the general elections
-
‘చే’జారేనా..?
- డీసీసీబీపై కన్నేసిన టీఆర్ ఎస్ - యడవెల్లి విజయేందర్‌రెడ్డి రాజీనామాకు అధికారిక ఆమోదమే తరువాయి - ఇక తప్పని ఎన్నిక.. చైర్మన్ పోస్టు కోసం ఇప్పటికే ‘వర్గ’ పోరు సాక్షిప్రతినిధి, నల్లగొండ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌కు జిల్లాలో మిగిలిన ప్రధానపోస్టులు రెండు. అంతకు ముందే జరిగిన సహకార ఎన్నికల్లో డీసీసీబీ చైర్మన్, స్థానిక ఎన్నికల్లో జిల్లాపరిషత్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ నిలబెట్టుకుంది. ఈ రెండింట ఆ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే సహకార ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరిగినవి కావు. దీంతో డెరైక్టర్లు తమ ఇష్టమున్న పార్టీ తరఫున పనిచేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ సొంతింటి రాజకీయాలతో చివరకు తన చేతిలో ఉన్న ప్రధానమైన డీసీసీబీని చేజేతులా వదులుకుంటోం దన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ డీసీసీబీపైనా నజర్ పెట్టినట్లు చెబుతున్నారు. రెండోసారి చైర్మన్‌గా ఎన్నికైన విజయేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడే ఉంది. సహకార ఎన్నికలకు ముందు పార్టీలో అంతర్గతంగా చేసుకున్న ఒప్పందం మేరకు విజయేందర్‌రెడ్డిని దీర్ఘకాలిక సెలవుపై పంపించి, వైస్‌చైర్మన్‌గా ఉన్న ముక్తవరపు పాండురంగారావును ఇన్ చార్జ్ చైర్మన్‌గా చేయాలన్నది ఆ ఒప్పంద సారాంశం. ఈ మేరకు విజయేందర్‌రెడ్డి తప్పని పరిస్థితుల్లో ఆరు నెలల పాటు సెలువులో వెళ్లిపోయారు. ఈలోగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. దీంతో ఆయన తిరిగి తన బాధ్యతల్లో చేరిపోయారు. అయినా, ఒప్పందం మేరకు పక్కకు తప్పుకోవాల్సిందేనని ఓ మాజీ మంత్రి ఒత్తిడి పెట్టడంతో ఆయన రాజీనామా చేశారు. మంగళవారం ఆయన ఈ మేరకు రాష్ట్ర సహకార శాఖ అధికారులకు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇది ఆమోదం పొందడమే మిగిలింది. చైర్మన్ రాజీనామా ఆమోదం పొందితే మళ్లీ ఎన్నిక జరపాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వెలువడే వరకు మాత్రమే ఇన్చార్జ్ చైర్మన్‌గా పాండురంగారావుకు అవకాశం ఉంటుంది. ఆయననే తిరిగి చైర్మన్‌గా ఎన్నుకోవాలంటే డెరైక్టర్లలో మెజారిటీ ఉండాలి. వాస్తవానికి డీసీసీబీ డెరైక్టర్లు అంతా (19) కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. కానీ, వీరిలో భువనగిరి ప్రాంతానికి చెందిన ఓ డెరైక్టర్ చైర్మన్ పోస్టుపై ఆశ పెంచుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులు చెప్పినట్లు నడుచుకున్న డెరైక్టర్లు ఇప్పుడు మళ్లీ వారి మాట విని, పార్టీ సూచించే అభ్యర్థినే ఎన్నుకుంటారా అన్నది ప్రశ్నార్థకమే. ఇప్పటికే కాంగ్రెస్ డెరైక్టర్లలో వర్గపోరు ఉంది. ఈ సారి చైర్మన్ పదవిని ఎట్టి పరిస్థితుల్లో ఆయకట్టేతర ప్రాంతానికి ఇవ్వాలన్నది వీరి డిమాండ్. డీసీసీబీలో కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలను గమనిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ.. డెరైక్టర్లలో కొందరిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. 19 మంది డెరైక్టర్లలో కనీసం 10 మంది మద్దతు కూడగ ట్టగలిగితే డీసీసీబీపై టీఆర్ఎస్ జెండా ఎగరేయవచ్చన్న వ్యూహంతో ఉన్నారు. మునుగోడు, ఆలేరు నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు డెరైక్టర్లు మధ్యలో ఓసారి అవిశ్వాసం పెట్టాలన్న ఆలోచన కూడా పెట్టారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు, డెరైక్టర్లలో ఉన్న వర్గపోరు ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో గులాబీ నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. డీసీసీబీ రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. -
బ్యాలెట్ బరి.. బుల్లెట్ గురి
ఎన్నికల వేళ కుటీర పరిశ్రమగా మారిన ఆయుధాలు, తూటాల తయారీ ఉత్తరాదిన యథేచ్ఛగా విక్రయాలు పన్యాల జగన్నాథదాసు: బ్యాలెట్ పోరు కోసం బుల్లెట్లకు గిరాకీ పెరిగింది. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ ముహూర్తాన్ని ప్రకటించిన నాటి నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లో అక్రమ ఆయుధాల అమ్మకాలు ఊపందుకున్నాయి. అక్రమ ఆయుధాలపై అధికార యంత్రాంగం ఎంతగా నిఘా పెట్టినా, సోదాలు సాగిస్తున్నా, వాటి అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అక్రమ ఆయుధాలకు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు పేరుమోసిన సంగతి తెలిసిందే. ఈసారి తృణమూల్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పాలనలోని పశ్చిమ బెంగాల్లోనూ అక్రమ ఆయుధాలు హల్చల్ చేస్తున్నాయి. ఈ రాష్ట్రాలోని మారుమూల ప్రాంతాల్లో అక్రమ ఆయుధాల తయారీ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. ఇదివరకు నాటు తుపాకులను మాత్రమే తయారు చేసే ముఠాలు, ఇప్పుడిప్పుడే అధునాతన ఆయుధాలనూ సొంతంగా తయారు చేస్తున్నాయి. మాఫియా ముఠాలకు, తీవ్రవాదులకు అక్రమంగా ఆయుధాలను సరఫరా చేసే ఈ ముఠాలు, ఎన్నికల సీజన్లో రాజకీయ పార్టీలకూ సరఫరా చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అక్రమ ఆయుధాల ధరలు కూడా పెరిగాయి. అయినా, రాజకీయ పార్టీలు ఏమాత్రం వెనుకాడకుండా ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల సీజన్లో వివిధ ప్రాంతాల్లో చలామణీ అవుతున్న ఆయుధాలు, వాటి ధరవరల వివరాలు... కట్టా (నాటు పిస్టల్): దీంతో ఒకసారి ఒకే తూటా కాల్చేందుకు అవకాశం ఉంటుంది. నిన్న మొన్నటి వరకు రూ.1,500 వరకు ఉండే దీని ధర కొన్నిచోట్ల రూ.5 వేల వరకు ఎగబాకింది. పౌనీ తమంచా: ఇది పిస్టల్ కంటే పెద్దగా, రైఫిల్ కంటే చిన్నగా ఉండే నాటు తుపాకీ. దీంతోనూ ఒకసారి ఒకే తూటా కాల్చగలరు. ఇది రూ.1,500 నుంచి రూ.4,500 వరకు పలుకుతోంది. మొరేనా పిస్టల్: దాదాపు ఆధునిక రివాల్వర్‌ను పోలిన ఆయుధం, దీనికి కూడా రివాల్వర్ మాదిరిగానే తూటాలతో కూడిన మ్యాగజైన్ ఉంటుంది. ఇది రూ.6 వేల వరకు పలుకుతోంది. 7 ఎంఎం హ్యాండ్‌గన్: పిస్టల్ తరహాలోనే ఉండే దీని ధర గడచిన ఏడాది వ్యవధిలోనే రూ.15 వేల నుంచి రూ.25 వేలకు ఎగబాకింది. 9 ఎంఎం హ్యాండ్‌గన్: ఈ హ్యాండ్గన్లో వాడే తూటాలు కాస్త పెద్దగా ఉంటాయి. దీని ధర రూ.24 వేల నుంచి రూ.45 వేలకు పెరిగింది. సింగిల్ బ్యారెల్ గన్: ఏడాది కిందట రూ.8 వేలకే లభించే ఈ తుపాకీ ధర ఇప్పుడు రూ.20 వేలు పలుకుతోంది. డబుల్ బ్యారెల్ గన్: దీని ధరకూ రెక్కలొచ్చాయి. రూ.30 వేల నుంచి రూ.60 వేలకు చేరుకుంది. .9ఎంఎం పిస్టల్ జేబులో తేలికగా ఇమిడిపోయే దీని ధర రూ.18 వేల నుంచి రూ.25 వేలు పలుకుతోంది. తూటాలు: .303 బుల్లెట్ ఒక్కోటి రూ.250-రూ.450, .15 బుల్లెట్ రూ.150-రూ.350, 7ఎంఎం హ్యాండ్‌గన్ బుల్లెట్ రూ.300-రూ.500, 9ఎంఎం హ్యాండ్‌గన్ బుల్లెట్ రూ.400-800 వరకు పలుకుతున్నాయి. మారిన ట్రెండ్... అక్రమ ఆయుధాల వాడకంలోనూ ఇటీవల శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అక్రమ ఆయుధాలను తయారు చేసే ముఠాలు ఇదివరకు ఎక్కువగా నాటురకం ఆయుధాలనే తయారు చేసేవారు. ఇప్పుడు ఈ ముఠాలు సైతం ఆధునికమైన ఆయుధాలను తయారు చేస్తున్నాయి. ఇదివరకు లాంగ్రేంజ్ ఆయుధాలను ఎక్కువగా తయారు చేసే ముఠాలు, ఇటీవలి కాలంలో 9 ఎంఎం, .76 బోర్ పిస్తోళ్లు వంటి షార్ట్ రేంజ్ ఆయుధాలను ఎక్కువగా తయారు చేస్తున్నాయని బీహార్ ఐజీ (ఆపరేషన్స్) అమిత్ కుమార్ చెప్పారు. హౌరా సమీపంలోని దాస్‌నగర్‌లో అక్రమ ఆయుధాల కర్మాగారంపై బెంగాల్ పోలీసుల సాయంతో జరిపిన దాడిలో ఇలాంటి ఆయుధాలే ఎక్కువగా దొరికినట్లు ఆయన తెలిపారు. ఆయుధాలూ ఆస్తులే! ‘సార్వత్రిక’ సమరంలో తలపడుతున్న చాలామంది అభ్యర్థులకు ఆయుధాలూ ఆస్తులే! అందుకే, వివిధ పార్టీలకు చెందిన దాదాపు వంద మంది అభ్యర్థులు తమ ఆస్తుల జాబితాలో పిస్టళ్లు, రైఫిళ్లు, రివాల్వర్లు వంటి వాటిని చేర్చారు. వీరిలో బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అభ్యర్థులు మేనకా గాంధీ, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్, షూటర్ రాజ్యవర్ధన్ రాథోడ్, కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మంత్రి శ్రీకాంత్ జెనా, కర్ణాటక మాజీ సీఎం సదానంద గౌడ తదితరులు ఉన్నారు. వీరికి మించిన మరికొందరు అరబ్ జాతి అశ్వాలను, అరుదైన కళాఖండాలను, శిల్పాలను తమ ఆస్తులుగా ప్రకటించారు. లావాదేవీలన్నీ ‘కోడ్’లోనే... అక్రమ ఆయుధాల వ్యాపారం బహిరంగ రహస్యమే అయినా, వీటి లావాదేవీలు బాహాటంగా జరగవు. నమ్మకస్తుల ద్వారా వచ్చే వ్యక్తులు ‘బ్యాటరీ, చార్జర్, సామాన్’ అంటూ ‘కోడ్’లో అడుగుతారు. లావాదేవీలన్నీ ‘కోడ్’లోనే జరుగుతాయని, బేరసారాలూ మామూలేనని బీహార్‌లో ఒకప్పుడు నాటు తుపాకీలను తయారు చేసే ఒక వ్యాపారి చెప్పాడు. బీహార్, యూపీలతోపాటు పశ్చిమ బెంగాల్లో పలు జిల్లాల్లో అక్రమ ఆయుధాల కర్మాగారాలు ఉన్నాయి. ఎందరో స్వతంత్రులు.. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ల సంఖ్య ఏకంగా పదివేలకు మించి పోయింది. లోక్‌సభకు ఏ సంవత్సరంలో ఎందరు స్వతంత్రులు.. పోటీ పడ్డారంటే..? -
కట్టే... ‘కీ’లకం
అందరూ కలిసి సునాయాసంగా ‘సార్వత్రిక’ బరినుంచి గట్టెక్కే ప్రణాళికను రూపొందించుకోవాలని ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు భావిస్తున్నారు. భారాన్ని అందరూ పంచుకొని ముందుకెళ్తే ఖర్చు తగ్గుతుందనీ యోచిస్తున్నారు. దీనికోసం సంయుక్త ప్రచారం చేద్దామని భేటీలు జరుపుతున్నారు. ఇలా వర్గాలు, విభేదాలు అధిగమించి జనం ముందు కూడా అంతా ఒక్కటేనని చెప్పవచ్చన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు అటు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇటు ఎంపీ బరిలో ఉన్నవారు వ్యూహరచన చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రచార పర్వం పట్టాలెక్కుతుండటంతో సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అంతర్గత సమన్వయం కోసం కసరత్తు చేస్తున్నారు. ఒకే పార్టీ నుంచి పోటీ చేస్తున్న లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు సంయుక్తంగా ప్రచార కార్యక్రమాలు రూపొందించడంపై దృష్టి సారించారు. పొత్తులు, గ్రూపులు తదితరాల మూలంగా విభేదాలు ఉన్న చోట అడ్డంకులను అధిగమించడంపైనా దృష్టి సారించారు. కాంగ్రెస్‌లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎంపీ అభ్యర్థి జైపాల్‌రెడ్డి ప్రచార భారాన్ని, సమన్వయ బాధ్యతలను భుజాలకెత్తుకోనున్నారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ అభ్యర్థి నంది ఎల్లయ్యకు నియోజకవర్గ రాజకీయాలు పూర్తిగా కొత్త కావడంతో మాజీ మంత్రి డీకే అరుణపై సమన్వయ బాధ్యతలు మోపినట్లు భారం. టీఆర్ఎస్లో వివిధ నేపథ్యం, పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంతో అందరినీ ఏకతాటిపైకి తేవడం ఎంపీ అభ్యర్థులకు కత్తి మీద సాములా కనిపిస్తోంది. టీడీపీ, బీజేపీ పొత్తుపై రెండు పార్టీల శ్రేణుల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రచారం సాఫీగా సాగడం అనుమానంగానే కనిపిస్తోంది. గతంలో టీడీపీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి కొంత మేర చొరవ తీసుకుని ఇరు పార్టీలను సమన్వయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు, నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ అభ్యర్థులతో ఇప్పటికే సమన్వయం కోసం పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నారు. వెంటాడుతున్న ‘ఖర్చు’ భయం అన్ని నియోజకవర్గాల్లోనూ బహుముఖ పోటీ ఉండటం, తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికల్లో గట్టెక్కేందుకు అభ్యర్థులు సర్వ శక్తులు ఒడ్డేందుకు సిద్దమవుతున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులే సొంతంగా నిధులు సమకూర్చుకుని ప్రచార పర్వంపై దృష్టి సారించారు. ఎమ్మెల్యే అభ్యర్థులు కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్థుల వైపు సాయం కోసం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత తిరిగి జిల్లా రాజకీయాల్లో అడుగు పెట్టిన ఎంపీ అభ్యర్థి అందించే సాయంపై ఆ పార్టీ నేతలు గంపెడాశలతో ఉన్నారు. సదరు నేతకు గెలుపు కీలకం కావడంతో ఎమ్మెల్యే అభ్యర్థులు తమ అవసరాలను సదరు నేత ఎదుట ఏకరువు పెట్టినట్లు సమాచారం. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి మాత్రం అధిష్టానం నిదులు కొంత మేర సమకూర్చుతున్నట్లు తెలిసింది. అటు టీడీపీ, బీజేపీలోనూ ఎంపీ అభ్యర్థులపై కొంత ఆర్దిక భారం మోపేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు సిద్దమవుతున్నారు. టీఆర్ఎస్లోనూ పార్టీ ఎంపీ అభ్యర్థులతో పాటు, పార్టీ సమకూర్చే నిధులపై నేతలు ఆశలు పెట్టుకున్నారు. చాలా మంది చివరి నిముషంలో పార్టీలో చేరి టికెట్ దక్కించుకోవడంతో సొంతంగా ఖర్చు చేసుకోవాల్సిందిగా పార్టీ స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవారం పాటు ప్రచారాన్ని సాదా సీదాగా మొదలు పెట్టి ఎన్నికల సమీపించే కొద్దీ దూకుడు పెంచేలా ప్రచార వ్యూహాన్ని అభ్యర్థులు సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటి నుంచే దూకుడుగా వెళ్తే ప్రచార వ్యయం తడిసి మోపెడవుతుందని అభ్యర్థులు అంచనా వేసుకుంటున్నారు. -
రెండో రోజు నామినేషన్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండోరోజు శుక్రవా రం జిల్లాలో ఎమ్మెల్యే స్థానాలకు మూడు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. పార్లమెంట్ స్థానానికి ఇప్పటి వరకు ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. నిజామాబాద్ అర్బన్ నుంచి సీపీఎం తరపున సబ్బని లత నామినేషన్ వేసేందుకు రాగా సమయం మించి పోవడంతో అధికారులు నామినేషన్ స్వీకరించలేదు. అసెంబ్లీ స్థా నానికి నామినేషన్ వేయడానికి మధ్యాహ్నం 3 దాటితే అధికారు లు స్వీకరించరు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి ముత్యాల సునీల్‌కుమార్ నామినేషన్లు దాఖలు చేశారు. బాన్సువాడ నుంచి సీపీఎం అభ్యర్థి నూర్జహాన్ నామినేషన్ వేశారు. శుక్రవారం నాటికి జల్లా మొత్తంగా అసెంబ్లీ స్థానాలకు 5 నామినేషన్లుదాఖలయ్యాయి. బాన్సువాడ సీపీఎం అభ్యర్థిని నూర్జహాన్ సాదాసీదాగా తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి ఒక సెట్ నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఏజేసీ డాక్టర్ శేషాద్రికి అందజేశారు. ఆమె వెంట సీపీఎం నాయకులు రవీందర్ ఉన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే స్థానానికి రెండు రోజుల్లో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఫ్యాన్ జోరు.. సైకిల్ బేజారు
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ పోలింగ్ సరళి తొలిసారి ఈ ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్ఆర్సీపీ హవాను స్పష్టం చేసింది. ఎన్నికలు జరిగిన నాలుగు మున్సిపాలిటీల్లోనూ ఫ్యాన్ గాలి వీచినట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడటంతో ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీ శ్రేణులు గుబులు చెందుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఎన్నికల పోలింగ్, ఫలితాల ప్రభావం తప్పనిసరిగా తర్వాత జరిగే ఎన్నికలపై పడుతుందని పార్టీలు విశ్వసిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి, ఓటర్ల అభిప్రాయలు, పోలింగ్ సరళి బట్టి చూస్తే అన్ని చోట్లా వైఎస్సార్ కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలపై పూర్తిగా ఆశలు వదిలేసుకోగా వైఎస్ఆర్సీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ జరిగింది. నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 91 వార్డులు ఉండగా పాల కొండ 14వ వార్డులో వైఎస్ఆర్సీపీ మద్దతుదారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 90 వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన వృద్ధులు, తొలిసారి ఓటు వేస్తున్న యువజనులు ఫ్యాన్‌కే వేశామని ఎక్కువగా చెప్పడం పలు చోట్ల కనిపించింది. మహిళా ఓటర్లు సైతం ఇదే విషయం చెప్పారు. దీనికితోడు ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పరిస్థితి ప్రజల్లో విశేష ఆదరణ ఉన్న వైఎస్ఆర్సీపీకే లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో ఆ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత కనిపించగా.. పాలకొండ, పలాసల్లో టీడీపీ కొంత పోటీ ఇచ్చినట్లు కనిపించినా అత్యధిక వార్డుల్లో వైఎస్ఆర్సీపీయే విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఇలాంటి అంచనాలనే ఉన్నతాధికారులకు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా పోలింగ్ సరళిని చూసి టీడీపీ శ్రేణులు జావగారిపోతున్నాయి. గట్టి పోటీ ఇచ్చామని భావిస్తున్న ఆ పార్టీ నాయకులు తాజా పరిస్థితులతో డీలా పడిపోతున్నారు. వీటి ప్రభావం ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అవకాశాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని దిగులు చెందుతున్నారు. -
నామా వైపే బాబు మొగ్గు!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ముందుంది మొసళ్ల పండుగ’.... జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈ సామెతను తలపింపచేస్తోంది. సాధారణ ఎన్నికలకు టికెట్ల కేటాయింపు ఖరారు దశకు వచ్చే కొద్దీ తెలుగుతమ్ముళ్లలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా రెండు గ్రూపులుగా విడిపోయి టికెట్ తమకు కావాలంటే తమకు కావాలని పట్టుపడుతూ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఏదో ఒక వర్గానికి చెందిన అభ్యర్థి పేరు ఖరారు చేసే సమయంలో మరో వర్గం నేతలు మెలికలు పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తికి టికెట్ ఇవ్వద్దంటూ పట్టుపడుతున్నారు. ఏపట్టు ఎలా ఉన్నా.... మొత్తంగా జిల్లా పార్టీలో ఎంపీ నామా నాగేశ్వరరావు హవానే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గానికి అంతగా ప్రాధాన్యం లభించడం లేదు. తుమ్మలను ఖమ్మం అసెంబ్లీ నుంచి పాలేరుకు మార్పించి, ఆ స్థానంలో తన వర్గానికి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి నాగప్రసాద్‌కు టికెట్ ఇప్పిం చేలా నామా చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయని, ఈ మేరకు పార్టీ అధినాయకుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాలేరు నుంచి తుమ్మల, ఖమ్మం నుంచి నాగప్రసాద్ల పేర్లు అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనే వార్తలు కొందరు తమ్ముళ్లలో గుబులు రేపుతున్నాయి. దీంతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొందరు ముఖ్య నేతలు త్వరలో నే పార్టీని వదిలిపెట్టబోతున్నారని సమాచారం. ఇద్దరికే అవకాశం ఈసారి సాధారణ ఎన్నికలలో తుమ్మల నాగేశ్వరరావు వర్గం నుంచి ఆయనతో పాటు ఆయన అనుచరుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలకు మాత్రమే టికెట్ ద క్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు జనరల్ స్థానాలతో పాటు పార్లమెంటు టికెట్, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలన్నింటిలో నామా వర్గానికే టికెట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తుమ్మల వర్గం గుర్రుగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారమే నిజమైతే ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఓటమే ధ్యేయంగా పనిచేస్తామని వారంటున్నారు. పార్టీని మొదటి నుంచీ కాపాడుతున్న తుమ్మల వర్గానికి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు కొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. 30 ఏళ్లుగా పార్టీని పట్టుకుని వేలాడుతున్నా తమకు ఒనగూరినదేమీ లేదని అంటున్న ఓ మాజీ ప్రజాప్రతినిధితో పాటు మరో ఇద్దరు నేతలు అధికారికంగా టికెట్లు ప్రకటించిన మరుసటిరోజునే పార్టీని వీడివెళ్లి పోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. బీసీ పేరుతోనూ వ్యూహం జిల్లాలో ఏదో ఒక జనరల్ స్థానాన్ని బీసీలకు కేటాయించాలనే డిమాండ్ జిల్లా టీడీపీలో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అందులో భాగంగా ఖమ్మం లేదా పాలేరు స్థానాల్లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు అవకాశం రావచ్చని భావించారు. అయితే, ఈయన విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. బీసీ కోటాలోనే మరికొందరు నాయకులు టికెట్ ఆశించారు. రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఇవ్వడంతో పాటు డీసీసీబీ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం కల్పించారని, మళ్లీ టికెట్ ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే, వర్గపోరు దృష్ట్యా బాలసానికి టికెట్ ఇప్పించడం తుమ్మల వర్గానికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ పరిస్థితుల్లో నామా వ్యూహం ఫలించింది. బీసీకి టికెట్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా బాలసానికి టికెట్ వస్తుందనే ఆలోచనతో ఆయన ముందు జాగ్రత్తగా ల్యాంకో ఉన్నతోద్యోగి నాగప్రసాద్‌ను తెరపైకి తెచ్చి తుమ్మల గ్రూప్‌నకు చెక్ పెట్టారు. పార్టీలోనికి వచ్చిన వెంటనే పెద్ద పదవి ఇప్పించడంతో పాటు ఇటీవల ఖమ్మంలో జరిగిన ప్రజాగర్జన సభలోనూ ఆయనకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా నాగప్రసాద్‌కు తానున్నానని చెప్పారు. చంద్రబాబు వద్ద తనకున్న లాబీయింగ్‌తో బాలసానికి కాకుండా టికెట్ నాగప్రసాద్కే ఇప్పించారనే ప్రచారం జరుగుతోంది. -
బస్తీలో కుస్తీ..
సాక్షి ప్రతినిధి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ‘పుర సమరం’లో పట్టు సాధించేందుకు రాజకీయ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పదేళ్ల తరువాత జరుగుతున్న ఈ ఎన్నిక ల్లో గెలిచి మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకోవడంతో.. గత ఎన్నికల్లో జిల్లాలో మండపేట మినహా అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీ చతికిలబడింది. తునిలో అయితే మొత్తం 30 వార్డుల్లోనూ వైఎస్ నాయకత్వానికి పట్టం కట్టిన ఓటర్లు.. టీడీపీ కంచుకోటను బద్దలుగొట్టారు. ఈ పరిస్థితుల్లో ఈసారి ఎలాగైనా సరే కొద్దోగొప్పో స్థానాలు సాధించి, ఉనికి చాటుకునేందుకు ఆ పార్టీ కుస్తీ పడుతోంది. మరోపక్క రాష్ర్ట విభజన పరిణామాల నేపథ్యంలో అడ్రస్ గల్లంతై న కాంగ్రెస్ పార్టీ ఈసారి పోటీలో నామమాత్రంగానే మిగి లింది. మొత్తమ్మీద వైఎస్సార్ సీపీ, టీడీపీల మధ్యనే ప్రధానం గా పోరు సాగుతోంది. మహానేత సంక్షేమ పథకాలతో పాటు, తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆయా పట్టణాల్లో నిర్వహించిన రోడ్ షోలు కూడా తమ అభ్యర్థులకు ఘన విజయాన్ని అందిస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాజమండ్రి : తమ మేయర్ అభ్యర్థి రజనీ శేషసాయి ముందున్నారని మొదట్లో టీడీపీ వేసుకున్న అంచనాలు తరువాత తారుమారైపోయాయి. బీటెక్ ఎంబీఏ చేసిన మేడపాటి షర్మిలారెడ్డిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆమె మామ దివంగత సీతారామరెడ్డి రాజమండ్రిలో విస్తృతంగా చేసిన సేవా కార్యక్రమాలు, జననేత రోడ్‌షో తదితర అంశాలు తమకు సానుకూలమయ్యాయని వైఎస్సార్సీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. అమలాపురం : ఇక్కడ 30 వార్డులకు మూడు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 27 వార్డుల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ జరుగుతోంది. 3, 5, 24 వార్డుల్లో స్వతంత్రులు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. మొదట్లో టీడీపీ దూసుకుపోతోందనే అంచనాలు వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్‌షోతో తలకిందులయ్యాయని నేతలు విశ్లేషిస్తున్నారు. సహజంగానే బీసీ, ఎస్సీ సామాజికవర్గాలు తమవైపు ఉండటం, వైఎస్ చేపట్టిన సంక్షేమం.. వెరసి తమకే సానుకూల పవనాలు వీస్తున్నాయని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. మండపేట : వరుసగా మూడుసార్లు మండపేటను కైవసం చేసుకున్న టీడీపీ ఈసారి ఏటికి ఎదురీదుతోందని ఆ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు. మండపేటలో 29 వార్డులకు ఐదో వార్డు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవమైంది. 28 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ, టీడీపీల తరఫున సమీప బంధువులైన వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, చుండ్రు శ్రీవరప్రకాష్ చైర్మన్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో మండపేటలో బలమైన సామాజివకర్గం ఓటింగ్ టీడీపీకి సానుకూలంగా ఉండేది. ఇప్పుడా ఓటింగ్ రెండుగా చీలిపోతుండటం, వరుస విజయాల పరంపరలో టీడీపీపై నెలకొన్న వ్యతిరేకత తమకు సానుకూలంగా మారుతాయని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్‌షోకు వెల్లువెత్తిన ప్రజా స్పందన కూడా తమకు కలిసొచ్చే అంశమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రపురం : ఇక్కడ ఒకే సామాజికవర్గానికి చెందిన అడ్డూరి జగన్నాథ వర్మ(వైఎస్సార్సీపీ), ఎస్ఆర్కే గోపాలబాబు (టీడీపీ) చైర్మన్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. జగన్నాథవర్మ ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త కావడం, వివాదరహితుడనే పేరుండడం వైఎస్సార్సీపీకి కలిసొచ్చే అంశంగా మారింది. టీడీపీ చైర్మన్ అభ్యర్థి గోపాలబాబు, ఆయన భార్య విజయాదేవి గతంలో మున్సిపల్ చైర్మన్లుగా పని చేశారు. మరోపక్క సిటింగ్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీలోకి వలస రావడంతో వ్యతిరేకత వచ్చింది. ఇది టీడీపీకి ప్రతికూల అంశంగా మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. సామర్లకోట : ఇక్కడ 30 వార్డులకు వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే పోటీ జరుగుతోంది. ఇదివరకు మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఉన్న గోలి దొరబాబు ఈసారి వైఎస్సార్సీపీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనపై గత కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడైన మన్యం చంద్రరావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. రెండుసార్లు వైస్ చైర్మన్‌గా సేవలు అందించడం, భార్య వెంకటలక్ష్మికి చైర్‌పర్సన్‌గా పని చేసిన అనుభవం ఉండడం, గోదావరి నీటిని అందరికీ అందించడం తమకు సానుకూలంగా ఉంటుందని వైఎస్సార్సీపీ అభ్యర్థి దొరబాబు చెబుతున్నారు. పెద్దాపురం : ఈ పట్టణంలోని 28 వార్డులకు వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. మహానేత వైఎస్ హయాంలో పట్టణానికి గోదావరి నీటిని అందించడం తమ అభ్యర్థులకు కలిసి వచ్చే అంశమవుతుందని వైఎస్సార్సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పిఠాపురం : పట్టణంలో 30 వార్డులున్నాయి. గండేపల్లి రామారావు(బాబి) వైఎస్సార్సీపీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి నిలిచారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్‌షో తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నా పట్టు సాధిస్తామని ఆ వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. అంతర్గత విభేదాలతో ఇక్కడ టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించలేని దుస్థితిని ఎదుర్కొంటోంది. తుని : పేరుకు త్రిముఖ పోరు అయినా ప్రధాన పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే సాగనుంది. వైఎస్సార్సీపీ నుంచి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి, గత ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఇనుగంటి సత్యనారాయణ మధ్య పోటీ నెలకొంది. వైఎస్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన రోడ్‌షో, అసెంబ్లీ అభ్యర్థి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వైఎస్సార్ జనభేరి సూపర్‌సక్సెస్ అవడం సానుకూల అంశాలు కానున్నాయని శోభారాణి, ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి ఈసారి సానుభూతిగా కలిసివస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. గొల్లప్రోలు : వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థిగా తెడ్లపు చిన్నారావు బరిలోకి దిగారు. వ్యక్తిగతంగా ఉన్న మంచిపేరుకు ఇతర సానుకూల అంశాలు కూడా ఇక్కడ ఆ పార్టీ విజయావకాశాలను మెరుగుపరుస్తున్నాయి. టీడీపీ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించలేని దుస్థితిని ఎదుర్కొంటోంది. ఏలేశ్వరం : ఇక్కడి 20 వార్డుల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. ప్రధాన పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే జరుగుతోంది. బలమైన నాయకత్వం, కేడర్‌లో నూతనోత్తేజాన్ని నింపిన జగన్మోహన్రెడ్డి రోడ్‌షో వైఎస్సార్సీపీకి సానుకూల అంశాలుగా ఉన్నాయి. ముమ్మిడివరం : ఇక్కడ మూడు వార్డులు ఏకగ్రీవమవగా 17 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. తమకు అంతా సానుకూలంగా ఉందని టీడీపీ తొలుత వేసుకున్న అంచనాలు జగన్మోహన్రెడ్డి పర్యటనతో తలకిందులయ్యాయి. జనభేరి సభకు ప్రజలు పోటెత్తడం, అదే సభలో శెట్టిబలిజ సామాజివకర్గం నుంచి గుత్తుల సాయిని అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీ పరిస్థితి తారుమారైంది. ప్రస్తుతం ఇక్కడ ఫ్యాన్ గాలి జోరుగా వీస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
మనీ.. మనీ
