పాడేరు, న్యూస్‌లైన్ : ఏజెన్సీలో కాఫీ, మిరియాల తోటలు కళకళలాడుతున్నాయి. వారం పది రోజుల్లో పక్వానికి రానున్న ఈ పండ్లు గిరిజన రైతులకు సిరులు కురిపించనున్నాయి. మూడేళ్లుగా వాతావరణ పరిస్థితులు అనుకూలించక నష్టాలు చవిచూసిన ఆదివాసీలకు ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించాయి. ఏప్రిల్ నుంచి విస్తారంగా మన్యమంతటా వర్షాలు కురవడం, చల్లదనం కాఫీ తోటలతోపాటు వాటిల్లో అంతర పంటగా చేపట్టిన మిరియాల పాదులకు కూడా ఎంతో మేలు చేసింది.
మినుములూరు పరిశోధనస్థానం పరిసరాల్లో ఈ సీజన్‌లో సుమారు వంద సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో కాఫీ తోటలు విరగ్గాశాయి. మిరియాల పాదులకూ కాపు బాగుంది. ఏజెన్సీలో కాఫీబోర్డు కాకుండా కేవలం గిరిజనుల అధీనంలో 55 వేల హెక్టార్లలో కాఫీ తోటలు ఉన్నాయి. వీటిల్లో 38 వేల హెక్టార్లలోని తోటలు ఫలసాయాన్ని ఇస్తున్నాయి. మూడేళ్లుగా కాఫీ దిగుబడు బాగా పడిపోయాయి. గతేడాది కేవలం 5500 టన్నుల కాఫీ గింజలు ఉత్పత్తి అయ్యాయి.
ఈ ఏడాది 7 వేల టన్నులకు పైబడి కాఫీ గింజలు దిగుబడి ఉంటుందని కేంద్ర కాఫీ బోర్డు డిప్యూటీ డైరక్టర్ రాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అటవీ అభివృద్ధి సంస్థ అధీనంలో చింతపల్లి, జీకే వీధి, మినుములూరు, పెదబయలు, అరకులోయ, అనంతగిరి ప్రాంతాల్లోని 4వేల హెక్టార్లలోని తోటల్లోనూ దిగుబడి పెరగనుంది. ఏటా వెయ్యి టన్నుల దిగుబడి ఉండగా ఈ ఏడాది ఇది మరింత పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నష్టాల్లో ఉన్న అటవీ అభివృద్ధి సంస్థకు ఇది శుభ పరిణామం.
మిరియాల పాదులు కళకళ : కాఫీ తోటల్లో అంతరపంటగా సాగవుతున్న మిరియాల పాదులకు కూడా కాపు ఆశాజనకంగా ఉంది. పాదులన్నీ మిరియాల గిం జలతో కళకళలాడుతున్నాయి. సుమారు 15వేల హెక్టార్లలో అంతర పంటగా మిరియాలను సాగు చేస్తున్నారు. కాపు బాగుండటంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాఫీబోర్డు తోటల్లోనూ ఇదే పరిస్థితి.
కమ్మగా కాఫీ
Published Fri, Sep 20 2013 2:03 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement