వీరఘట్టం: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రైతులకు శాపంగా మారిన ఏనుగుల గుంపు సంచారం వెనుక మానవ తప్పిదాలు వెలుగు చూస్తున్నాయి. వాటి ఆవాసాలపై అక్రమార్కులు దాడులు చేస్తే అవి ప్రతిదాడులు చేస్తున్నాయి. దట్టమైన అడవుల్లో జరుగుతున్న మైనింగ్ కారణంగానే మూగ జీవాలు అభయారణ్యం నుంచి జనారణ్యంలోకి వస్తున్నాయి. ఇప్పుడు బీభత్సం సృష్టిస్తున్న ఏనుగులు గుంపుకు తోడు మరో గుంపు జిల్లా అడవుల్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా ఉండడంతో అటవీ ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలో అటవీ విస్తీర్ణం 616 చదరపు కి.మీ. ఈ అటవీ విస్తీర్ణంలో 70,350 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి భూభాగంలో 33 శాతం అడవులు ఉంటే అక్కడ సంచరించే వన్యప్రాణులకు, ప్రకృతి సంపదతోపాటు మానవాళి మనుగడకు ఎటువంటి ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మన జిల్లాలో మాత్రం అడవులు కేవలం 10 శాతం మాత్రమే ఉన్నాయి. అంటే వన్యప్రాణులు ఉండేందుకు సరైన ఆవాసాలు జిల్లా అడవుల్లో లేవని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో 11 ఏళ్లలో రెండు గుంపులుగా వచ్చిన ఏనుగులు అడవుల్లో ఉండలేక జనారణ్యంలోకి వస్తూ పంటలు నాశనం చేస్తున్నాయి.
ఇదీ పరిస్ధితి...
మన జిల్లాకు పక్కనే అతి సమీపంలో ఒడిశా రాష్ట్రంలోని లఖేరీ అటవీ ప్రాంతంలో అభయారణ్యం ఉంది. ఈ అభయారణ్యంలో వందల సంఖ్యలో ఏనుగుల గుంపులు ఉన్నట్లు గణాం కాలు చెబుతున్నాయి. ఈ అభయారణ్యం చు ట్టూ విలువైన గ్రానైట్ నిక్షేపాలు కూడా ఉన్నా యి. ఈ గ్రానైట్ నిల్వలను కొల్లగొట్టేందుకు అక్కడ మైనింగ్ మాఫియా చేపడుతున్న బాంబ్ బ్లాస్టింగ్‌ల వల్ల ఏనుగుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. చిన్న చిన్న శబ్దాలకు ఏనుగులు బెదిరిపోతాయి. బాంబు బ్లాస్టింగ్ వల్ల వచ్చే పెద్ద శబ్దాలను ఏనుగులు భరించలేవు. అందుకే భయంతో పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో అడ్డుగా వచ్చేవారని హతమారుస్తున్నాయి.
వెంటాడుతున్న గజ భయం..
సిక్కోలు ప్రజలను గజ భయం వెంటాడుతోం ది. మరో ఏనుగుల గుంపు జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు పలువురు అటవీ శా ఖ అధికారులు చెబుతున్నారు. ఒడిశా రాష్ట్రంలో ని లఖేరీ అభయారణ్యం నుంచి ఈ ఏనుగుల గుంపు విజయనగరం–శ్రీకాకుళం జిల్లాల సరి హద్దు అటవీ ప్రాంతాల గుండా ప్రవేశిస్తున్నా యి. గతంలో కూడా ఇదే ప్రాంతం నుండి వచ్చి న ఏనుగుల గుంపు ఏళ్ల తరబడి కదలకుండా తిష్టవేశాయి. ఇప్పుడు మరో గుంపు రానుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఏ మాత్రం గాని మరో ఏనుగుల గుంపు వస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పదు. మరి ఈ పరస్ధితుల నుండి గట్టెక్కే మార్గం ఉందా అంటే సమాధానం ప్రశ్నార్ధకంగా మారింది.
నిద్రావస్ధలో అటవీశాఖ..
అటవీశాఖ అధికారులు కృతనిశ్చయంతో ప్రయత్నిస్తే ప్రస్తుతం ఉన్న ఏనుగుల గుంపును తరలించవచ్చును. మరో ఏనుగుల గుంపు చొరబడకుండా చర్యలు తీసుకోవచ్చును. అయితే ఆ దిశగా ఆ శాఖ ప్రయత్నం చేస్తోందా అంటే సమాధానం చెప్పేవారే కరువయ్యారు. అయితే అటవీశాఖ అధికారులు ఏమైనా వ్యూహరచన చేస్తున్నారంటే అదీ లేదు. జిల్లాలో ఏనుగులు సంచరిస్తే ఎంతో మేలు అన్నట్లుగా ఈ శాఖ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఏనుగులను తరలించే చర్యల్లో భాగంగా పుష్కలంగా నిధులు ఖర్చు చేయవచ్చును. అడిగేవారుండరని ఏనుగులు అధికారులకు కామధేనువులుగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి
అప్రమత్తంగా ఉన్నాం..
ఐదు రోజుల క్రితం జిల్లాలో వంగర మండలంలో ప్రవేశించిన ఏనుగుల గుంపు శనివారం వీరఘట్టం మండలం నడిమికెల్లలో ప్రవేశించి కంబర పంచాయితీలోని అరిటితోటల్లో తిష్టవేశాయి. సుమారు 15 ఎకరాల్లో అరటి తోటలు నాశనమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీటిని అటవీ ప్రాంతంలోకి తరలిస్తున్నాం. అయితే అవి వెళ్లిన వెంటనే మరలా తిరిగివచ్చేస్తున్నాయి. ఒడిశా అటవీ ప్రాంతంలో వీటి ఆవాసానికి తగిన వనరులు లేకపోవడం వల్లే అవి ఈ రెండు జిల్లాలో తిష్టవేస్తున్నాయి. జిల్లాలో మంచినీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా వృక్షసంపద కూడా ఉంది. అందుచే ఏనుగులు ఇక్కడ నుండి కదలడం లేదు. మరో ఏనుగుల గుంపు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు.
–విఠల్‌కుమార్, అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి, వీరఘట్టం
Comments
Please login to add a commentAdd a comment