
కురుపాం మండలం జరడ సమీపంలో గిరిశిఖరాలపై వరి సాగు
విజయనగరం, కురుపాం: గిరి శిఖరాలన్నీ చదును అవుతున్నాయి. పచ్చని సీమలుగా మారుతున్నాయి. వ్యవసాయ క్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. ఊటనీటితో దాహం తీర్చుకుంటున్నారు. సాగునీటిగా మార్చి సస్యశ్యామలం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన పంటల సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నారు. మైదాన ప్రాంత రైతుల కంటే అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
ఊటనీరే సాగు.. తాగునీరు
కురుపాం నియోజకవర్గంలో గిరి శిఖరాల నుంచి వస్తున్న ఊటనీటినే సాగునీటిగా, తాగునీటిగా వినియోగించడంలో సత్ఫలితాలు సాధిస్తున్నారు. అక్కడి ప్రకృతి సాగు గిరిపుత్రులకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యకరమైన పంటలను అందిస్తున్నాయి. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల్లో గిరిశిఖరాలపై ఉన్న గిరిజనులకు సాగునీరు, తాగునీటి కష్టాలు ఎక్కువే. అదే సమయంలో ఊటనీటినే పైపులైన్ల ద్వారా గ్రామాలకు రప్పించుకొని మైదాన ప్రాంత రైతుల కంటే మెరుగైన దిగుబడులు సాధించి ఔరా అనిపిస్తున్నారు.
కొండలను తవ్వి..
ఏజెన్సీలో పల్లపు భూములంటూ ఉండవు. పెద్ద పెద్ద డెప్పులు, రాళ్ల దిబ్బలు మాత్రమే ఉంటాయి. అలాంటి కొండలపై ఇంటిల్లిపాదీ కలిసి కొండరాళ్లను పేర్చి చిన్న చిన్న పంట పొలాలుగా తీర్చి దిద్ది వరి సాగు చేస్తుంటారు. దీనికి ఊటనీటినే సమయానుకూలంగా తరలిస్తారు. ఎలాంటి పురుగు మందులు వాడకుండా వ్యవసాయాధికారుల సూచనలు.. సలహాలనే పాటిస్తూ ప్రకృతి సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఆరోగ్యకర పంటలైన వరి, చోడి, కందులు, ఉలవలు, పెసలు, జనుములు, వలిశెలు తదితర చిరుధాన్యాలు పండించుకుంటున్నారు.