమీటర్ల సర్కిల్‌గా..
ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు చెందిన సుమారు 1,500 మంది పోలీసు బలగాలు కులారీఘాట్ అడవిని చుట్టుముట్టాయి. సుమారు 15–20 కిలోమీటర్ల సర్కిల్‌గా ఏర్పడి... కూంబింగ్ చేపడుతూ దగ్గరికి వచ్చాయి. సుమారు ఐదు కిలోమీటర్ల సర్కిల్‌లోకి రాగానే మావోయిస్టులు తారసపడినట్టు తెలిసింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన చలపతి సెంట్రల్ కమిటీ సభ్యుడు కావడంతో ఆయనకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది.
ముందు వరుసలో సెంట్రీలు కాపలాగా ఉంటే చివరి వరుసలో ఫీల్డ్ పెట్రోలింగ్ టీమ్ రక్షణగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య బాంబులు అమర్చి ఉంటాయి. అయితే అగ్రనేతలు ఉన్నారనే పక్కా సమాచారంతోనే భద్రతా వలయాన్ని ఛేదించుకుని బలగాలు దాడి చేసినట్టు తెలిసింది. ఘటనాస్థలంలో ఇప్పటివరకు పది వరకు ఐఈడీలను గుర్తించి తొలగించినట్టు సమాచారం.
సరిహద్దుల్లో హైఅలర్ట్!
కులారీఘాట్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఏవోబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటన జరిగిన ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఉన్న ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీస్ స్టేషన్లు, ఔట్‌పోస్టుల పరిధిలో రెడ్ అలర్ట్ అమలు చేస్తున్నారు. సరిహద్దుల్లో అదనపు బలగాలను రంగంలోకి దింపి కూంబింగ్ చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాలతోనూ నిఘా పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment