సాక్షి, కొమరాడ (విజయనగరం): హమ్మయ్య... ఎట్టకేలకు ఏనుగులు డ్యామ్ దాటేశాయి. ఏడాదిగా జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలతోపాటు మైదాన ప్రజలను హడలెత్తించిన గజరాజులు ఒడిశావైపు తరలి వెళ్లాయి. ఇలా వెళ్లడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ వెళ్లాయి. కానీ అక్కడి అధికారులు అంతే జాగ్రత్తగా వాటిని తిప్పి పంపించేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకపోవడం... ఒడిశా అధికారులతో చర్చించకపోవడం... వాటిని ఎలిఫెంట్ జోన్‌లోకి తరలించకపోవడం... ఇలాంటి కారణాల వల్ల మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈసారైనా... ఆ సమస్య నుంచి గట్టెక్కించాల్సిన అవసరం ఉంది.
ఏడాదిగా ఈ ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న గజరాజుల గుంపు మంగళవారం తెల్లవారుఝామున రాజ్యలక్ష్మీపురం, కందివలస మీదుగా జంఝావతి రిజర్వాయర్ డ్యామ్ గట్టు దాటాయి. గతంలో కూడా ఒక సారి ఇలానే జరిగింది. అయితే ఒడిశా అటవీ శాఖ అధికారులు, గిరిజనులు తిప్పికొట్టారు. మళ్లీ వెనుదిరిగాయి. ఈసారి అలా జరగకుండా ఉండాలంటే అటవీశాఖ ఉన్నతాధికారులు ఒడిశా అధికారులతో మాట్లా డి ఒడిశా ప్రాంతంలోని ఎలిఫెంటి జోన్‌కు తరలించే ఏర్పాటు చేయాలి. లేకుంటే మళ్లీ వెనక్కు పంపించేస్తే మనకు ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇంతవరకు కొద్ది పాటి పంటలనే తొక్కి నాశనం చేసిన గజరాజులు మళ్లీ వస్తే రైతులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉంది. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో ఈ ప్రాంత రైతులు కూరగాయలు, చెరకు, అరటి, వరి ఆకుమడులు తదితర పంటలు వేశారు. వాటిని ధ్వంసం చేస్తే తీరని నష్టం వాటిల్లుతుందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అం తేగాదు. ఒంటరిగా వచ్చేవారి ప్రాణాలకూ ముప్పువాటిల్లుతుందని భయందోళన చెందుతున్నా రు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జోన్‌కు తరలించే యత్నం చేయాలి
గత సంవత్సరం సెప్టెంబర్‌లో వచ్చిన ఎనిమిది ఏనుగుల్లో ప్రమాదవశాత్తూ రెండు ఏనుగులు చనిపోయాయి. మిగతా ఏనుగులు ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. దీనివల్ల అన్నదాతలకు ఆవేదనే మిగిలింది. గత ప్రభుత్వం కనీసం పంట నష్టపరిహారమైనా మంజూరు చేయలేదు. ఇప్పుడు ఎలాగోలా ఒడిశా ప్రాంతానికి తరలాయి. అక్కడ ఉన్న ఎలిఫెంట్ జోన్‌కు తరిలి స్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలి.
– అంబటి తిరుపతి నాయుడు, స్వామినాయుడువలస
పంటలు పాడవుతున్నాయి
నాగవళి నది ఒడ్డున మా గ్రామం ఉండటంతో మా పోలాల్లోని చెరకు, అరటి, జొన్న, వరి తదితర పంటలు వేస్తాం. ఇక్కడ తినడానికి తిండి, తాగడానికి నీటి సౌకర్యం ఉండడంతో ఈ ప్రాంతం విడిచి వెళ్లకుండా ఇక్కడే తిష్టవేస్తున్నాయి. మా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అటవీశాఖ సిబ్బంది పుణ్యమాని మంగళవారం జంఝావతి డ్యామ్ దాటాయి. ఉన్నతాధికారులు స్పందించి ఒడిశా అటవీ ప్రాంతానికి తరలించాలి.
– ఫైల వెంకటరమణ, రైతు, గుణానుపురం
Comments
Please login to add a commentAdd a comment