పోలీసులకు పెను సవాల్
- మన్యం ప్రజాప్రతినిధులకు మావోయిస్టుల లక్ష్మణరేఖ
- ఏజెన్సీలో ఘర్షణపూరిత వాతావరణం
- కత్తి మీద సాములా సాధారణ ఎన్నికలు
కొయ్యూరు/పెదబయలు, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికలు పోలీసులకు పెను సవాలుగా మారాయి. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు అవకాశం కోసం కాచుకుని కూర్చున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఏజెన్సీలో ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశముందంటూ నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల జిల్లా ఎస్పీ ప్రకటించారు.
రానున్న ఎన్నికల్లో మన్యంలో ప్రచారంలో తిరిగే ప్రజాప్రతినిధులను మట్టుబెట్టడానికి యాక్షన్‌టీములను నియమించినట్టు తమకు సమాచారముందని ఎస్పీ దుగ్గల్ తెలిపారు. దళసభ్యుల హిట్‌లిస్టులో ఉన్న 36 మంది ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మైదానంతోపాటు ఏజెన్సీలోనూ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటుందన్న వాదన వ్యక్తమవుతోంది. ఇదే అదనుగా తమ ఉనికిని చాటుకోవడానికి మావోయిస్టులు తహతహలాడుతున్నా రు. ఎన్నికల ప్రచారానికొచ్చేవారిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది.
మావోయిస్టులు ఇటీవల బల పం పంచాయతీ సర్పంచ్ కార్లను చంపడం ద్వారా హింసకు పాల్పడతామని పరోక్షంగా స్పష్టం చేశారు. గత 15 రోజుల నుంచి మిలీషియాతో కలిసి దళసభ్యులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. గతనెల 22న పెదబయలు మండలం గుల్లేలు సమీపంలో మావోయిస్టులు పొక్లెయిన్‌ను దగ్ధం చేసినప్పటి నుంచి ఒక్క సారిగా వాతావరణం వేడెక్కింది. అలా గే గత నెల 27 న పెదబయలు మండలం ఇంజరి అటవీ ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించి ఇంజరి, గిన్నెలకోట, జామిగుడ పంచాయితీ సర్పంచ్‌లు, ఇంజరి మాజీ సర్పంచ్, గిన్నెగరువు,మూలలోవ గ్రామాలకు చెందిన కొందరికి దేహశుద్ధి చేశారు. అంతటితో ఊరుకోకుండా ఊరు విడిచి వెళ్లరాదంటూ లక్ష్మణ రేఖ గీశారు.
గ్రామాల్లోని నాయకులపై మిలీషియా సభ్యులు కన్నేసి ఉంచుతున్నారు. అరకు,పాడేరు నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రా లు అన్నింటిని సమస్యాత్మకమైనవిగా అధికారులు పరిగణిస్తున్నారు. పాడేరు నియోజకవర్గంలోని 242 పోలింగ్ కేంద్రాల్లో 130కి పైగా కేంద్రాల్లో ఏమి జరిగినా తెలిసే సమాచార వ్యవస్థ లేదు. ఇవన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో ఆయా కేంద్రాలకు పోలీసు బలగాలు, పోలింగ్‌సిబ్బంది, బ్యాలెట్ బాక్సుల తరలింపు, తీసుకురావడానికి అధికారులు రెండు హెలికాప్టర్లను సిద్ధం చేస్తున్నారు. ఇలా ఈ సారి ఎన్నికలు పోలీసులకు కత్తిమీద సాములా కనిపిస్తున్నాయి.