పోలీసుల తనిఖీల్లో భారీగా దొరుకుతున్న నగదు ఆధారాలు చూపించకపోవడంతో సీజ్ ఐటీ అధికారులకూ అప్పగింత గోల్కొండ,బంజారాహిల్స్,న్యూస్‌లైన్: మున్సిపాలిటీ, స్థానిక, సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నగర పోలీసులు తనిఖీలు విస్తృతం చేశారు. అయితే ఆయా పనుల మీద, బ్యాంకుల్లో జమ చేసేందుకు, సొంత పనులకు తీసుకెళ్తున్న నగదు కట్టలు పోలీసులకు పట్టుబడుతున్నాయి. ఆధారాలు చూపిస్తుండడంతో అక్కడికక్కడే ఇచ్చేస్తుండగా..ఆధారాలు లేని నగదును సీజ్ చేస్తున్నారు. శనివారం ఎన్ఎండీసీ చౌరస్తా వద్ద హుమాయున్‌నగర్ పోలీసుల తనిఖీల్లో కారులో తీసుకెళ్తున్న ఓ వ్యక్తి నుంచి రూ.7.80 లక్షలు పట్టుకున్నారు. ఆధారాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. కృష్ణకాంత్ పార్కు వద్ద జూబ్లీహిల్స్ పోలీసుల తనిఖీల్లో ఓ వ్యాపారి నుంచి రూ.5.50 లక్షలు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సాగర్ సొసైటీ వద్ద.. బంజారాహిల్స్ సాగర్‌సొసైటీ చౌరస్తాలో పోలీసులు జరిపిన తనిఖీల్లో ఓ నిర్మాణ సంస్థ ప్రతినిధి నుంచి రూ.8.50 లక్షలు పట్టుకున్నారు. సరైన పత్రాలు చూపించడంతో తిరిగి అప్పగించారు. రూ.9.24 లక్షలు స్వాధీనం మియాపూర్: మియాపూర్ హైవేపై పోలీసులు జరిపిన తనిఖీల్లో ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధి నుంచి రూ.8.24 లక్షలు పట్టుకున్నారు. అలాగే చందానగర్‌లో కారులో వెళుతున్న ప్రసాద్ సుమంత్జైన్ వద్ద రూ.లక్ష స్వాధీనం చేసుకున్నారు. ఉల్లంఘన కేసులు 270 సిటీబ్యూరో: ఎన్నికల కోడ్ ను పక్కాగా అమలు చేసేందుకు పక్షంరోజులుగా నగరంలో చేస్తున్న పోలీసుల తనిఖీల్లో శనివారం వరకు సుమారు రూ.8 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అక్రమంగా తరలుతున్న రూ.55 లక్షల విలువగల బంగారు ఆభరణాలు, రూ.16 లక్షల విలువైన వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు లెసైన్స్ కలిగిన సుమారు 80శాతం ఆయుధాలను స్వాధీనపర్చుకున్నారు. నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీఅయి పరారీలో ఉన్న 470 మంది నిందితులను అరె స్టు చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై సుమారు 270 కేసులు నమోదు చేశారు. రూ.3 లక్షల విలువగల లిక్కర్ పోలీసులకు చిక్కింది. ఏటీఎంలకు తీసుకెళ్తుండగా పట్టివేత దత్తాత్రేయనగర్: గుడిమల్కాపూర్ డివిజన్ యాదవ్‌భవన్ చౌరస్తాలో టప్పాచబుత్ర పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సెక్యూర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీ ఆయా ఏటీఎంలలో పెట్టేందుకు తీసుకెళ్తున్న రూ.1.26 కోట్ల నగదు పట్టుకున్నారు. వాహనంతోపాటు నగదును తరలిస్తున్న జగదీష్‌కుమార్, శివశంకర్లను పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా పూర్తి వివరాలు చూపించినప్పటికీ ఆధారాలు సరిగ్గా లేవని నగదును పోలీసుస్టేషన్‌కు తరలించడం దారుణమని సంస్థ ఉద్యోగులు వాపోయారు. -
పోలీసులకు పెను సవాల్
మన్యం ప్రజాప్రతినిధులకు మావోయిస్టుల లక్ష్మణరేఖ ఏజెన్సీలో ఘర్షణపూరిత వాతావరణం కత్తి మీద సాములా సాధారణ ఎన్నికలు కొయ్యూరు/పెదబయలు, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికలు పోలీసులకు పెను సవాలుగా మారాయి. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు అవకాశం కోసం కాచుకుని కూర్చున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఏజెన్సీలో ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశముందంటూ నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల జిల్లా ఎస్పీ ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో మన్యంలో ప్రచారంలో తిరిగే ప్రజాప్రతినిధులను మట్టుబెట్టడానికి యాక్షన్టీములను నియమించినట్టు తమకు సమాచారముందని ఎస్పీ దుగ్గల్ తెలిపారు. దళసభ్యుల హిట్‌లిస్టులో ఉన్న 36 మంది ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మైదానంతోపాటు ఏజెన్సీలోనూ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటుందన్న వాదన వ్యక్తమవుతోంది. ఇదే అదనుగా తమ ఉనికిని చాటుకోవడానికి మావోయిస్టులు తహతహలాడుతున్నా రు. ఎన్నికల ప్రచారానికొచ్చేవారిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. మావోయిస్టులు ఇటీవల బల పం పంచాయతీ సర్పంచ్ కార్లను చంపడం ద్వారా హింసకు పాల్పడతామని పరోక్షంగా స్పష్టం చేశారు. గత 15 రోజుల నుంచి మిలీషియాతో కలిసి దళసభ్యులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. గతనెల 22న పెదబయలు మండలం గుల్లేలు సమీపంలో మావోయిస్టులు పొక్లెయిన్‌ను దగ్ధం చేసినప్పటి నుంచి ఒక్క సారిగా వాతావరణం వేడెక్కింది. అలా గే గత నెల 27 న పెదబయలు మండలం ఇంజరి అటవీ ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించి ఇంజరి, గిన్నెలకోట, జామిగుడ పంచాయితీ సర్పంచ్‌లు, ఇంజరి మాజీ సర్పంచ్, గిన్నెగరువు,మూలలోవ గ్రామాలకు చెందిన కొందరికి దేహశుద్ధి చేశారు. అంతటితో ఊరుకోకుండా ఊరు విడిచి వెళ్లరాదంటూ లక్ష్మణ రేఖ గీశారు. గ్రామాల్లోని నాయకులపై మిలీషియా సభ్యులు కన్నేసి ఉంచుతున్నారు. అరకు,పాడేరు నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రా లు అన్నింటిని సమస్యాత్మకమైనవిగా అధికారులు పరిగణిస్తున్నారు. పాడేరు నియోజకవర్గంలోని 242 పోలింగ్ కేంద్రాల్లో 130కి పైగా కేంద్రాల్లో ఏమి జరిగినా తెలిసే సమాచార వ్యవస్థ లేదు. ఇవన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో ఆయా కేంద్రాలకు పోలీసు బలగాలు, పోలింగ్‌సిబ్బంది, బ్యాలెట్ బాక్సుల తరలింపు, తీసుకురావడానికి అధికారులు రెండు హెలికాప్టర్లను సిద్ధం చేస్తున్నారు. ఇలా ఈ సారి ఎన్నికలు పోలీసులకు కత్తిమీద సాములా కనిపిస్తున్నాయి. -
ఆట మొదలైంది
ఎన్నికల షెడ్యూల్ విడుదల అమలులోకి ఎన్నికల కోడ్ ఏర్పాట్లలో అధికారులు సమరానికి నేతలు సన్నద్ధం మే 16న ఓటరు తీర్పు సాక్షి ప్రతినిధి, వరంగల్ : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 30న పోలింగ్ జరగనుంది. రాజకీయ నేతల గెలుపోటములు మే16న వెల్లడి కానున్నాయి. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. గత కోడ్ అమలు విషయంలో రాష్ట్రంలోనే వరంగల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి రావడం గతంలో ఎప్పుడూ లేదు. ప్రస్తుతం ఈ రెండు ఎన్నికల నిర్వహణ జిల్లా యంత్రాంగానికి సవాలుగా మారింది. జిల్లాలో 12 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్ లోక్‌సభ పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, భూపాలపల్లి, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్(ఎస్సీ), వర్దన్నపేట(ఎస్సీ) అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మహబూబాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ములుగు(ఎస్టీ), నర్సంపేట, మహబూబాబాద్(ఎస్టీ), డోర్నకల్(ఎస్టీ)తో పాటు ఖమ్మం జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. 2009 ఎన్నికల్లో వరంగల్(ఎస్సీ), మహబూబాబాద్(ఎస్టీ) ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. అసెంబ్లీకి సంబంధించి... కాంగ్రెస్ 7, టీడీపీ 4, టీఆర్ఎస్ 1 సీట్లను గెలుచుకున్నాయి. తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరి తిరిగి గెలుపొందారు. పరకాల ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. మూడు రోజుల క్రితం డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనంపై స్పష్టత వచ్చినా... పొత్తు విషయం తేలకపోవడంతో నేతలు పూర్తి స్థాయిలో ఎన్నికలపై దృష్టి పెట్టడం లేదు. తెలంగాణ ఇచ్చిన ఘనతతో ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్‌కు సంబంధించి ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ జైత్రయాత్ర ర్యాలీకి జనం నుంచి స్పందన లేకపోవడం పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జనగామ, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌లో విలీనం ఉండదని కేసీఆర్ ప్రకటించడంతో టీఆర్ఎస్ నేతల్లో ఊపు వచ్చింది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం భిన్నమైన అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2009లో కేవలం వరంగల్ పశ్చిమ స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 4కు చేరింది. తెలంగాణ ఏర్పాటు విషయంలో అస్పష్ట వైఖరితో టీడీపీలో ఇంకా అయోమయం నెలకొనే ఉంది. 2009 ఎన్నికల్లో పొత్తులతో పాలకుర్తి, నర్సంపేట, ములుగు, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుంది. డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ మార్చి 3న టీఆర్ఎస్లో చేరడం ఎన్నికల ముందు పార్టీకి దెబ్బగా మారింది. వైఎస్సాఆర్సీపీ సాధారణ ఎన్నికలకు సన్నద్ధమైంది. పాలకుర్తి, వరంగల్ తూర్పు, స్టేషన్ ఘన్పూర్, నర్సంపేట, డోర్నకల్, వర్ధన్నపేట, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. త్వరలో ప్రచారం ప్రారంభించనున్నారు. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీలో కొంత ఊపు కనిపిస్తోంది. నరేంద్రమోడి ప్రధాని అభ్యర్థిత్వంతో సానుకూలత వస్తున్నా.. ఇటీవల తెలంగాణపై పార్టీ వైఖరితో కొంత ఆందోళన నెలకొంది. గతంలో జిల్లాలో బీజేపీకి ప్రాతినిధ్యం ఉండేది. 2004 ఎన్నికల వరకు ఒక ఎమ్మెల్యే ఉండేవారు. తర్వాత పరిస్థితి దిగజారింది. మహబూబాబాద్, పరకాల, భూపాలపల్లి, జనగామ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సీపీఐ ఏర్పాట్లు చేసుకుంటోంది. వరంగల్ తూర్పు, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, మహబూబాబాద్‌లో పోటీ చేసేందుకు సీపీఎం సన్నద్ధమవుతోంది. కొత్తగా ఆవిర్భవించిన మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ వర్ధన్నపేట(ఎస్సీ) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన స్థానాల్లో ఎక్కడెక్కడ పోటీ చేయనుందనేది త్వరలో తేలనుంది.