దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల ఘటనలో సీఆర్పీఎఫ్ 165వ బెటాలియన్ ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి వీరమరణం పొందగా రాము అనే కానిస్టేబుల్ గాయపడ్డారు. జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో బద్రేలోని సీఆర్పీఎఫ్ క్యాంపు నుంచి ఉర్సంగల్ వైపు జవాన్లు కూంబింగ్ సాగిస్తున్నారు.
ఈ సందర్భంగా మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్సై సుధాకర్‌రెడ్డి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. సుధాకర్‌రెడ్డి సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు. ఈ నెలలో బస్తర్ డివిజన్‌లో మావోయిస్టుల సంబంధిత ఘటనల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా ఏడుగురు గాయపడ్డారు. 13న నారాయణ్‌పూర్ జిల్లా మావోయిస్టుల దాడిలో ఒక జవాను, 14న కాంకేర్ జిల్లా నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి మరో బీఎస్‌ఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment