సాక్షి ప్రతినిధి, విజయనగరం : విశాఖ జిల్లా బలిమెల రిజర్వాయర్ సమీపంలో ఎదురుకాల్పులు జరిగిన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాగం అప్రమత్తమైంది. ఏజెన్సీ పోలీసుస్టేషన్ల వద్ద బందోబస్తు పటిష్టం చేసింది. రాత్రి పూట మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమాచారం లేకుండా ఏజెన్సీలో పర్యటించవద్దని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు సూచించారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిం చారు. వారి సానుభూతిపరుల కదలికలపై నిఘా పెట్టారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఉన్న చిత్రకొండ, బలిమెల కటాఫ్ ఏరియాలో మావోయిస్టులు భారీ ప్లీనరీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఆంధ్రా, ఒడిశా గ్రేహౌండ్స్ బలగాలు దాడి చేయడంతో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటన నేపథ్యంలో జిల్లా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఒకవైపు ఏజెన్సీలో కూంబింగ్ విసృ్తతం చేస్తూనే, మరోవైపు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ సోమవారం ఉదయం నుంచే తమ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా స్టేషన్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే బందోబస్తు పెంచుకోవాలని సూచించారు. సానుభూతిపరులు, అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. ఏజెన్సీలో పర్యటించొద్దని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. తప్పనిసరైతే తమకు సమాచారం అందిస్తే బందోబస్తు కల్పిస్తామన్నారు.
ఏజెన్సీలో అప్రమత్తం
Published Tue, Jan 6 2015 3:03 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement