గంజాయి జోరు
⇔జిల్లా అంతటా విస్తరిస్తున్న గంజాయి విక్రయాలు
⇔ఒడిశా సరిహద్దు జిల్లాల నుంచి రవాణా..?
⇔పట్టనట్లు వ్యవహరిస్తున్న పోలీస్, ఎక్సైజ్ అధికారులు
⇔తూతూ మంత్రంగా కేసుల నమోదు
ఒంగోలు క్రైం: జిల్లాలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం షాపుల జోరు, బెల్ట్ షాపుల హుషారుతో ఉన్న ఎక్సైజ్ అధికారులు గంజాయి విక్రయాలు జిల్లా నలుమూలలా విస్తరించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఒంగోలు నగరంతోపాటు మున్సిపాలిటీలు, ప్రధాన మండల కేంద్రాల్లోనూ గంజాయి జోరుగా లభ్యమవుతోంది. అయినా అటు పోలీసులుకాని ఇటు ఎక్సైజ్ అధికారులుకాని సరఫరా అవుతున్న మూలాలపై దృష్టి సారించటంలేదు.
రైల్వే రూట్లో...
రైల్వే లైన్లు ఉన్న చీరాల–గూడూరు లైన్లోనూ, వినుకొండ–మార్కాపురం లైన్లోనూ విచ్చలవిడిగా విక్రయాలు సాగుతున్నాయి. ఎప్పుడో ఒకసారి ఉన్నతాధికారులు గంజాయి విక్రయాలపై కఠినంగా అడిగినప్పుడు మాత్రం నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. రైల్వే లైన్లలోని రైల్వే స్టేషన్లు ఉండే గ్రామాలు, పట్టణాలతో పాటు జాతీయ రహదారి వెంట ఉన్న పట్టణాలు, మండల కేంద్రాల్లోనూ గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. ఒడిశా సరిహద్దు జిల్లాల నుంచి వేర్వేరు ప్రాంతాలకు రవాణా అవుతున్నట్టు సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలిసినా చేతులు తడుపుకొని తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.
నగరం నడిబొడ్డున గంజాయి స్వాధీనం..
గత ఏడాది ఒంగోలు నగరంలోని సీవీఎన్ రీడింగ్ రూములో పేకాట అనుమతి తెచ్చుకొని నిబంధనలకు విరుద్దంగా కోతముక్క ఆడిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అప్పట్లో దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో సీవీఎన్ రీడింగ్ రూములోనే కేజీకి పైగా గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపింది. జిల్లా కేంద్రం ఉన్న క్లబ్‌లోనే గంజాయి దొరికిందంటే ఇక చాటుమాటుగా ఏస్థాయిలో గంజాయి విక్రయాలు జోరందుకుంటున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
నాలుగేళ్లలో 32 కేసుల నమోదు..
గత నాలుగేళ్లలో ఎక్సైజ్ అధికారులు 32 గంజాయి కేసులు నమోదు చేశారు. 285 కేజీల ఎండిపోయిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 33 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 2013–14లో గిద్దలూరు ప్రాంతంలో సాగుచేసిన గంజాయి తోటపై దాడి చేసిన ఎక్సైజ్ పోలీసులు 2,108 మొక్కలను ధ్వంసం చేశారు. పొలం యజమానిని అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు 2015లో నాలుగు గంజాయి కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. 37 కేజీల ఎండిపోయిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2016లో ఏడు గంజాయి కేసులు నమోదు చేశారు. 30 మందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా 700 గ్రాముల నల్లమందు స్వాధీనం చేసుకొని దానిని సరఫరా చేస్తున్న ఇరువురిని అరెస్ట్ చేసి, రెండు కేసులు నమోదు చేశారు.