గాలిలోకి కాల్పులు
కడప అర్బన్ :
వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు పోలీసు స్టేషన్ పరిధిలో కంజిమడుగు అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు తమిళ కూలీలను అరెస్టు చేసి 40 ఎర్రచందనం దుంగలు, పెద్ద ఎత్తున గొడ్డళ్లు, ఆహార సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఓఎస్‌డీ (ఆపరేషన్స్) సత్య ఏసుబాబు కథనం మేరకు.. అటవీశాఖ టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున కంజిమడుగు అటవీ ప్రాంతంలో 40 మంది తమిళ కూలీలు గొడ్డళ్లలతో ఎర్రచందనం చెట్లను నరికేందుకు ప్రయత్నిస్తూ స్పెషల్ పార్టీ పోలీసులకు తారసపడ్డారు. వెంటనే వారు స్పెషల్ పార్టీ పోలీసులపై గొడ్డళ్లను విసురుతూ రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు నాలుగు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఇద్దరు తమిళ కూలీలు పోలీసులకు పట్టుబడగా మిగిలిన వారు పారిపోయారు. సంఘటన స్థలం నుంచి 40 ఎర్రచందనం దుంగలు, భారీగా గొడ్డళ్లను, ఆహార సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.