‘కాఫీ’పై మావోయిస్టుల కన్నెర్ర | 'Coffee' on the resources of the state | Sakshi
Sakshi News home page

‘కాఫీ’పై మావోయిస్టుల కన్నెర్ర

Published Tue, Dec 31 2013 1:51 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

'Coffee' on the resources of the state

=ట్రాక్టర్ దహనం, సిబ్బందిపై దాడితో హల్‌చల్
 =భౌతిక దాడులతో ఉద్యోగులు బెంబేలు
 =భవిష్యత్తుపై అధికారులతో చర్చలు

 
చింతపల్లి, న్యూస్‌లైన్: ఏజెన్సీలో మావోయిస్టులు మళ్లీ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) ఆస్తులు లక్ష్యంగా దాడులకు తలపడ్డారు.  కాఫీ సంస్థపై దాడులకు తెగబడ్డారు. మొన్నటి వరకు ఆ సంస్థ ఆస్తులనే ధ్వంసం చేసే మావోయిస్టులు నానాటికీ ఉద్యోగులపైన భౌతిక దాడులకు సమాయత్తమవుతున్నారు. ఉద్యోగుల గుండెల్లో కలవరం సృష్టిస్తున్నారు. ఆదివా రం రాత్రి చింతపల్లి మండలంలోని చెరపల్లి వద్ద ఎపీఎఫ్‌డీసీ కాఫీ గింజలను తరలిస్తున్న ట్రాక్టర్‌కు నిప్పటించడంతోపాటు వాచ్‌మెన్ ఉంటున్న పూరిపాకను దహనం చేశారు.

అక్కడే ఉన్న ఫీల్డ్‌మన్ సత్యనారాయణ, వాచ్‌మెన్ పండన్న, రాంబాబులకు దేహశుద్ధి చేశారు. మరోవైపున జీకే వీధి మండలంలోని పెదవలసలో కాఫీ ఉద్యోగి ద్విచక్ర వాహనాన్ని దహనం చేశారు. ఆ సమయంలో అతను ఇంటిలో లేరు. ఏజెన్సీలో ప్రభుత్వ పరంగా సాగుచేస్తున్న కాఫీ తోటలన్నిటినీ గిరిజనులకు పంచిపెట్టాలని, కాఫీ అధికారులు తోటల జోలికి రావద్దని హెచ్చరిస్తూ కరపత్రాలు వెదజల్లారు. చింతపల్లి, జీకే వీధి మండలాల్లో నాలుగు డివిజన్‌లలో3,400 హెక్టార్లలో ఎపీఎఫ్‌డీసీ కాఫీ సాగు చేపడుతుంది.

ఇవి దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇప్పటికే బలపం ప్రాంతంలోని 110 హెక్టా ర్లు, మర్రిపాకలు ఎస్టేట్‌లోని 60 హెక్టార్ల కాఫీ తోటలను మావోయిస్టులు గిరిజనులకు పంపిణీ చేశారు. చాపరాతిపాలెం ప్రాంతంలో సుమారు 100 హెక్టార్ల కాఫీ తోటలను స్థానిక గిరిజనులకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ తోటల జోలికి రావద్దని ఆ శాఖ అధికారులకు పలుమార్లు హెచ్చరించారు. తాజాగా చెరపల్లిలోని 110 హెక్టార్ల కాఫీ తోటలను గిరిజనులకు పంపిణీ చేయాలని మావోయిస్టులు పథకం వేశారు.

ఇందులోభాగంగానే ఆదివారం రాత్రి ట్రాక్టర్‌కు నిప్పంటించి కరపత్రాలు వెదజల్లడమే కాకుండా ఆ శాఖ ఉద్యోగులపై దాడి చేశారు. దీంతో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో విధులు నిర్వహించ డం కష్టంగా ఉందని కాఫీ సంస్థ ఉద్యోగులు వాపోతున్నారు. పండ్ల సేకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో మావోయిస్టులు దాడులకు పాల్పడుతుండడంతో ఉద్యోగులంతా మండల కేంద్రాలకు పరుగులు పెట్టారు. భవిష్యత్ కార్యచరణపై ఆ శాఖ అధికారులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement