సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇకపై రోడ్ల తవ్వకాలుండవ్. ఈ ఏడాదంతా నగరవ్యాప్తంగా రోడ్ల తవ్వకాలపై జీహెచ్‌ఎంసీ నిషేధం విధించింది. అడ్డగోలు తవ్వకాలతో అవస్థలు పడుతున్న సిటీజనులకు ఇది శుభవార్తే. కేబుల్ వైర్లు, తాగునీరు, విద్యుత్, టెలికం అవసరాల కోసం ఆయా సంస్థలు రోడ్లను తవ్వేసి నెలల తరబడి పూడ్చకపోవడం, పనులు సాగుతూ ఉండడం వల్ల సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ.. ఎలాంటి ముందస్తు సమాచారం, హెచ్చరికలు లేకుండా రాత్రికి రాత్రే రోడ్లన్నీ తవ్వేస్తుండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ నిషేధం నిర్ణయం తీసుకుంది. ఇటీవల దాదాపు 1900 కి.మీ మేర తవ్వకాల కోసం ఆయా సంస్థలు అనుమతి కోరగా నిర్ద్వందంగా తిరస్కరించింది.
నగరంలో ఎక్కడ పడితే అక్కడ తవ్విన రోడ్లతో జనం నానాపాట్లు పడుతున్నారు. కేబుళ్లు, తాగునీరు, విద్యుత్ తదితర అవసరాల కోసంఆయా సంస్థలు రోడ్లను తవ్వి..నెలల తరబడి పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు పడరాని పాట్లు పాడుతున్నారు. ఆ సమస్యలలా ఉండగానే వివిధ సంస్థలు తమ అవసరాల కోసం మళ్లీ రోడ్ల తవ్వకాలకు అనుమతులివ్వాల్సిందిగా జీహెచ్‌ఎంసీని కోరాయి. ఇలా దాదాపు 1900 కి.మీ.ల మేర తవ్వకాల అనుమతులు కోరగా, అందుకు జీహెచ్‌ఎంసీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఈ ఏడాదంతా ఎవరికీ ఎలాంటి అనుమతులిచ్చేది లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలకు సంబంధించి అత్యంత అవసరమైన పనులకు మాత్రం ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తెస్తే అనుమతులిస్తున్నామని జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా ఆయా అవసరాల కోసం రోడ్ల కటింగ్‌లకు అనుమతులు పొందిన సంస్థలు తమ పనుల్ని సకాలంలో పూర్తి చేయకపోవడంతో తవ్విన రోడ్లతో ప్రజలు పడరాని పాట్లుపడుతున్నారు.
కొన్నిప్రాంతాల్లో తవ్వకాల చుట్టూ కనీసం ఫెన్సింగ్ వంటివి కూడా లేకపోవడంతో ప్రమాదాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. దాదాపు మరో నెల రోజుల్లో వర్షాకాలం రానుండటంతో మరిన్ని సమస్యలు తలెత్తనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి కొత్త అనుమతులివ్వడం లేదని జియావుద్దీన్ పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు ఆయా అవసరాల కోసం దాదాపు 40 కి.మీ.ల మేర మాత్రం ఇప్పటికే అనుమతులిచ్చినట్లు తెలిపారు. వీటిల్లో ట్రాన్స్‌కోకు 1.233 కి.మీ.లు, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు 18.17 కి.మీ.లు స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌కు సంబంధించి సీసీటీవీల ఏర్పాట్లకు 14.27 కి.మీ.లు, జలమండలికి 5.7 కి.మీ.ల మేర అనుమతులిచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజల గృహావసరాలకు సంబంధించి మాత్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా ఆన్‌లైన్‌లో అందే దరఖాస్తులకు అనుమతులిస్తున్నట్లు స్పష్టం చేశారు. గృహావసరాలకు తక్కువ దూరం మాత్రమే రోడ్ కటింగ్ అవసరమవుతుందని, త్వరితంగానే పనులు పూర్తవుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment