కూంబంగ్‌కు వెళుతున్న పోలీసు బలగాలు (ఫైల్)
ముంచంగిపుట్టు(అరకులోయ): ఆంధ్రఒడిశా సరిహద్దు ప్రాంతంలో మళ్లీ యుద్ధ వాతవారణం నెలకొంది. ఇటీవల కొన్ని రోజుల పాటు పోలీసులు ఏవోబీలో కూంబింగ్‌ను నిలిపివేశారు. దీంతో గిరిజనులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే వారి ఆనందం ఎంతోకాలం నిలువలేదు. ఇటు ఆంధ్ర, అటు ఒడిశా పోలీసులు మళ్లీ కూంబింగ్ మొదలు పెట్టారు. దీంతో సరిహద్దు గ్రామాలు భీతిల్లుతున్నాయి. ఇటుకల పండుగను ఆనందోత్సాహాల మ ధ్య జరుపుకోవలసిన గిరిజనులు తీవ్రభయాందోళనల మధ్య గడుపుతున్నారు. పండుగ అనవాయి తీలో భాగంగా గిరిజనులు వారం రోజుల పాటు అడవిలోకి వేటకు వెళ్లాలి. అయితే ఈ సమయంలో అడవిలోకి వెళ్లితే ప్రాణాలపై ఆశవదులుకోవలసి వస్తుందన్న భయంతో వారు వేట వినోదానికి స్వస్తి చెప్పారు. బుధవారం రాత్రి ముంచంగిపుట్టు మండల కేంద్రం మీదుగా భారీగా పోలీసు బలగాలు ఏవోబీ వైపు కదలాయి.అలాగే ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా నుంచి సరిహద్దు వైపు ఒడిశా పోలీసులు సైతం కూంబింగ్ చేస్తూ వస్తున్నారు.
ఆంధ్ర ఒడిశా పోలీసులు కూంబింగ్‌ను మొదలుపెట్టి ఏవోబీని జల్లెడ పడుతున్నాయి. కొన్ని రోజులుగా సరిహద్దులో మావోయిస్టులు కార్యకాలపాలు అధికమయ్యాయి. భారీగా విధ్వంసానికి పాల్పపడవచ్చన్న నిఘా వర్గాల సమచారంతో పోలీసులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. రంగబయలు,బుంగాపుట్టు,భూసిపుట్టు పంచాయతీల్లో పలు గ్రామాలకు రోడ్లు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణానికి వినియోగించే జేసీబీలు, ఇతర యంత్రాలను మావోయిస్టులు దహనం చేయవచ్చని భావించిన పోలీసు బలగాలు ఏవోబీలో మోహరించినట్టు సమచారం.అలాగే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజాపుర్ సుక్మ జిల్లాలో మావోయిస్టులు వరుస అలజడులు సృష్టించి, అక్కడి నుంచి వచ్చి ఏవోబీ లో తలదాచుకున్నారని అనుమానిస్తున్న పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. దీంతో ఈ సీజన్‌లో ఇటుకల పండుగతో సందడి ఉండవలసిన గిరిజన గ్రామాలు భయాందోళనల మధ్య మగ్గిపోతున్నాయి. ఎవరూ గ్రామాలను విడిచి బయటకు రావడం లేదు. బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment