పోలీసులకు సూచనలు అందజేస్తున్న ఓఎస్‌డీ విక్రాంత్‌పాటిల్
మక్కువ : మావోయిస్టులు ఆరు రాష్ట్రాల్లో శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పోలీస్, సీఆర్‌పీఎఫ్ బలగాలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపడుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లలో పది మంది మావోయిస్టులు మృతి చెందడంతో నాయకులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్‌యంత్రాంగం ఏజెన్సీ పోలీస్‌స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఈ ఏడాది మార్చిలో ఒడిశాలోని నారాయణపట్నం బ్లాక్ గుమండి పంచాయతీ (ఏఓబీ) సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
అలాగే గత నెల 22న మహారాష్ట్ర రాష్ట్రం గచ్చిరోలి సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు కన్నుమూశారు. అయితే రెండు ఎన్‌కౌంటర్లలో పదిమంది మావోయిస్టులు మృతి చెందడంతో ప్రతీకార చర్యగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలాంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టులు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో విధ్వంసక చర్యలు జరిగే అవకాశం ఉంటుందని పోలీస్‌వర్గాలు భావిస్తున్నాయి. ఒడిశా రాష్ట్రం మల్కనగిరి పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నందున వారు జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున పోలీసులు సరిహద్దులో నిఘా పెంచారు.
అప్రమత్తం
బంద్ నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ఓఎస్‌డీ విక్రాంత్ పాటిల్ ఏజెన్సీ పోలీస్‌స్టేషన్లను సందర్శిస్తూ పలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. అధి కారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసే అవకాశం ఉన్నందున పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment