పిట్టలమెట్ట వద్ద పంట పొలాలలో సంచరిస్తున్న ఏనుగులు
విజయనగరం, గరుగుబిల్లి: ఏ క్షణంలో గజరాజులు దాడి చేస్తాయోనని మండల వాసులకు కంటిమీద కునుకు ఉండడం లేదు. కొద్ది రోజులుగా మండల పరిధిలోని పలు గ్రామాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు తాజాగా సంతోషపురం పంచాయతీ పిట్టలమెట్టలోని అరటి, చెరకు తోటల్లో తిష్ట వేశాయి. బుధవారం రాత్రి గ్రామంలోని కళ్లాల వద్దనున్న నాటుబళ్లను తిరగవేశాయి. అలాగే పంటపొలాలకు నీటి తడులు అందించేందుకు ఏర్పాటు చేసుకున్న జాయింట్ పైపులను విరిచేశాయి. దీంతో ఇక్కడ ఇళ్లపై దాడి చేస్తాయోనని ప్రజలు భీతిల్లిపోతున్నారు. నిత్యం ప్రధాన రహదారి నుంచి రాకపోకలు చేసేవారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఒక్కొక్కరు బయటకు తిరిగేందుకు భయపడుతున్నారు. ఇదిలా ఉండగా పిట్టలమెట్ట నుంచి ఏనుగులను చిలకాం మీదుగా కెల్ల తరలించేందుకు అటవీశాఖాధికారులు చేసిన ప్రయత్నాలు గురువారం ఫలించలేదు..... సరికదా ఏనుగులపై బాంబులు వేసేందుకు ప్రయత్నించిన ట్రేకర్ ( అటవీ శాఖలో ఔట్ సోర్సింగ్‌ఉద్యోగి) చేతిలో దురదృష్టవశాత్తు బాంబు పేలిపోయింది.
చేతికి గాయాలు..
ఎలిఫెంట్ ట్రేకర్ చేతికి గాయాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఫారెస్ట్ రేంజర్ ఎన్.కల్యాణముని తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గరుగుబిల్లి మండలంలోని పిట్టలమెట్టలో తిష్ట వేసిన ఏనుగుల గుంపును ఉదయం తొమ్మిది గంటల సమయంలో తరుముతుండగా ప్రమాదవశాత్తు బాంబు చేతిలో పేలడంతో వెంకటరమణ ఎడమచేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సహచర సిబ్బంది 108 వాహనం ద్వారా పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంకటరమణది శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని సొలిబి గ్రామం. – భయాందోళనలో ప్రజలు
ఏనుగులు ఈ ప్రాంతం నుంచి అటవీ ప్రాంతాలకు వెళ్లకపోవడంతో ప్రజలు నిత్యం భయాందోళన చెందుతున్నారు. కొన్ని రోజుల నుంచి తిష్టవేసిన ఏనుగులు వరిచేను, చెరుకు పంటలను నష్టపరిచాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో జియ్యమ్మవలస మండలంలో ఒకరికి, కొమరాడ మండలంలో మరొకరిని గాయపరిచాయి. రెవెన్యూ, అటవీ శాఖాధికారులు స్పందించి ఏనుగులు అటవీ ప్రాంతానికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment