నేలపై నరకం
అధ్వానంగా నగర రోడ్లు
ఎక్కడికక్కడే గుంతలు
ఏమవుతున్నాయో తెలియని నిధులు
నగర రహదారులు నరకప్రాయంగా మారాయి. దారి పొడవునా గుంతలు... సూదుల్లా మొనదేలిన రాళ్లు...అడుగు తీసి... అడుగు వేసేందుకే హడలెత్తిస్తున్నాయి. ‘ఆకాశ మార్గాల’ వైపు చూస్తున్న ప్రభుత్వం ... నేల వైపు తొంగి చూడడం లేదు. ఫలితంగా రహదారులు గోదారులవుతున్నాయి. రోడ్లపైనే సుడిగుండాలు ఏర్పడుతున్నాయి. ఈ సుడులలో చిక్కి...ఎంతోమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
న్యూస్‌లైన్: నగరంలోని రహదారులపై ప్రయాణమంటే ప్రజలు హడలిపోతున్నారు. అడుగడుగునా గతుకులు... గుంతలు పడిన రోడ్లతో వాహనదారుల వెన్ను విరుగుతోంది. ఆకాశ మార్గాలని... అంతర్జాతీయ ప్రమాణాలని చెబుతున్న ప్రభుత్వం...ముందుగా దెబ్బతిన్న రహదారులను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న నగర రహదారుల్లో ఇటీవలి చిరుజల్లులకు మరింతగా గుంతలు ఏర్పడ్డాయి. క ంకర తేలి నగర జీవికి నరకం చూపుతున్నాయి. ఏటా రోడ్ల నిర్వహణ.. రీకార్పెటింగ్ పేరిట రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నారు. నాణ్యత లోపంతో ఇవి మూణ్నాళ్లకే కొట్టుకుపోయి రాళ్లు తేలుతున్నాయి. మెట్రో పనులతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు.. కేబుల్ సంస్థలు రోడ్లను ఇష్టానుసారం తవ్వి పారేస్తున్నాయి. దీంతో వర్షం పడితే గుంతలను గుర్తించలేక వాహన చోదకులు ప్రమాదాల పాల పడుతున్నారు. నరకానికి నక ళ్లుగా మారిన ‘గ్రేటర్’ రహదారులపై ‘సాక్షి’ ఫోకస్ ..
వీఐపీలకే ప్రాధాన్యం
జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 8803.47 కి.మీ. రహదారులు ఉన్నాయి. వాటి నిర్వహణ, అవసరమైన రీకార్పెటింగ్ పనులకు ఏటా దాదాపు రూ. 250 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. వీటిలో సింహభాగం వీవీఐపీలు సంచరించే ప్రాంతాల్లోనే వినియోగిస్తున్నారు. ఇలాంటి 15 మార్గాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల నిర్వహణ లోపం కనిపిస్తోంది. దీంతో రోడ్లు త్వరగా దెబ్బ తింటున్నాయి. పర్యవేక్షణ లోపం కూడా శాపంగా మారింది.
నీరు వెళ్లే మార్గం లేక...
వర్షాలు వచ్చినప్పుడు నీరు వెళ్లే మార్గం లేక రోడ్లు త్వరగా దెబ్బతింటున్నాయి. నాలాల ఆక్రమణ ప్రభావం రహదారులపై పడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ భారాన్ని తట్టుకునేంత బలం కూడా నగర రోడ్లకు లేదు. ప్రధాన రహదారులు, బస్సులు ప్రయాణించే 690 కి.మీ.ల మేర రహదారుల ఇన్వెంటరీ, స్థితిగతులపై గతంలోనే సర్వే చేయించినప్పటికీ తదుపరి చర్యలు లేవు. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల వల్ల కూడా రోడ్లు త్వరగా దెబ్బతింటున్నాయి. సాధారణ పరిస్థితుల్లో ఐదేళ్లు మన్నికగా ఉండాల్సిన బీటీ రోడ్లు రెండేళ్లు కూడా నిలవడం లేదు. దాదాపు 25 ఏళ్లు నిలవాల్సిన సీసీరోడ్లు అందులో సగం రోజులు కూడా ఉండటం లేదు. రోడ్ల పక్కన వెలసిన అక్రమ నిర్మాణాలు.. పైపు లైన్ల లీకేజీలు గుర్తించేందుకు రోడ్డు తవ్వకాలు.. సివరేజి లైన్లను వరద కాలువల్లోనే కలపడంతో ఎక్కడికక్కడ నీరు చేరి, అంతిమంగా రోడ్లపైనే ప్రభావం పడుతోంది. ప్రవహించేందుకు తగిన వాలు(కేంబర్) లేక రోడ్లపైనే నీరు నిలిచిపోతోంది. రోడ్డు డాక్టర్లు.. మినీ రోలర్లు.. అత్యవసర బృందాల ఏర్పాటువంటి ప్రకటనలు కార్యరూపం దాల్చడం లేదు.